‘ఓటుకు కోట్లు’ కుట్ర బాబు కనుసన్నల్లోనే..

సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తున్న పోలీసులు - Sakshi


* సండ్ర రిమాండ్ రిపోర్టులో పూసగుచ్చిన ఏసీబీ

* సెబాస్టియన్ సెల్‌ఫోన్‌లో రికార్డయిన కాల్స్ గుర్తింపు..

* వారంలో 32 సార్లు మాట్లాడుకున్న సండ్ర-సెబాస్టియన్ అన్నీ ‘సార్’కు చెప్పాను

* మహానాడు కంటే ఎమ్మెల్యేలను కొనడమే ముఖ్యం

* స్టీఫెన్‌సన్‌ను ఒప్పించండి.. సెబాస్టియన్‌తో సండ్ర

* ఆయన సూచనల మేరకు ముందుకెళ్లిన సెబాస్టియన్

* డైరెక్ట్‌గా బాబు దగ్గరికి తీసుకెళ్తానని స్టీఫెన్‌సన్‌కు హామీ

* ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా కుట్ర అనంతరం రంగంలోకి రేవంత్‌రెడ్డి

* ఇది పూర్తిస్థాయిలో వ్యవస్థీకృత నేరమని కోర్టుకు ఏసీబీ నివేదన


 

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారమంతా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పర్యవేక్షణలోనే జరిగినట్లు ఏసీబీ నిగ్గుతేల్చింది. బాబు డైరెక్షన్‌లోనే ఈ కుట్ర జరిగినట్లు ఈ వ్యవహారంలో భాగస్వాములైన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు సెబాస్టియన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు నిర్ధారిస్తున్నాయి. దాదాపు రూ. 150 కోట్ల ఈ కుంభకోణం కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు జరిగిన వ్యూహ రచనను మంగళవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి అందజేసిన ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు సెబాస్టియన్ ద్వారా సండ్ర నడిపిన మంత్రాంగానికి సంబంధించిన కాల్ రికార్డులను, ఎవరెవరితో సంభాషణలు జరిపారనే మొత్తం తతంగాన్ని న్యాయస్థానం ముందుంచింది.



వాటిల్లో... ‘ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని సార్ (చంద్రబాబు)కు, జనార్దన్‌కు చెప్పా’లని సండ్రను సెబాస్టియన్ పదేపదే కోరారు. దీంతో ‘అన్ని విషయాలు సార్‌కు చెప్పా’నని సండ్ర వివరించారు. ‘మహానాడులో పాల్గొనకపోతే సార్ (చంద్రబాబు) ఏమైనా అంటారేమో’నని సెబాస్టియన్ అనుమానం వ్యక్తం చేయగా.. ‘అన్నీ ఆయనకు చెబుతా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉండా’లని సండ్ర సూచించారు. దీనిని బట్టి చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి చంద్రబాబే సూత్రధారి అని స్పష్టమవుతోంది. అసలు ఈ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ఎంత కీలకంగా వ్యవహరించారో, సండ్ర కూడా అంతే కీలకంగా వ్యవహరించారని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు కేవలం ఒకరిద్దరి ఆలోచన కాదని, ఇది పూర్తిస్థాయిలో వ్యవస్థీకృత నేరమని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కేంద్రంగా ఈ వ్యవహారం నడిచిందని వెల్లడించింది.

 

 సండ్ర, సెబాస్టియన్‌ల మధ్య ఫోన్ సంభాషణల్లోని ముఖ్య అంశాలు..

 అదే ముఖ్యం.. ‘సార్ ఎన్టీఆర్ సమాధి దగ్గరికి వచ్చారు. ఫ్లవర్స్ చల్లి వెళ్లిపోయారు. తర్వాత మీరు చెప్పిన పని గురించి అక్కడికి వెళ్లిపోయా..’’ అని మే 28వ తేదీన సెబాస్టియన్ సండ్రకు వివరించగా.. ‘అదే ముఖ్యం’ అంటూ సండ్ర మూడుసార్లు సెబాస్టియన్‌కు చెప్పారు. అప్పటికే ఓ బృందం స్టీఫెన్‌సన్‌ను కలసినట్లు సెబాస్టియన్ వివరించారు.

 

 డైరెక్ట్‌గా బాబు దగ్గరికి..

