మద్దతేది.. మహాప్రభో !

మద్దతేది.. మహాప్రభో ! - Sakshi


' ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలకు మద్దతు ధర కరువు

' ఇప్పటికే వర్షాభావం, విద్యుత్ కోతలతో తెలంగాణ రైతన్న యాతన

' గిట్టుబాటు ధర లభించక విలవిల

' పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిర్లక్ష్యం.. ధాన్యంపై మార్క్‌ఫెడ్‌దీ అదేతీరు

' వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు

' పంటలను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి

' ఇదే అదనుగా దోచుకుంటున్న దళారులు

' పత్తికి లభిస్తున్నది రూ.3,500 లోపే..

' ‘ఎ’ గ్రేడ్ వరికి వస్తున్నది రూ.1,250 మాత్రమే.. మొక్కజొన్న పరిస్థితీ అంతే

' ‘ఆన్‌లైన్’ విధానంతో మరో సమస్య


 

సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు విద్యుత్ కోతలతో నానా యాతనా పడిన తెలంగాణ రైతన్నకు మరో పెద్ద కష్టం వచ్చి పడింది. ఇంత దుర్భర పరిస్థితుల మధ్య ఎంతో కొంత దిగుబడి వచ్చినా.. ఆ పంటకు కూడా మద్దతు ధర కరువైంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు వ్యాపారులు, దళారుల తెంపరితనం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. చివరికి అందినకాడికి పంటను తెగనమ్ముకోవాల్సిన దుస్థితిలో అన్నదాత అల్లాడుతున్నాడు. వ్యాపారులు, దళారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటుండడంతో.. పెట్టుబడి కూడా చేతికందక నిండా మునిగిపోతున్నాడు. పత్తి పంట దగ్గరి నుంచి వరి, మొక్కజొన్న దాకా ఇదే పరిస్థితి. దీనికితోడు చెల్లింపుల్లో ఆలస్యం, ఆన్‌లైన్ విధానం మరో కొత్త సమస్యనూ తెచ్చిపెడుతోంది.

 

 రాష్ట్రంలో అటు పత్తితో పాటు ఇటు వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర అందక రైతులు అల్లాడుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్క్‌ఫెడ్ సంస్థలు కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. అంతేకాదు రైతులు తెచ్చిన పంటను కొనుగోలు చేయడానికి సవాలక్ష నిబంధనల సాకుతో చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పత్తికి కనీస మద్దతు ధర రూ. 4,050 ఉండగా.. వ్యాపారులు రూ.3,500కు మించి ఇవ్వడం లేదు. వరి సాధారణ రకం రూ. 1,360, ఏ గ్రేడ్‌కు రూ. 1,400 కనీస మద్దతు ధర కాగా.. రూ. 200 తక్కువకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా ఇంతే.

 

 ‘పత్తి’కి మరీ దారుణం..

 ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో... ఇతర పంటల సాగు తగ్గిపోయి పత్తి సాగు పెరిగింది. 8.173 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా.. 16.763 లక్షల హెక్టార్లలో పత్తి వేశారు. ఈ ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు కేవలం 83 శాతమే ఉంటే... పత్తి సాగు 109 శాతానికి పెరిగింది. అయితే వర్షాభావం కారణంగా దిగుబడి తగ్గినా కనీస మద్దతు ధర అయినా వస్తుందని రైతులు ఆశించారు. కానీ వారి ఆశ అడియాస అవుతోంది. కొన్ని జిల్లాల్లో దళారులు, వ్యాపారులు పత్తిని క్వింటాలుకు రూ. 3,500 వరకు రైతుల వద్ద కొనుగోలు చేసి... సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర కింద రూ. 4,050కు అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో సీసీఐ, మార్కెట్ దళారుల మధ్య కుమ్మక్కు ఉందనే ఆరోపణలున్నాయి.

