గత ప్రభుత్వాల తప్పేం లేదు: కేసీఆర్

శాసనసభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ - Sakshi


* నిబంధనల ప్రకారమే డీఎల్‌ఎఫ్ భూముల కేటాయింపు

* గత ప్రభుత్వాలు, మంత్రులు తప్పు చేశారని అనలేదు

* అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ

* సంబంధిత పత్రాలు సభ ముందుంచాలని స్పీకర్ ఆదేశం


 

 సాక్షి, హైదరాబాద్: డీఎల్‌ఎఫ్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో గత ప్రభుత్వాల తప్పే మీ లేదని, అప్పటి మంత్రులు తప్పులు చేశారని తాను అనలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం బహిరంగ వేలంలోనే భూముల కేటాయింపు జరిగిందని స్పష్టంచేశారు. దానివల్ల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఎక్కువ మొత్తం చెల్లించడానికి ముందుకొచ్చిన వారికే భూములను కేటాయించారని తెలిపారు. ఏపీఐఐసీ చేసిన తప్పి దం వల్లే ప్రత్యామ్నాయ భూములను కేటాయిం చాల్సి వచ్చిందని వివరించారు. డీఎల్‌ఎఫ్ భూముల కేటాయింపుపై సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.

 

  ‘‘భూముల కేటాయింపు విషయంలో గత ప్రభుత్వాలు, మంత్రులు తప్పుగానీ, పొరపాటుగానీ చేశారని చెప్పలేదు. జరిగిన క్రమం చెప్పాను. బహిరంగ వేలంలో భూమిని కేటాయించారు. డీఎల్‌ఎఫ్ రూ. 500 కోట్లకుపైగా చెల్లించి భూమిని కొనుగోలు చేసింది. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నాటికే అంతా జరిగిపోయింది. ఆయన రాజీనామా చేసినందున ఆ ఫైలు గవర్నర్‌కు వెళ్లినప్పుడు పెండింగ్‌లో పెట్టారు. భూ కేటాయింపు అంతా సక్రమంగా ఉంది కాబట్టే ఏపీఐఐసీ చేసిన తప్పువల్ల ప్రత్యామ్నాయం ఇచ్చారని చెప్పాను. గీతారెడ్డి, అప్పటి మం త్రులు తప్పు చేశారని అనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని, పొరపాటు చేసిందనీ చెప్పలేదు. కొంత సంయమనం కోల్పోయేస్థాయిలో ఆరోపణలు చేశారు. సభ్యులు దాన్ని గ్రహించాలి. సభాపతి ఆదేశిస్తే ఫైళ్లను సభ ముందు పెడతామని చెప్పాను.

 

 అయితే సాధారణంగా నోట్ ఫైళ్లను బయటపెట్టం. ఇప్పుడైనా స్పీకర్ ఆదేశిస్తే ఐదు నిమిషాల్లో సభ ముందు పెడతా. మరో సంస్థ అయిన పూర్వాంకరకు రూ. 600కోట్లు ఎవరు కట్టాలి? భూముల వివాదం వల్ల తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని కోర్టులో ఆ సంస్థ కేసు వేసింది. సభ ద్వారా ఆ సంస్థకు తెలియజేస్తున్నా. దయచేసి వచ్చి భూములు తీసుకోండి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘భూముల కేటాయింపులో ఆరోపణలు నిజమని ప్రజలు నమ్ముతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగిందని, తమకు సంబంధం లేదని ముఖ్యమంత్రి అనడం హుందాగా లేదు. మీరు వచ్చాకే రిజిస్ట్రేషన్ చేశారు. గత చర్చ సందర్భంగా పద ప్రయోగం, హావభావాలు హుందాగా లేవు. సభా నాయకునికి ఓపిక, సహనం, హుందాతనం ఉండాలని ఆశిస్తున్నాం. కావాలంటే రికార్డులు చూడండి. సభ దేవాలయం లాంటిది. మీరే కాదు. మరెవరూ బాధపడేలా సభ్యులు వ్యక్తిగత దూషణలకు వెళ్లవద్దు. భూముల కేటాయింపులో గత ప్రభుత్వం తప్పు చేసిందా? వాటిపై ఏంచర్యలు చేపట్టారు?’ అని ప్రశ్నిం చారు. ఇక ఈ అంశ ంపై మాట్లాడే అవకాశం టీడీపీకి ఇవ్వగా.. రేవంత్‌రెడ్డి లేవడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేచి ఆయన మాట్లాడకుండా అడ్డుకున్నారు.

