రుద్రమదేవి నగల మాయంపై వీడని మిస్టరీ ?

రుద్రమదేవి నగల మాయంపై వీడని మిస్టరీ ? - Sakshi

  • రుద్రమదేవి చిత్రం షూటింగ్‌లో నగలు మాయంపై లభించని క్లూ?

  •  దొంగ ఎవరు?        

  •  అసలు బంగారం ఎంత..?

  •  పోలీసులకు సవాల్‌గా మారిన దర్యాప్తు

  • సాక్షి, సిటీబ్యూరో: రుద్రమదేవి సినిమా షూటింగ్‌లో నగలు మాయంపై మిస్టరీ వీడలేదు. కిలోన్నర బంగారు ఆభరణాలు పోయాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా క్లూ లభించలేదు. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత? రోల్డ్‌గోల్డ్ ఎంత అన్న విషయం సరఫరా చేసిన వారికే తెలియదనడం కొత్త అనుమానాలకు తెరలేపింది. అంత విలువైన నగలకు సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంచారు? వ్యానులో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు.



    పోయిన నగల్లో అత్యంత విలువైన రాళ్లు పొదిగినవి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్‌గా రుద్రమదేవి సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా అనుష్క ధరించే నగలను చెన్నైలోని ఆంజనేయ శెట్టి అండ్ సన్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. షూటింగ్ జరిగే రోజు సంస్థ సిబ్బంది చెన్నై నుంచి నగలను తీసుకు వస్తున్నారు. షూటింగ్ ముగిసిన వెంటనే వాటిని తిరిగి తీసుకువెళ్లిపోతున్నారు.



    ఇలా ఆరు షెడ్యూల్స్‌లో జరిగింది. ఈ నెల 19వ తేదీన గోపన్‌పల్లెలోని రామానాయుడుకు చెందిన స్థలంలో చిత్రం ఏడవ షెడ్యూల్  ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ఉదయం 8 గంటలకు చెన్నై నుంచి విమానంలో రెండు ప్లాస్టింగ్ బాక్స్‌లున్న బ్యాగ్‌లో నగలను ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఎస్. రవిసుబ్రమణ్యం షూటింగ్ స్పాట్‌కు తీసుకువచ్చాడు. ఈ బ్యాగ్‌ను ఏసీ మేకప్‌వ్యాన్ డ్రైవర్ సీటు వెనకాల పెట్టి సమీపంలో  విశ్రాంతి తీసుకున్నాడు.



    భోజన విరామం తరువాత అనుష్కకు నగలు ధరింపజేసేందుకు బ్యాగ్ తెరిచారు. అందులో ఉన్న నగలు ఉన్న రెండు ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించలేదు. దీంతో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, వాటిలో వడ్డాణం, చెవి కమ్మలు (రెండు జతలు), గాజులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

     

    తేలని బంగారం లెక్క..



    పోయిన నగల్లో అసలు బంగారం ఎంత ఉంది. రోల్డ్‌గోల్డ్ ఎంత అనేది తెలియరాలేదు. నగలు పంపిన సంస్థకు చెందిన మార్కెటింగ్ అధికారి సుజిత్‌ను పోలీసులు సోమవారం విచారించారు. ఆయన కూడా సరిగ్గా సమాధానం చెప్పలేక పోయారు. దీంతో ముంబయి నుంచి జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో ఉన్న బద్రీని పోలీసులు పిలిపిస్తున్నారు. నగలు వాడుతున్న వారికి, పంపిన వారికి వివరాలు తెలియదనడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది.

     

    దొంగ ఎవరు...



    నగలు ఎవరు దొంగలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. నగల బ్యాగ్‌ను వ్యాన్‌లో పెట్టిన రవి కాపలా ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది అనుమానాలకు తావిస్తోంది.  దీనిపై పోలీసులు దృష్టి సారించారు. న గలు మాయమైన రోజు రవితో పాటు చెన్నై నుంచి ఎవరైనా వచ్చారా? అన్న విషయాన్ని నిర్ధారించుకుంనేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో పుటేజ్‌లను పరిశీలించనున్నారు. అసలు ఆ బ్యాగ్‌లో నగలు ఉన్న విషయం రవికి మాత్రమే తెలుసు.



    ఆ నగలను ఇంకా షూటింగ్ నిర్వాహకులకు అందించలేదు. అప్పటికే అవి మాయం కావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. షూటింగ్‌లో అసలు బంగారం వాడరని పోలీసులు అంటుండగా తమ కంపెనీ పబ్లిసిటీ కోసం వాటిని నిజమైన బంగారంతో నగలను డిజైన్ చేశామని నగల కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిసారి షూటింగ్ ఉన్న సమయంలో విమనాంలో తేవడం తిరిగి విమానంలో తీసుకెళ్లడం జరిగిందంటే అవి నిజమైనే బంగారు నగలేననే అనుమానాలు కలుగుతున్నాయి. నగల్లో విలువైన రాళ్లు ఉన్నాయని సమాచారం.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top