పక్కనే మంజీర.. అయినా ఎక్కిళ్లే..


 రాయికోడ్, న్యూస్‌లైన్: పక్కనే మంజీర పారుతున్నా.. చుక్కనీరు అందక రాయికోడ్ కన్నీళ్లు పెడుతోంది. నిత్యం నీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కేవలం రూ. 60 కోట్లు నిధులు ఖర్చు చేస్తే 47 గ్రామాలకు దాహార్తిని తీర్చే మంచినీటి పథకంపై పాలకులు శీతకన్ను వేశారు. పాంపాడ్ గ్రామ శివారులో మంజీర నదిలో అంతర్గత బావిని నిర్మించి, 100 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్లతో మంజీరా నీటిని ఆయా గ్రామాలకు తరలించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఈమేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి  రూ. 60 కోట్లు అవసరమవుతాయని అధికారు లు ప్రతిపాదనలు పంపారు. కానీ వైఎస్సార్ మరణంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2012 వార్షిక బడ్జెట్‌లో రూ.37.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పథకం సర్వే పనులే ఏడాదిపాటు సాగాయి.



 పాంపాడ్‌లో అంతర్గత బావి..

 రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని 47 గ్రామాలకు నీరందించేందుకు మండల పరిధిలోని పాంపాడ్ నుంచి రెండు మండలాల్లోని ఆయా గ్రామాలకు సుమారు 150 కిలో మీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనుల మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 40 కిలోమీటర్ల మేర పైపులైను మాత్రమే ఏర్పాటైంది. అది కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. అంతర్గత బావి, ఫిల్టర్ బెడ్ నిర్మాణాల పనులు కూడా సాగుతున్నాయి. పనులు ఇలానే కొనసాగితే అంచనా వ్యయం భారీగా పెరగటంతో పాటు, ఏళ్ల తరబడి ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



 ఈ పథకం ద్వారా రాయికోడ్ మండలంలోని 29 గ్రామా లు, మునిపల్లి మండలంలోని 18 గ్రామాలకు చెందిన 60 వేల జనాభాకు మంజీర నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మండలంలోని మహబత్‌పూర్ గ్రామంలో 1.75 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును నిర్మించాలి. అదేవిధంగా మహమ్మదాపూర్, ఝరాసంఘం మండలంలోని కప్పాడ్, ము నిపల్లి మండలంలోని మేళసంఘం గ్రామాల్లో మరో మూడు 90 వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకులను నిర్మించనున్నారు.



 ప్రజల్లో నైరాశ్యం

 వేసవి వచ్చిందంటే ఆయా మండలాల్లోని గ్రామీణులు గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలుసార్లు ప్రభుత్వాధికారులకు, నాయకులకు తమ గోడును విన్నవించారు. ఏడేళ్లు గడుస్తున్నా అధికారులు ఇదిగో వచ్చే.. అదిగో వచ్చే అని చెప్తున్నారే కాని కాల్వ నిర్మాణ పనులు మాత్రం పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top