 

 అలాగే కొన్ని చోట్ల వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే సీసీఐ కొనుగోళ్లు చేస్తోంది. జిన్నింగ్ మిల్లుల్లో సరుకు నిల్వ చేయడానికి స్థలం లేదని, కాంటాలు సకాలంలో కావడం లేదంటూ కొనుగోలును నిలిపివేస్తున్నారు. తేమశాతం పేరిట సరుకులో నాణ్యత లేదంటూ రైతులను ఇబ్బందిపెడుతున్నారు. ఇలా పత్తి కొనుగోళ్లలో సీసీఐ జాప్యం చేస్తుండడంతో వ్యాపారులు క్వింటాలుకు రూ. 200 నుంచి రూ. 500 వరకు తగ్గించి కొంటున్నారు.  తెలంగాణకే తలమానికమైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ, వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ నిత్యం ఆందోళనలతో పోలీసుల పహారా మధ్య కొనుగోళ్లు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

 

 జాప్యంతో మరో సమస్య..

 అసలే గిట్టుబాటు ధర అందక అల్లాడుతున్న రైతాంగానికి ఆన్‌లైన్ చెల్లింపుల విధానం కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. ధాన్యం, పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తుండటంతో బ్యాంకర్లు ఆ సొమ్మును రుణ ఖాతాలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో తేమ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు రైతులను ఇబ్బందులు పెడుతుండటంతో రైతులు ఏ-గ్రేడ్ ధాన్యాన్ని కూడా క్వింటాలుకు రూ. 1,250కే దళారులకు అమ్ముకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో 10 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించినప్పటికీ... ఇప్పటివరకు మూడు కేంద్రాలనే ఏర్పాటు చేశారు. వీటిల్లోనూ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. ఈ జిల్లాలో ప్రైవేట్ వ్యాపారులు దాదాపు 4 లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి కొనుగోలు చేయగా, సీసీఐ కేవలం 1.3 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. సీసీఐ కేంద్రాల్లో సరుకు అమ్మిన రైతులకు 20 రోజుల తర్వాత చెక్కులు పంపిణీ చేస్తుండడంతో.. రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని అదనుగా తీసుకుని కొందరు దళారులు రైతుల నుంచి సరుకు కొనుగోలు చేసి కమీషన్లు తీసుకుంటూ వారి పేర్లతోనే సీసీఐ కేంద్రాల్లో అమ్మకాలు చేస్తున్నారు.

 

 అన్నదాతల ఆక్రందన..

     కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బోగంపాడుకు చెందిన ఎక్కటి భగవాన్‌రెడ్డి 28 క్వింటాళ్ల 40 కిలోల పత్తిని ఈ నెల 11న జమ్మికుంట మార్కెట్లో సీసీఐకి క్వింటాల్‌కు రూ. 4,050 ధరకు అమ్మాడు. మద్దతు ధర లభించింది కదా అని సంతోషించాడు. కానీ పది రోజులుగా బ్యాంక్ చుట్టూ.., సీసీఐ చుట్టూ తిరుగుతున్నా... సొమ్ము మాత్రం చేతికి రాలేదు. పంట సాగు కోసం అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన చెందుతున్నాడు. ఇంతేకాదు ఇక్కడ ఈ నెల 3 నుంచి 17 వరకు సీసీఐకి పత్తి అమ్మిన ఏ రైతుకూ డబ్బు అందలేదు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరుకు చెందిన పులి శ్రీనివాసరావుది కూడా ఇదే పరిస్థితి.

     

 ఖమ్మం జిల్లా వెంకటాపురానికి చెందిన రైతు కందుల అప్పయ్య మూడు రోజుల కింద 23 బస్తాల పత్తిని ఖమ్మం సీసీఐ కేంద్రానికి తీసుకువచ్చాడు. గురువారం నుంచి వేచి చూస్తున్నా.. ఎవరూ కొనుగోలు చేయలేదు. మూడు రోజులుగా మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నాడు. సీసీఐ అధికారులు తేమ చూసే యంత్రాలతో పరీక్షించిగానీ కొనుగోలు చేయడం లేదు. చల్లటి వాతావరణంలో, ఆరుబయట మూడు రోజులుగా నిల్వ ఉండటంతో తన పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉంటుందేమోనని ఆందోళన పడుతున్నాడు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top