బాలకార్మికులు పనికి రావొద్దు


స్పందించిన స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దశాబ్దాల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటైన పలు స్పిన్నింగ్ మిల్లుల కార్మికుల సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోని తీరుపై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో మిల్లుల యాజమాన్యాలు అంతర్మథనంలో పడ్డాయి. ఆమనగల్లు, మిడ్జిల్, కల్వకుర్తి, అడ్డాకుల ప్రాంతాల్లో ఉన్న స్పిన్నింగ్ మిల్లుల యజమానులు బాలకార్మికులను పనిలోకి రావద్దంటూ ఆదేశాలు జారీచేశారు.


కార్మికులకు ఎవరికైనా పని కావాలంటే తమకు 18 సంవత్సరాలు నిండినట్లుగా ఆధార్ కార్డులో నమోదైతేనే పనిస్తామంటూ నిబంధనలు పెట్టారు. దీంతో సోమవారం ఆయా స్పిన్నింగ్ మిల్లుల్లో బాలకార్మికులు విధులకు హాజరుకాలేదు. అయితే బాలకార్మికుల స్థానంలో కొత్త కార్మికులను పెట్టుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావి స్తోంది.


కేవలం కొద్దిరోజులు బాలకార్మికులను పక్కనపెట్టి తర్వాత వారినే అదే తక్కువ వేతనంతో పనిలో పెట్టుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకార్మికులను పనికి రావద్దని చెప్పిన యాజమాన్యాలు.. వారిని ప్రభుత్వానికి అప్పజెప్పకపోవడం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు గాని చదువుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల వందలాది బాలకార్మికులకు మాత్రం పని భారం నుండి విముక్తి లభించినట్లయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top