పార్టీ మారే ప్రసక్తేలేదు

పార్టీ మారే ప్రసక్తేలేదు - Sakshi


మణుగూరు : తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని వైస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పాయం వెంకటేశ్వర్లును టీఆర్‌ఎస్‌లోకి రావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను అనూహ్య రీతిలో విజయ దుందిబి మోగించానని, అప్పటి నుంచి నేటి వరకు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కొన్ని పత్రికలు సైతం కావాలని దుష్ర్ఫచారం చేయడం ప్రారంభించాయన్నారు. లేని పోని అభూత కల్పనలతో తనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని అన్నారు.



నియోజకవర్గ ప్రజలు తనను ఏ ఉద్దేశంతో గెలిపించారో వారి ఆశయ సాధనకు పని చేస్తానే తప్ప పూటకో పార్టీ మారుతూ వారి విశ్వాసాన్ని కోల్పోనని అన్నారు. నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చూసి ఓర్వలేని కొందరు ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న తనను రాజకీయంగా ఎదుర్కొనలేని వారు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రజలు తను ఆదరించిన తీరును చూసి వారికి రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన అభిమానులంటూ ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏమోస్తుందని అన్నారు. నిజమైన అభిమానులైతే నేరుగా తనతో మాట్లాడాలే కానీ ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టి తన మనస్సును ఏ విధంగా మారుస్తారని అన్నారు.



కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైఎస్ ఆశయ సాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో, పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. ఇదే మాట తాను గతంలోను పత్రికా ముఖంగా చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానని అన్నారు. ఇప్పటికైనా తనపై ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top