సాగేనా.. ఆగేనా?

సాగేనా.. ఆగేనా?


► వట్టిపోయిన ప్రధాన ప్రాజెక్టులు..     

► ఆగస్టు దాటితేగానీ నిండేలా లేవు




నైరుతి వచ్చింది. రాష్ట్రమంతటా ఏరువాక మొదలైంది. కానీ కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వట్టిపోయి కళ తప్పడంతో వాటి కింద ఖరీఫ్‌ సాగు డోలాయమానంలో పడింది. వర్షాలిప్పటికే మొదలైనా, ప్రాజెక్టుల్లోకి మాత్రం ఆగస్టు, సెప్టెంబర్‌కు గానీ నీరొచ్చే పరిస్థితి లేదు. అప్పుడు కూడా 100 టీఎంసీల దాకా తాగు అవసరాలకు వాడాకే సాగుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తుండటం ప్రాజెక్టుల పరిధిలోని రైతులను కలవరపరుస్తోంది. ఈ పరిణామం సుమారు 30 లక్షల ఎకరాల్లో సాగుపై ప్రభావం చూపేలా ఉంది.



ఏం జరిగింది?

గతేడాది మంచి వర్షాలే కురిసినా, ప్రాజెక్టుల్లోని నీటితో చెరువులను నింపడం, కాల్వలకు మళ్లించడం, తాగు అవసరాల కోసం అడుగుదాకా వాడేయడంతో అవి వట్టి కుండల్లా మారాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో 681 టీఎంసీల వాస్తవ నిల్వలకు 180 టీఎంసీలే ఉన్నాయి. ఈ నిల్వల్లోనూ 15 టీఎంసీలకు మించి వాడుకోగలిగే పరిస్థితి లేదు. కర్ణాటక, మహారాష్ట్రల్లో నారాయణపూర్, ఆల్మట్టి వంటి ప్రాజెక్టుల్లో గతేడాది కంటే నిల్వలు సగానికి పైగా తగ్గిపోవడం పులిమీద పుట్రలా మారింది. దాంతో, వర్షాలు కురుస్తున్నా ప్రాజెక్టుల్లో నీటి రాక మొదలవలేదు.



ఏం జరుగుతోంది

ఎగువ ప్రాజెక్టుల్లో నీరు నిండేందుకే మరో రెండు నెలలైనా పడుతుంది. అదీ వర్షాలు బాగుంటేనే! ఆ తర్వాత మనకు నీరొచ్చినా సాగర్‌లో 40, ఎస్సారెస్పీలో 20, శ్రీశైలంలో 40 చొప్పున 100 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాలన్నది ప్రభుత్వ యోచన. ఆ తర్వాతే సాగు అవసరాలకు నీరిస్తారు.



ఏటా ఇదే దుస్థితి

ప్రాజెక్టుల్లో ఆశించినంతగా నీరు రాకుంటే 30లక్షల ఎకరాలపై ప్రభావం పడే ప్రమాదముంది. సాగర్‌ ఎడమ కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలో కాల్వల కింద 2.8 లక్షల ఎకరాలు, లిఫ్టుల కింద 47వేలు, ఖమ్మంలో 2.82 లక్షలు, జూరాల కింద లక్ష, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ల కింద మరో 10 లక్షల ఎకరాలకు సకాలంలో నీరివ్వడం కష్టమవుతుంది.


ఈ ఏడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, కల్వకుర్తి, దేవాదుల కింద ఈ ఖరీఫ్‌లో కొత్తగా మరో 6 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్న సంకల్పానికీ విఘాతం కలిగేలా ఉంది. పైగా ప్రాజెక్టుల ద్వారా చెరువులు నిండకపోతే మరో 5 లక్షల ఎకరాలపై నాప్రభావం పడేలా ఉంది. నిజానికి ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు ఏటా పంటలు వేయడం, కోతకు సిద్ధమైన దశలో చివరి తడులకు నీరందక వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతూ వస్తోంది. పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. అందుకే ఈసారి ఖరీఫ్‌ ఆయకట్టుపై స్పష్టత రావాలంటే సెప్టెంబర్‌ దాకా ఆగాలని సాగునీటి వర్గాలు రైతులకు సూచిస్తున్నాయి.



సింగూరు, కడెం నుంచి నీటి విడుదల: సింగూరు, కడెం ప్రాజెక్టుల నుంచి మాత్రం నీటి విడుదలకు సాగునీటి మంత్రి హరీశ్‌రావు తాజాగా ఆదేశించారు.     – సాక్షి, హైదరాబాద్‌


ప్రధాన ప్రాజెక్టుల కింద ఆయకట్టు (ఎకరాల్లో)

ఎస్సారెస్పీ             9,68,640

నిజాంసాగర్‌           2,00,000

నాగార్జునసాగర్‌     6,60,814

బీమా                   2,00,000

కల్వకుర్తి              3,00,000

నెట్టెంపాడు           1,50,000

జూరాల                1,04,141

కడెం                      68,150

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top