పొగబెడుతున్నాయ్..

పొగబెడుతున్నాయ్..


- జిల్లాలో కాలుష్యం దారుణం

- పరిశ్రమలకు భయం, భక్తి లేవు

- కాలుష్య కారక కంపెనీలకు నోటీసులు

- పరిశ్రమల శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి ఆగ్రహం

సంగారెడ్డి జోన్:
‘జిల్లాలో కాలుష్య కారక కంపెనీలకు భయం, భక్తి లేవు.. కాలుష్యాన్ని ఇష్టానుసారం వెదజల్లుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. జిల్లాలోని అటువంటి పరిశ్రమలను గుర్తించి నోటీసులు పంపుతా’మని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ అధికారులు, పారిశ్రామిక సంస్థలతో గురువారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై సర్వే నిర్వహించి నివేదిక అందజేయాల ని పీసీబీ అధికారులను ఆదేశించారు.



పటాన్‌చెరు, పాశమైలారంలో కాలుష్యం దారుణంగా వుందని, ని యంత్రణకు ఏ చర్యలు తీసుకున్నారని మంత్రి ప్రశ్నిం చగా కాలుష్య నియంత్రణ శాఖ ఈఈ భిక్షపతి బదులిస్తూ 2 కాలుష్య కారక కంపెనీలను మూసివేయించామని చెప్పారు. జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్‌ఆర్ కింద గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధికి పాటు పడాలని జూపల్లి సూచించారు.

 

నిజమైన లబ్ధిదారులకే రుణాలు

పీఎంఈజీపీ పథకం కింద నిజమైన అర్హులను గుర్తించి రుణాలివ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డీఐసీ జీఎం సురేష్‌ను ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరంలో జిల్లాలో 16 శాతం మాత్రమే గ్రౌండింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే దరఖాస్తులు తక్కువొస్తున్నాయని తేటతెల్లమవుతోందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. సంగారెడ్డి మండలంలో 1982లో ఓడీఎఫ్ పరిశ్రమ ఏర్పాటులో ప్రజల నుంచి భూమిని తీసుకున్నారని, ఇంకా 44 మంది భూ బాధితులకు నష్టపరిహారం అందలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. వారికి రూ.1.48 కోట్ల మేరకు అందజేయాల్సి వుందన్నారు.



దీనిపై డీఐసీ జీఎం సురేష్‌ను మంత్రి ప్రశ్నించగా ఈ ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో వుందన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బీహెచ్‌ఈఎల్ అనుబంధ పరిశ్రమలు దాదాపు 44 ఈ ఏడాది మూత పడ్డాయని, దీనివల్ల ఆర్డర్లన్నీ పోతున్నాయన్నారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి బదులిచ్చారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, ఐసీసీ ఎండీ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top