నామినేటెడ్ గోల


 అధికారం వచ్చి ఏడాది పూర్తయినా

 దక్కని నామినేటెడ్ పోస్టులు

 పాతకాపులకు పోటీగా మారుతున్న కొత్తకాపులు

 తొలివిడత జాబితా ఇప్పటికే అధిష్టానం వద్దకు!

 కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ కోసం నేతలఎదురుచూపులు

 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘ప్రత్యేక రాష్ట్ర సాధనలో ‘గులాబీ’ జెండా నీడన శ్రమించాం. తెలంగాణ వచ్చింది.. గులాబీ పార్టీకి అధికారం దక్కింది.. కానీ మాకు మాత్రం ఎలాంటి రాజకీయ ప్రయోజనమూ లేదు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఎప్పుడు చేస్తారో ఏంటో? మాకు పదవులు ఎప్పుడు వస్తాయో ఏంటో?’... ఇదీ ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ కేడర్‌లో కనిపిస్తోన్న ఆవేదన. పైకి చెప్పినా చెప్పకున్నా ప్రతి కార్యకర్త, నాయకుడు నామినేటెడ్ పోస్టుల పందేరం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. పదవుల పందేరానికి నెలరోజుల్లో శ్రీకారం చుడతానని నాగార్జునసాగర్ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా నేటికీ మొదలు కాకపోవడంతో గులాబీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకుం టోంది. ఈ నామినేటెడ్ నైరాశ్యానికి తోడు పార్టీలోకి వెల్లువలా వచ్చి చేరుతున్న వారంతా తమకు ఎక్కడ పోటీ అవుతారనే ఆవేదన పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారిలో వ్యక్తమవుతోంది.

 

 జాబితా చేరిందా?

 అధికారం వచ్చి 14 నెలలు కావస్తున్నా నామినేటెడ్ పోస్టుల కోసం టీఆర్‌ఎస్ నాయకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డెరైక్టర్లు, కమిషన్ సభ్యులు, ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం అన్ని స్థాయిల్లో నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ తరఫున గత ఎన్నికలలో పోటీ చేసిన వారినుంచి టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఇ ప్పటివరకు గులాబీ జెండాను మోస్తున్న వారి వరకు ఈ పదవులు ఆశిస్తున్నారు. వీరిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం మొదటినుంచీ పనిచేస్తున్న వారు, మండల పార్టీల అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కానీ, కనీసం మార్కెట్‌కమిటీ చైర్మన్లకు సంబంధిం చిన నియామకాలు కూడా జరగకపోవడంతో వీరం తా తమకు పదవులు ఎప్పుడు వ స్తాయా అనే ఆవేదనలో ఉన్నారు.

 

  అయితే, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు చేపడతారన్న దాన్ని పక్కన పెడితే ఎవరికి ఇవ్వాలనే దానిపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోం ది. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలతో మాట్లాడి తొలివిడతలో ఎవరికి పద వులి వ్వాలనే జాబితాను పార్టీ అధిష్టానానికి పంపినట్టు అధికార పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ ఎ ప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు? తొలి విడతలో జిల్లాకు ఎంత ప్రాధాన్యమిస్తారో వేచి చూడాల్సిందే.

 

 పాత రక్తమా? కొత్త స్నేహమా?

 వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లాలో అంత పటిష్టంగా ఏమీ లేదు. కానీ అనూహ్యంగా టీఆర్‌ఎస్‌కు ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని జిల్లా ప్రజలు కట్టబెట్టడంతో వేయి ఏనుగుల బలం ఆ పార్టీకి లభించినట్టయింది. దీనికి తోడు రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్ అధికారంలోనికి రావడంతో దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న వారంతా తమకూ మంచి రోజులు వచ్చాయని, రాజకీయంగా మంచి పదవులు లభిస్తాయని ఆశించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న బండా నరేందర్‌రెడ్డి నుంచి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నేతల వరకు పదవులు ఆశించినవారే.

 

 నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వారయితే కచ్చితంగా తమకు పదవులు వచ్చినట్టేనని భావించారు కూడా. కానీ, అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీలోకి వలసలు పెద్దఎత్తున వచ్చాయి. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యూహరచనతో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో టీఆర్‌ఎస్ బలోపేతమైంది. వార్డు సభ్యుల మొదలు జిల్లా పరిషత్ చైర్మన్, మదర్‌డెయిరీ చైర్మన్‌లను కూడా ఆయన వ్యూహాత్మకంగా పార్టీలోకి తీసుకున్నారు. పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలుగా పనిచేసిన వేనేపల్లి చందర్‌రావు లాంటి నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్ లాంటి నాయకులు టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచీ పార్టీలో పనిచేస్తున్న వారికి కొత్త గుబులు పట్టుకుంది.

 

  అసలు జిల్లాకు ఎన్ని నామినేటెడ్ పదవులు వస్తాయి? అందులో పాత వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందా? కొత్త కాపులకే అవకాశాలిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీల్లో పెద్ద స్థానాల్లో పనిచేసిన వారికి తప్పనిసరిగా ఏదో ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, రాష్ట్రస్థాయిలో, ఇటు జిల్లా స్థాయిలో కూడా కేసీఆర్ ఇదే వైఖరిని అవలంబిస్తున్నందున పాతకాపులకు ఎలాంటి పదవులు వస్తాయోననే మీమాంస నెలకొంది. అయితే, త్వరలోనే స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని, నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు కూడా నాయకులకు లభిస్తాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ నాయకుడు వెల్లడించడం గమనార్హం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top