నైజీరియన్ల నయా మోసం


  • అమెరికా రాయబారిగా అవతారం  

  • బీఎండబ్ల్యూ కారు విక్రయిస్తామని క్విక్కర్ డాట్‌కామ్‌లో ప్రకటన

  • ఖరీదుకు సిద్ధమెన హైదరాబాద్ వ్యాపారికి రూ.18 లక్షల టోకరా  

  • ముంబైలో ఆరుగురు నిందితుల అరెస్టు

  • సాక్షి, హైదరాబాద్: నైజీరియన్లు తాజాగా మరో నయా మోసానికి తెగబడ్డారు. ఈసారి వారు అమెరికా రాయబారిగా అవతారం ఎత్తి ఖరీదైన కారు విక్రయిస్తామని క్విక్కర్ డాట్‌కామ్‌లో ప్రకటన ఇచ్చి.. ఓ వ్యాపారికి రూ.18.63 లక్షలు టోకరా వేశారు. బాధితుడి  ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆరుగురు నిందితులను ముంబైలో అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నైజీరియన్ దేశస్థులుకాగా  ఒకరు ముంబైకి, మరొకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. ఈ వివరాలను క్రైమ్స్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

     

    అమెరికా రాయబారిగా... : నైజీరియాకు చెందిన పాస్కల్ ఇమాన్యల్ అలియాస్ బోలో(34) మెడికల్ వీసాపై ఆరు నెలల క్రితం ముంబైకి వచ్చాడు. ఇక్కడే నివాసముంటున్న మరో ముగ్గురు నైజీరియన్లు పౌల్‌ఒసెమ్‌వేగియా అలియాస్ మోపో(43), ఓల్‌కిప్ సండే ఒనిగ్‌బుల (29), టోని చినేడు యూనిగ్వే (31)లను పరిచయం చేసుకున్నాడు. ఈ నలుగురు ముంబైలో చర్చికి వెళ్లే క్రమంలో పశ్చిమగోదావరి పాలకొల్లుకు చెందిన తాళ్ల మోజేష్ అలియాస్ వెంకట్(32), ముంబైకి చెందిన సాజిదా అబ్దుల్ హమిద్ అలియాస్ సంజన సింగ్(25)లతో స్నేహం పెంచుకున్నారు. ఆరుగురూ ఎలాగైనా మోసాలు చేసి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని పథకం పన్నారు.

     

    ప్రణాళిక ప్రకారం... : ఇమాన్యల్ ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు ఫొటోను క్విక్కర్ డాట్‌కామ్‌లో ఉంచి విక్రయిస్తున్నట్లుగా తన సెల్ నంబర్ పెట్టాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన వ్యాపారి షేక్ జిలానీ బాషా ఆ సెల్ నంబర్‌కు ఫోన్ చేయగా ఇమాన్యల్ తన పేరు గోర్గ్ ఫెడైరిక్ అని తాను అమెరికా రాయబారి కార్యాలయ అధికారినని, ప్రస్తుతం ఇండియాలో విధులు నిర్వహిస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.



    బీఎమ్‌డబ్ల్యూ కారును అమెరికా నుంచి తెప్పించానని, ముంబై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారుల వద్ద ఉందని, దాన్ని విడిపించాలంటే రూ.18.63 లక్షలు వారికి చెల్లిస్తే కారు సొంతం చేసుకోవచ్చని నమ్మబలికాడు. నకిలీ కారు డాక్యుమెంట్లను సృష్టించి జిలానీకి మెయిల్ ద్వారా పంపాడు. అంతేకాదు జిలానీకి ఫోన్ చేసి ఆయా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేయాల్సిందిగా కోరడంతో రూ.18.63 లక్షలు అకౌంట్లలో వేశాడు. నెల రోజులు గడుస్తున్నా కారు రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.

     

    ముంబైలో అరెస్టు...:  సైబర్‌క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాంకు జిలానీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎండీ రియాజుద్దీన్, ఎస్‌ఐలు కె.శ్రీనివాస్, జయవర్ధన్‌లు జరిగిన మోసంపై ఆరా తీశారు. ముంబైకి వెళ్లి అక్కడి బ్యాంకు అకౌంట్లను పరిశీలించి, నిందితులను గుర్తించారు. అనంతరం ఇమాన్యల్‌ను అదుపులోకి తీసుకోవడంతో ముఠా గుట్టు రట్టు అయ్యింది. మిగతా ఐదుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని గురువారం హైదరాబాద్‌కు తరలించారు. నిందితుల నుంచి హుండాయ్ ఎసెంట్ కారు, లాప్‌టాప్, 19 సెల్‌ఫోన్‌లు, నాలుగు డేటా కార్డులు, డెబిట్ కార్డులు, నకిలీ ఆర్‌బీఐ పత్రాలు, కస్టమ్స్ నకిలీ రసీదులు, లోగోలను స్వాధీనం చేసుకున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top