 

 తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేస్తూ సభకు క్షమాపణ చెప్పాకే మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ కల్పించుకోవడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఊరుకున్నారు. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి రూలింగ్ ఇచ్చారు. డీఎల్‌ఎఫ్‌కు భూములకేటాయింపునకు సంబంధించిన పత్రాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని అదేశించారు. ‘ఇప్పటికే ఈఅంశంపై రూల్ 74 ప్రకారం చర్చకు అవకాశమిచ్చాం. మూడు రోజులు చర్చించాం. కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను ఈరోజు సభ ముందుంచండి. సభ్యులు ఫైళ్లను చూసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఉంటే మరో రూపంలో రావడం మంచిది. ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిసింది’ అని స్పీకర్ ప్రకటించారు.

 

 కాంగ్రెస్‌దే పైచేయి!

 డీఎల్‌ఎఫ్ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. గత ప్రభుత్వం, అప్పటి మంత్రుల తప్పేమీ లేదని సీఎం కేసీఆర్ స్వయంగా పేర్కొనడంతో ఆ పార్టీ సభ్యులు సంతృప్తి చెందారు. నిజానికి ఈ వివాదం విషయంలో కాంగ్రెస్ లక్ష్యంగా వచ్చిన ఆరోపణలపై పార్టీలో తర్జనభర్జన జరిగింది. చివరకు దీనిపై మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడిం చాలని నిర్ణయించారు. దీంతో ఆయన సభలో తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సీఎం వ్యవహారశైలి, మాట తీరును సున్నితంగానే తప్పుబడుతూ.. ఈ విషయంలో ప్రభుత్వ వివరణ కోరారు. సీఎం స్పందించి కాంగ్రెస్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడంతో.. ఆయన అనివార్యంగా తమ వాదనను అంగీకరించాల్సి వచ్చిందని, ఈ అంశంపై చర్చలో తమదే పైచేయి అయిందని కాంగ్రెస్ సీనియర్ శాసన సభ్యుడు ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ విషయంలో టీడీపీ చేసిన ఆరోపణలు ఉత్తివేనని, భూముల వేలం పారదర్శకంగా, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా విశ్వసించడంతో కాంగ్రెస్‌కు క్లీన్‌చిట్ లభించినట్లు అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

 

 కేసీఆర్ అవినీతి బండారం బయట పడుతుంది

 సాక్షి, హైదరాబాద్: డీఎల్‌ఎఫ్ భూముల కేటాయింపు కుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని నియమిస్తే కేసీఆర్ అవినీతి బండారం బయటపడుతుంది. మైహోమ్ సంస్థ రామేశ్వరరావుకు టీఆర్‌ఎస్ సర్కారు అక్రమంగా భూములు కట్టబెట్టిందనేదానికి నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. వీటన్నింటినీ బయటపెడతానని భయపడి సభలో నన్ను మాట్లాడనీయకుండా అధికారపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారు. అదేమంటే ఆపరేషన్ బ్లూస్టార్ అంటూ ప్రాణాలు హరిస్తామని బెదిరిస్తున్నారు. చర్చ ముగిశాక స్పీకర్ వద్ద ఫైల్ పెడతామంటున్నారు. చర్చ ముగి శాక ఫైల్ పెడితే ఏంది. పెట్టకుంటే ఏంది? భూముల కేటాయింపులో ప్రభుత్వం నగ్నంగా దొరికిపోయింది.                 

 - రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, టీటీడీపీ ఎమ్మెల్యేలు

 

 భూముల కేటాయింపులో పొరపాటు చేయలేదు

 డీఎల్‌ఎఫ్ భూముల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పొరపాటు చేయలేదని సీఎం కేసీఆర్ స్వయంగా సభలోనే ప్రకటించడం మా నిజాయితీకి నిదర్శనం. పరిగి నియోజకవర్గంలో కేంద్రం సాయంతో నిర్మిస్తున్న మంచినీటి ప్రాజెక్టును వాటర్ గ్రిడ్ పథకంలో చేరిస్తే కేంద్రం అందించే నిధులు వెనక్కి వెళతాయి. అందుకని ఈ ప్రాజెక్టును విడిగానే నిర్మించాలి. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించగా సరేనన్నారు.       

 - రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top