నిమ్జ్‌కు భూసేకరణ చట్టం బ్రేకులు


భూసేకరణకు అడ్డంకిగా మారిన ‘రైతుకు వాటా’ నిబంధన

చట్టంలో మార్పుల అనంతరమే ముందుకు


 

హైదరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుకానున్న ‘జాతీయ పెట్టుబడి మరియు మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’కు భూ సేకరణ చట్టం అడ్డంకిగా మారింది. చట్టంలోని నిబంధన ల నేపథ్యంలో భూమిని సేకరించడం పెద సమస్యగా మారడంతో దానిని తాత్కాలికంగా నిలిపివేశారు. నిమ్జ్ ఏర్పాటు కోసం వ్యవసాయయోగ్యం కాని భూముల వివరాలను ఇప్పటికే పరిశ్రమలశాఖ సేకరించింది. ఏయే ప్రాంతంలో ఎంత భూమిని సేకరిం చాలనేది కూడా గుర్తించింది. చివరకు భూమిని సేకరించే సమయానికి ‘రైతు నుంచి సేకరించిన భూమికి భూమి ఇవ్వడం, నివాసయోగ్యం కల్పించడంతోపాటు, సదరు ప్రాజెక్టులో వాటా కూడా ఇవ్వాలి’ అనే భూసేకరణ చట్టంలోని నిబంధన కారణంగా దానికి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ చట్టాన్ని మార్చాలని కేంద్రంపై అనేక రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ చట్టంలో మార్పులు చేసేందుకు సానుకూలంగా ఉందని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. చట్టంలో మార్పులు చేసిన అనంతరమే నిమ్జ్‌కు భూసేకరణ విషయంపై ముందుకెళతామని పరిశ్రమలశాఖవర్గాలు పేర్కొంటున్నాయి.



‘వాస్తవానికి నిమ్జ్ విధానాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో నిమ్జ్ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా అన్న మీమాంస ఉండేది. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో అనుమానానికి తెరపడింది. ఇక భూసేకరణకు కూడా మార్గం సుగమం అయితే తెలంగాణ రా ష్ర్టంలో భారీగా మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీరంగ) పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. తద్వారా తక్కువ తరగతి చదువుకున్న నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి’ అని పరిశ్రమలశాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top