నగదు కాదు.. బాండ్లే!

నగదు కాదు.. బాండ్లే!


ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలపై సర్కారు భావన

నగదు చెల్లింపులకు ఆర్థిక సంకటం

జీపీఎఫ్ ఖాతాల్లో జమకు ఎఫ్‌ఆర్‌బీఎం చిక్కు

బాండ్ల జారీయే శ్రేయస్కరమన్న ఆర్థిక శాఖ

దీనివల్ల ఉద్యోగులకు నష్టమేమీ ఉండదని సూచన

ఉద్యోగ సంఘాలతో చర్చలకోసం కమిటీ ఏర్పాటు!

 2, 3 రోజుల్లో కొలిక్కి: సీఎం కేసీఆర్

 

 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు వేతన సవరణ (పీఆర్సీ) బకాయిల చెల్లింపునకు సంబంధించి బాండ్ల జారీకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆ బకాయిలను నగదుగా చెల్లింపు లేదా జీపీఎఫ్ ఖాతాలో జమచేసే ప్రతిపాదనలతో... రాష్ట్ర ఖజానాకు ఇబ్బందులు తప్పవని ఆర్థికశాఖ ఇప్పటికే హెచ్చరించింది. బాండ్లు జారీ చేయడమే శ్రేయస్కరమంటూ తన ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఇదే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ బాండ్ల జారీ యోచనను వ్యతిరేకిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులు జారీ చేసినా... బకాయిలకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ పెండింగ్‌లో పెట్టేసింది. ఈలోగా ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించిన ఆర్థికశాఖ... బాండ్లు జారీ చేయటం తప్ప, మిగతా ఏ మార్గమైనా రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఉద్యోగుల పీఆర్సీ బకాయిలకు సంబంధించి బాండ్లను జారీ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.

 

 ‘రుణ పరిమితి’ భయం..

 

 పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులకు గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ‘వేతన సవరణ’ బకాయిలను చెల్లించాల్సి ఉంది. దీనికి దాదాపు రూ. 5,000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ లెక్కగట్టింది. తొలుత సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ తొమ్మిది నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ఇంత మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తే.. అంతమేరకు రుణం తెచ్చుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. ప్రస్తుతం ‘ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం)’ చట్టం పరిమితి ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వం రూ. 12,900 కోట్లు అప్పుగా తెచ్చుకునే అవకాశముంది. కానీ పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమచేస్తే.. అంతమేరకు రుణ పరిమితి తగ్గిపోతుంది. అదే జరిగితే రుణాలు లభించక బడ్జెట్ అంచనాలు గాడి తప్పుతాయి.

 

 నిధులకు కటకట తప్పదు..

 

 ఉద్యోగుల పీఆర్సీ బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని వారికి నగదు రూపంలో చెల్లింపులు చేయాలన్నా, విడతల వారీగా చెల్లించాలన్నా.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టులు తదితర పథకాల నిధుల్లో భారీగా కోతపెట్టాల్సి వస్తుంది. అందుకే బాండ్లు జారీ చేయడం తప్ప మరోమార్గం లేదని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. ‘బాండ్లు జారీ చేయడం ద్వారా ఉద్యోగులకు జరిగే నష్టమేమీ లేదు. జీపీఎఫ్‌లో జమచేస్తే ఉద్యోగులు తమకు అవసరమైనప్పుడు రుణాలు తీసుకునే వీలుంటుంది. అదే బాండ్లు జారీ చేసినా.. వాటిపై రుణాలు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. బాండ్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులన్నీ సిద్ధంగానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొమ్మిది నెలల బకాయిలు ఇప్పటికిప్పుడు చెల్లించాలంటే ప్రభుత్వానికి ఆర్థికంగా భారమే. ఉద్యోగులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్కారు తీసుకునే తుది నిర్ణయం ప్రకారం బకాయిల చెల్లింపులు జరుగుతాయి..’’ అని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు పీఆర్సీ బకాయిల విషయంలో ఉద్యోగులతో సంప్రదింపులు, చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. ఈ చర్చల కోసం కమిటీ వేసే ఆలోచనలో ఉంది.

 

 

 పీఆర్‌సీ బకాయిల వ్యవహారం 2,3 రోజుల్లో కొలిక్కి: సీఎం

 

 పదో పీఆర్‌సీ వేతన బకాయిలను బాండ్ల రూపంలో చెల్లించాలా, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో కలపాలా అన్నదాన్ని 2, 3 రోజుల్లో తేలుస్తామని టీఎన్జీవో నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాకే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఎన్జీవో నూతన అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి హమీద్ , గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మంగళవారం రాత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. పీఆర్‌సీ బకాయిల వ్యవహారాన్ని ప్రస్తావించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులతో మాట్లాడి ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమస్యనూ పరిష్కరించాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని అనంతరం నేతలు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన 42 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించే విషయంలో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top