బోధనకు ఎగనామం.. కబుర్లతో కాలక్షేపం!

బోధనకు ఎగనామం.. కబుర్లతో కాలక్షేపం! - Sakshi


బదిలీల ప్రక్రియతో బడిలో గందరగోళం కొత్త టీచర్ చూసుకుంటారులే అనే ధోరణి..పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి!!

సాక్షి, రంగారెడ్డి జిల్లా:
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం బదిలీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావడంతో సీనియారిటీ జాబితా మార్పులు, చేర్పుల తంతు నడుస్తోంది. ఈ క్రమంలో టీచర్లంతా తమకొచ్చే పాయింట్లు.. ఖాళీలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. సహోద్యోగులతో ఈ అంశంపైనే చర్చించి తమకు లబ్ధి చేకూరే అంశాలపై ఆరా తీస్తూ.. చర్చోపచర్చలు జరుపుతున్నారు. జిల్లాలో 10,400 మంది టీచర్లున్నారు. ఇందులో 6,766 మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రోజువారీగా టీచర్లంతా విధులకు హాజరైనప్పటికీ.. అసలు పని పక్కనపెట్టి బదిలీలై ప్రక్రియపైనే కసరత్తు చేయడంతో పాఠ్యాంశాల బోధన గాడితప్పింది.

 

సర్కారు జాప్యం.. విద్యార్థులకు సంకటం..

సాధారణంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ వేసవి సెలవుల్లో చేపడితే పాఠశాలల పునఃప్రారంభం నాటికి పరిస్థితి అంతా చక్కబడేది. కానీ ఈసారి బదిలీల ప్రక్రియపై విద్యాసంవత్సరం ప్రారంభమైన పక్షం రోజుల తర్వాత స్పందించి చర్యలు చేపట్టింది. దీంతో విద్యాసంవత్సరం తొలినాళ్లలో జోరుగా సాగాల్సిన పాఠ్యాంశాల బోధన ఒక్కసారిగా కుదేలైంది. మరోవైపు బదిలీల ప్రక్రియ పూర్తి కావాలంటే పది రోజులు ఆగాల్సిందే.



కొత్తగా పాఠశాలల్లో చేరడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. మొత్తంగా ఈ నెలాఖరు నాటివరకు బదిలీ తాలూకు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. అప్పడివరకు ఉపాధ్యాయులంతా పాయింట్లు, బదిలీల ఖాళీలు, అక్కడున్న పరిస్థితులపై టీచర్ల దృష్టంతా కేంద్రీకరిస్తారు. దీంతో ఇప్పటికిప్పుడు చేప్పే పాఠ్యాంశాలు సైతం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. బదిలీ అయ్యేది తథ్యమని భావిస్తున్న టీచర్లంతా కొత్తగా వచ్చే టీచర్లపైనే భారం వేస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో పాఠశాలల్లో పరిస్థితిని సమీక్షించగా.. ఎక్కడ చూసినా బదిలీలపైనే చర్చిం చుకోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో జూలై చివరివరకు పాఠశాలల్లో బోధనలో పెద్దగా పురోగతి నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top