 స్టీఫెన్‌సన్‌కు నాలుగు ఆప్షన్స్ ఇచ్చినట్లు సండ్రకు సెబాస్టియన్ వివరించారు. ‘‘తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చా. నీకు అండగా ఉంటాం. నీకేం కావాలన్నా డెరైక్ట్‌గా బాబు దగ్గరికి తీసుకెళ్లే సత్తా నాకుంది. నీకేం కావాలో చెప్పమని స్టీఫెన్‌సన్‌కు చెప్పిన. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది. బీజేపీ ఉంది. మీక్కావాలంటే ఇక్కడ కాకపోయినా మేం ఢిల్లీ వరకూ రికమెండ్ చేయగలుగుతాం. ఏదైనా మైనార్టీ కమిషన్‌లో బోర్డు మెంబర్‌గా లేదా ఆంధ్రాలో ఇంకా మాకు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సీటివ్వలేదు. మీ చుట్టాలు ఉంటే రికమెండ్ చేయి. బాబుతో మాట్లాడతానన్నాను. మన ప్రభుత్వం ఉంది. ఆంధ్రాలో నీకేపని కావాలన్నా ప్రతి మంత్రీ చేసిపెడతాడు నీకు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మన టీడీపీ అధికారంలోకి వస్తుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేగా మళ్లీ నీ పేరు సిఫార్సు చేస్తామని స్టీఫెన్‌సన్‌కు చెప్పిన..’’ అని సండ్రకు సెబాస్టియన్ తెలిపారు. ‘‘నా మాటలతో ప్లీజింగ్ అయిపోయిండు, పొద్దుగాల వచ్చినవాళ్లు వేరే విధంగా మాట్లాడిండ్రు అని చెప్పిండు. వాళ్లను పక్కన బెట్టు. నేనేం చేస్తానో అది అయితది. మీ ఇష్టం మరి అని చెప్పిన..’’ అని వివరించారు.

 

 ఎమ్మెల్యేలను కొనాలె..

 ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేయాలి. డబ్బుకు లొంగుతాడేమో చూడండి. మన పార్టీకి సహకరించాలని అడగాలి. ఆయనకు ఫర్‌దర్ (ముందు ముందు) రాజకీయాలతో అవసరం లేదు కదా? మేమంటే ఎన్నికల్లో గెలవాలి. ఒకసారి నామినేట్ అయితే అయిపోద్దికదా. డబ్బు ముఖ్యం కదా ఆయనకు. 1వ తేదీన పోలింగ్ ఉంది. ఈలోపుగా అన్నీ పూర్తి చేయాలి..’’ అని సెబాస్టియన్‌కు సండ్ర దిశా నిర్దేశం చేశారు. ‘‘ఓటు వేసేందుకు ఆయన అంగీకరిస్తే డబ్బుకు నాదీ పూచీ. ఆయన ఎవరిపేరు చెప్తే అక్కడబెడదాం. మధ్యవర్తి అయినా ఫరవాలేదు. ఓటు వేసేందుకు అంగీకరించకపోతే ఆయన్ను ఓటు వేయకుండా తప్పించేందుకు ప్రయత్నిద్దాం. ఓటింగ్ రోజున ఏ బాంబేకో, కలకత్తాకో వెళ్లిపోయేట్లు మనం ఏర్పాట్లు చేయాలి. ఓటింగ్‌కు దూరంగా ఉన్నా ఫర్వాలేదు. అయితే ఓటు వేసేందుకే ఒప్పించండి..’’ సూచించారు.

 

 ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా కుట్ర

 డ్రైవర్ల ఎంపికలోనూ సండ్ర అండ్ కో జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. మోతీనగర్ (సెబాస్టియన్ కార్యాలయం), సికింద్రాబాద్ చుట్టూ ఈ ‘ఓటుకు కోట్లు’ కుట్ర జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్రకు సంబంధించిన కీలక భేటీలు పార్టీ కార్యాలయంలోనే జరిగినట్లు, పార్టీ కార్యాలయం ముందు, క్యాంటీన్‌లోనూ కీలక సమావేశాలు జరిగినట్లు తేలింది. కొందరు వ్యక్తులను కలిసేందుకు టీడీపీ నేతలు బిషప్ సాయం కూడా తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. సులభంగా గుర్తించే అడ్రస్‌లలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సండ్ర సూచించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసుకొని చివరికి రేవంత్‌రెడ్డిని రంగంలోకి దింపినట్లు సమాచారం. కుట్రకు వ్యూహ రచన మొదలుకొని ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని సండ్రకు సెబాస్టియన్ ఎస్సెమ్మెస్‌లుగా పంపుతూనే ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది.

