నీడ..నీరు లేదు


► ఉపాధిహామీ కూలీలకు సౌకర్యాల కరువు

► తాగునీరూ వెంట తెచ్చుకోవల్సిందే..

► పట్టించుకోని అధికారులు

► మొత్తం జాబ్‌ కార్డులు 1,14,743. కూలీలు 2,50,957

► పనులు చేస్తున్న కూలీలు 1,31,881

 

ఉపాధిహామీ కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతున్న కొద్ది పనులు చేయడం ఇబ్బందిగా మారింది. పని ప్రదేశంలో అధికారులు కనీస వసతులైన నీడ, నీటి సౌకర్యం కల్పించడం లేదు. దీంతో కూలీలు ఎర్రని ఎండలో పనిచేయాల్సి వస్తోంది. నీళ్లు కూడా వెంట తెచ్చుకోవల్సిన దుస్థితి నెలకొంది. కౌటాల మండలంలోని యాపలగూడ, తలోడి గ్రామాల్లో మంగళవారం ఈ పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా కూలీలు ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు.

 

కౌటాల : ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదు. జిల్లాలో మొత్తం 1,14,743 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 69,556 వేల కుటుంబాల్లో 2,50,957 కూలీలు ఉన్నారు. ఇందులో 1,31,881మంది పనిచేస్తున్నారు. వీరిలో గతేడాది 3,664 మంది కూలీలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేశారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగి ఉన్నా ప్రభుత్వం కూలీలకు కనీస వసతులు కల్పించడం లేదు.

 

ఉపాధి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు నీరు లేక..సేద తీరేందుకు నీడ లేక.. ఎండలోనే పనులు చేస్తూ కూలీలు వడదెబ్బకు గురువుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలు ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. గతంలో ఉపాధిహామీ కూలీలకు నీడ సౌక్యర్యం లేక ఎండదెబ్బకు పలువురు కూలీలు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు ఈ సంవత్సరం కూడా కూలీలకు నీడ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో అనేక మంది కూలీలు పనులకు రావడం లేదు.

ఇబ్బందుల్లో కూలీలు

ఉపాధి పని ప్రదేశాలలో నీడ, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కూలీలు ఇంటి నుంచే తాగునీరు తెచ్చుకోవల్సి వస్తోంది. ఆ నీళ్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలోని నీరు ఎండకు వేడి కావడంతో కూలీలు తాగలేకపోతున్నారు. పనులు చేస్తున్న సమయంలో కూలీలు గాయాల పాలైనా..అనారోగ్యానికి గురైన ప్రాథమిక చిక్సిత అందించేందుకు ఎక్కడా మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. టెంట్లు కూడా లేకపోవడంతో నీటి సీసాలను చెట్ల కింద ఉంచాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. ముఖ్యంగా కౌటాల మండలంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో ఏ ఒక్క చోట కూడా ఎండలకు టెంట్లు వేసిన దాఖాలలు కనిపించడం లేదు. వడదెబ్బ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈజీఎస్‌ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.

 

కనీస సౌకర్యాలు కల్పించాలి

పని చేసే ప్రదేశంలో తాగు నీరు, నీడ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎండా కారణంగా అనేక మంది కూలీలు పని మానేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి, నీడ సౌకర్యాం కల్పించాలి. - బెడ్డల తుర్సబాయి, ఉపాధికూలీ, యాపలగూడ 82

 

నీళ్లు తెచ్చుకుంటున్నాం

ఇంటి నుంచే నీటి సీసాలు వెంట తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లు ఎండకు వేడి అవుతున్నాయి. దీంతో నీటి తిప్పలు తప్పడం లేదు. మెడికల్‌ కిట్టు అందుబాటులో ఉంచడం లేదు.- దుర్గం అర్జున్, ఉపాధికూలీ, ధనురుహెట్టి 83

 

టార్ఫాలిన్లు ఇచ్చాం

మండలంలో పని చేస్తున్న కూలీలకు ఈ సంవత్సరం ప్రభుత్వం పంపిణీ చేసిన టార్ఫాలిన్‌ కవర్లను ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు అందించాం. మెడికల్‌ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయలేదు. కూలీలు ఎక్కువగా ఉండడంతో టార్ఫాలిన్‌ అందరికీ అందించలేకపోయాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.- పూర్ణిమ, ఈజీఎస్‌ ఏపీవో, కౌటాల 84
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top