రెప్పపాటు కూడా కరెంట్ పోనివ్వం: కేసీఆర్

రెప్పపాటు కూడా కరెంట్ పోనివ్వం: కేసీఆర్ - Sakshi

  • మూడేళ్ల తర్వాత నిరంతర విద్యుత్

  •   అప్పటిదాకా ఇబ్బందులు తప్పవని ముందే చెప్పా

  •   దసరా నుంచే కేసీఆర్ మార్కు పాలన షురూ

  •   పథకాలన్నీ క్రమంగా అమల్లోకి వస్తాయి

  •   పార్టీ పరంగానే విమోచన దినాన్ని నిర్వహిస్తాం

  •   బ్యాంకర్లు సహకరించకుంటే రైతులకే నేరుగా బాండ్లు

  •   డిసెంబర్ 2లోగా బడ్జెట్ ఆమోదం

  •  

     సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల తర్వాత రాష్ర్టంలో నిరంతరాయంగా కరెంటును అందిస్తామని, రెప్పపాటు కూడా పోనివ్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అయితే మూడేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవని పేర్కొన్నారు. ‘కరెంటుకు మూడేళ్ల పాటు ఇబ్బందులు తప్పవు. మూడేళ్ల తర్వాత కనురెప్ప పాటు కూడా కరెంటు పోనివ్వను. కొంత కాలంపాటు ఇబ్బందులు తప్పవని ఎన్నికలకు ముందు కూడా చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నా. దశలవారీగా కొత్త ప్లాంట్లు, కొత్త లైన్లు ఏర్పాటు చేసుకుంటం. మూడేళ్ల తర్వాత 24 గంటలు కరెంటు అందిస్తా. అప్పటిదాకా సహకరించాలని కోరుతున్నా’ అని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన వివిధ అంశాలపై విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ కొత్త రాష్టం. కొత్త రాష్ట్రంలో కొత్త చట్టాలు, కొత్త శాసనాలు చేసుకోవాలి. తొందరపాటుతో ఏ చిన్న తప్పు చేసినా, అనాలోచితంగా చేసినా భావి తరాలు ఇబ్బందులు పడ్తాయి. చాలా జాగ్రత్తగా, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నా. ఇంకా కేసీఆర్ మార్కు, టీఆర్‌ఎస్ పార్కు పాలన ప్రారంభమే కాలేదు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలన్నీ, ఎజెండాలన్నీ 100 శాతం అమలు చేస్తం. దసరా పండుగ నుండి దీపావళి పండుగ వరకు చాలా పథకాలు అమలులోకి వస్తయి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నదని ఆయన అంగీకరించారు. ప్రతిపక్షాలు కూడా గోల్‌మాల్ చేసే ప్రయత్నం చేశాయన్నారు. ‘ఒకసారి మాట ఇస్తే వెనుకకు పోను. దీనిపై ఇప్పటికే ఆర్‌బీఐతో పలుసార్లు మాట్లాడిన. వీలుకాదంటూ సాకులు చూపించింది. మూడు జిల్లాల్లో మాత్రమే రుణమాఫీకి అంగీకరించింది. బ్యాంకర్లు సహకరిస్తారని అనుకుంటున్నా. లేకుంటే నేరుగా రైతులకే బాండ్లు, చిన్న మొత్తాల పొదుపు బాండ్లు ఇస్తం. అయితే ఒక్కొక్క రైతు 4 రుణాలు తీసుకున్నడు. పాసు బుక్కులు లేకున్నా రుణాలు తీసుకున్నరు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ప్రభుత్వ సొమ్మును పోనివ్వను’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

     

     గ్రేటర్‌లో మాదే విజయం..

     గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తప్పకుండా గెలిచి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రజలు మురికివాడల్లో, పుట్‌పాత్‌లపై బతకాల్సిన అవసరం లేకుండా చేస్తామని, సమగ్ర సర్వేతో వెల్లడైన చాలా అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. కాగా, రాష్ర్ట బడ్జెట్‌ను ఆమోదించుకోవడానికి డిసెంబరు 2 వరకు అవకాశముందని, రాష్ట్ర విభజన బిల్లులోనే ఈ మేరకు వెసులుబాటు కల్పించారని సీఎం తెలిపారు. ‘ఈ నెల 19న కేంద్ర ప్రణాళికా సంఘంతో సమావేశం ఉంది. అక్కడ పెట్టే ప్రతిపాదనలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం. అన్నీ పరిపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే బడ్జెట్‌ను పెట్టుకుందామని ఆగినం. ఇక  సెప్టెంబర్ 17(హైదరాబాద్ విమోచన దినం)ను గతంలో పార్టీ పరంగా నిర్వహించినట్టుగానే ఈసారి కూడా నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ‘గతంలో సెప్టెంబర్ 17ను ప్రభుత్వం నిర్వహించలేదు. గత ప్రభుత్వాల మార్కు, వాసనలు ఉండవని నేనేనాడూ చెప్పలేదు. ఏవైనా మంచివని అనుకుంటే వాటిని తప్పకుండా అమలుచేస్తం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

     

     వంద రోజుల పాలనకు జనామోదం

     మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపుతో తమ వంద రోజుల పాలనకు ప్రజామోదం లభించిందని కేసీఆర్ అభివర్ణించారు. గులాబీ పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వంపై, పార్టీపై తెలంగాణ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ గెలుపే నిదర్శనమన్నారు. దీంతో తమ బాధ్యత వంద శాతం పెరిగిందని, దాన్ని నిలబెట్టుకుంటామని సీఎం చెప్పారు. పీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నేతలు చేసిన పనికిమాలిన మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. డిపాజిట్ల కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోరాడినాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదని ఈ ఫలితంతో తేలిపోయిందన్నారు. అడుగుతీసి అడుగువేసినా తప్పే అన్నట్టు ప్రతీదాన్నీ తప్పుబడుతూ గోబెల్స్‌ను మించి ప్రచారం చేసిన ప్రతిపక్షాలను ప్రజలు చావుదెబ్బకొట్టారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అమరుల త్యాగఫలంతో తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేసుకోవాలంటే పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే నిర్ణయాలను అమలు చేస్తామన్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. 

     
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top