ఇక పోరుబాటే


- నిజాం షుగర్స్ భవిత కోసం అఖిల పక్షం ఉద్యమం

- ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నాయకుల నిర్ణయం

- భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు

- ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్

బోధన్ :
నిజాం షుగర్స్ పరిరక్షణకు అఖిలపక్షం గళమెత్తింది. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణకు సమాలోచనలు చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చే సుకుని పూర్వవైభవం తెస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని అఖిల పక్ష నాయకులు తెరపైకి తెస్తున్నారు.



ఈ ప్రాంత కార్మిక, కర్షకు ల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బోధన్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్, పది వామపక్ష పార్టీ లు, ఇతర పార్టీల ప్రతినిధులు, కార్మిక , రైతు సం ఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాఘవులు కన్వీనర్‌గా నిజాం షుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.



నిజాం షుగర్స్‌కు ఘన చరిత్ర..

1937లో నిజాం పాలకుల హయాంలో బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ప్రఖ్యాతి పొందింది. ఈ ఫ్యాక్టరీకి లాబాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర పరిశ్రమల విస్తరణ సాగింది. దశాబ్దాల పాటు ఈ ఫ్యాక్టరీ ఓ వెలుగు వెలిగింది. జిల్లా అబివృద్ధికి ఎంతగానో దోహదపడింది.



రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశానికి విమానాల కోసం ఇథనాయిల్ అందించిన ఘన చరిత్ర ఈ ఫ్యాక్టరీకి ఉంది. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో కొనసాగగా, రైతులు పండించిన చెరకుకు గిట్టుబాటు ధరతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. అయితే క్రమంగా పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థంతో వైభవం కోల్పోతోంది.



చంద్రబాబు హయాంలో ప్రైవేటీకరణ..

2002లో ముఖ్యమంత్రి చంద్రబాబు లాభాల్లో కొనసాగుతున్న ఈ ఫ్యాక్టరీ పరిధిలోని బోధన్ యూనిట్, కరీంనగర్ జిల్లా ముత్యంపేట్, మెదక్ జిల్లా ముంబోజిపల్లి యూనిట్‌లను ప్రైవేట్ జాయింట్ వెంచర్ పేరుతో డెల్లా పేపర్ కంపెనీకి కారు చౌకగా ధారాదత్తం చేశారు. 51శాతం ప్రైవేట్ సంస్థ, 49 శాతం ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ నిన్వహణ అధికారాలను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు.



అప్పట్లో ఈ ప్రాంత రైతులు, కార్మికులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసి ఆందోళన చేపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపారు. మూడు ఫ్యాక్టరీల విలువ రూ. 365 కోట్లకు పైగా ఉండగా, కేవలం రూ.67 కోట్లకే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ, కార్మిక సంఘాలు, రైతు ప్రతినిధుల ప్రైవేటీకరణ రద్దుకు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.



వైఎస్‌ఆర్ హయాంలో సభా సంఘం ఏర్పాటు..

నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు, ఈ ప్రాంత రైతులు, కార్మికుల ఆకాంక్ష మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కరీంనగర్ జిల్లాకు చెందిన అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా తొమ్మిది మంది శాసన సభ్యులతో సభా సంఘం నియమించారు. 2006 ఆగస్టులో సభా సంఘం నివేదిక  ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. అయితే వైఎస్‌ఆర్ మరణానంతరం సభా సంఘం నివేదిక అమలు మూలన పడింది.



ఆ తర్వాత అప్పటి సీఎం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పలుమార్లు నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ రద్దు అంశం తెరపైకి వచ్చింది. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నాటకీయ పరిణామాలు, మలుపులు తిరిగింది. 2013 డిసెంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్యంగా నిజాం షుగర్స్ అంశాన్ని ప్రస్తావించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సందర్భంలో నిజాంసుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, మంత్రి వర్గ ఉపసంఘం నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. దీంతో నిజాం షుగర్స్ ప్రైవేటీ కరణ అంశం మూలపడింది.



ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ....

మలి దశ తెలంగాణ ఉద్యమ సభలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం షుగర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పలు సభల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ రద్దు వైపు అడుగులు వేసింది.



2015 జనవరి 5న సచివాలయంలో బోధన్, మెట్‌పల్లి, మెదక్ ఫ్యాక్టరీలకు చెందిన చెరుకు రైతులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ ప్రైవేటీకరణ రద్దుపై స్పష్టత ఇచ్చారు. ఫ్యాక్టరీలను రైతుల చేతికి అప్పగిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారని రైతు ప్రతినిధులు అంటున్నారు. ఆ తర్వాత మూడు ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, కార్మికులతో సమావేశాలు నిర్వహించి అబిప్రాయాలు సేకరించారు.



ప్రభుత్వం సహకార రంగంలో ఫ్యాక్టరీలను నడపాలని యోచిస్తోందని రైతు ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ కోణంలోనే జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మహారాష్ట్ర ప్రాంతంలో సహకార రంగంలో లాబాల బాటలో నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీల పనితీరు అధ్యయనానికి రైతుల బృందాన్ని తీసుకెళ్లారు. అయితే ముందు ప్రైవేట్ జాయింట్ వెంచర్ రద్దు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.



ప్రభుత్వమే నడుపాలంటున్న అఖిల పక్షం ..

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని అఖిల పక్షం డిమాండ్ చేస్తోంది. జిల్లాలో సహకార రంగంలో ప్రారంభించిన సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ కొన్నేళ్ల నుంచి మూతపడిన చేదు అనుభవాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని అఖిల పక్ష నేతలంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top