 

 ఉదయం మహానాడు.. సాయంత్రం కుట్ర

 ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని చూస్తున్నానని చంద్రబాబుకు అంతకుముందే వివరించినట్లు సెబాస్టియన్‌కు సండ్ర చెప్పారు. మహానాడులో పాల్గొనకపోతే బాబు ఏమైనా అంటారేమోనని సెబాస్టియన్ అనుమానం వ్యక్తం చేయగా.. ‘అన్నీ సార్ (చంద్రబాబు)కు చెప్పా’నని సండ్ర స్పష్టం చేశారు. మహానాడులో పాల్గొనడం కన్నా మనకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే ప్రధానమని సెబాస్టియన్‌తో సండ్ర పదేపదే చెప్పారు. ‘‘నామినేటెడ్ ఎమ్మెల్యే మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటే మహానాడు ఎగ్గొట్టి అయినా వచ్చేస్తా. ఆయన అనుమానాలు, సందేహాలు అన్నీ నివృత్తి చేస్తా..’’ అని వివరించారు. ఇలా సండ్ర ఒకవైపు మహానాడులో పాల్గొంటూనే సెబాస్టియన్‌తో కొనుగోలు వ్యవహారాన్ని పర్యవేక్షించారు. మహానాడులో జామర్లు ఉంటాయి కాబట్టి తమ డ్రైవర్ బాషాకు ఫోన్ చేయాలని చెప్పారు.

 

 ఎవరీ జనార్దన్..

 స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు తాను ప్రయత్నిస్తున్న విషయాన్ని సార్ (చంద్రబాబు)తోపాటు జనార్దన్‌కు తెలపాలని పదేపదే సెబాస్టియన్ సండ్ర వెంకట వీరయ్యతో అన్నారు. ప్రతి విషయాన్ని జనార్దన్‌కు తెలియజేస్తున్నట్లు సండ్ర సెబాస్టియన్‌కు వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శే ఈ జనార్దన్. కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ పదవిలో పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. చంద్రబాబుకు జనార్దన్ అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యవహారాల్లో చక్రం తిప్పే కీలక వ్యక్తిగా పేరుంది.

 

 సెల్ నంబర్లు... సంభాషణలు

 మే 31న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సమయంలో ఏసీబీ అధికారులు రేవంత్, ఉదయ సింహ, సెబాస్టియన్‌లు ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపారు. కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ సెల్‌ఫోన్‌లో కొన్ని కాల్స్ రికార్డయి ఉన్నట్లుగా విశ్లేషణ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎల్ గుర్తించింది. మే 23 నుంచి మే 31 వరకు మొత్తం 32 సార్లు సెబాస్టియన్-సండ్ర వెంకట వీరయ్యలు మాట్లాడుకున్నారని స్పష్టం చేసింది.

 

 ఎమ్మెల్యే కొనుగోలు ఆపరేషన్ కోసం సండ్ర రెండు ఫోన్ నంబర్లు 8790825678, 9440625955లలో మాట్లాడారు. ఈ రెండు నంబర్లు సండ్రవేనంటూ సంబంధిత టెలికం కంపెనీల నుంచి ఏసీబీ వివరాలు కూడా తీసుకుంది. ఎమ్మెల్యే కొనుగోలు సమయంలో సండ్ర 8790825678 నంబర్ నుంచి 9505900009 నంబర్‌లో ఉన్న రేవంత్‌రెడ్డితో 18 సార్లు మాట్లాడారు. అదే సమయంలో రేవంత్ కూడా వీరయ్యకు రెండుసార్లు కాల్ చేశారు. ఈ కాల్స్ అన్నీ కూడా మే 24 నుంచి మే 31 మధ్య జరిగినవే. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ.. మరో 19 సార్లు సండ్ర, రేవంత్, సెబాస్టియన్‌ల మధ్య సంభాషణలు జరిగాయని సవివరంగా కోర్టుకు నివేదించింది. సండ్ర ఫోన్ నంబర్లు 8790825678, 9440625955ల నుంచి సెబాస్టియన్ ఫోన్ నంబర్ 9394326000కు కాల్స్ వెళ్లాయని ఏసీబీ నిర్ధారించింది.

 

సెబాస్టియన్ ఫోన్‌లో రికార్డు

 ఎమ్మెల్యే కొనుగోలు కోసం సెబాస్టియన్ హెచ్‌టీసీ మొబైల్‌ఫోన్ ద్వారా మాట్లాడారు. సెబాస్టియన్ పలువురితో జరిపిన సంభాషణలన్నీ ఈ ఫోన్‌లో రికార్డయ్యాయి. సెబాస్టియన్‌ను అరెస్టు చేసినప్పుడు ఈ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. తర్వాత దానిని విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఆ సంభాషణలన్నీంటినీ గుర్తించి విశ్లేషించారు. మే 27 నుంచి 30వ తేదీ మధ్య సెబాస్టియన్, సండ్ర మధ్య జరిగిన ఈ సంభాషణలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సెబాస్టియన్, సండ్రలు యాదృచ్ఛికంగా వారి కుట్రను వారే బయటపెట్టుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top