యువశక్తికి ని'బంధనాలు'


స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ యువశక్తి పథకానికి కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ పథకం కింద అర్హత సాధించాలంటే ప్రధానంగా దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.50వేలలోపు ఉండాలి. అలాంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు సైతం పలుమార్లు ప్రతికా ప్రకటనలు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆదాయ ధ్రువీకరణ పత్రం  సంపాదించడమే దరఖాస్తుదారులకు సమస్యగా మారింది.



పరిమితిని మించినవారే ఎక్కువ..

జిల్లాలో రాజీవ్ యువశక్తి పథకం కింద మూడు వందల మంది లబ్ధిదారులకు రాయితీలిచ్చేలా ప్రభుత్వం రూ.90లక్షలు విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.30వేల వరకు రుణ రాయితీ సదుపాయం ఉంటుంది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇందులో అధికశాతం దరఖాస్తుదారుల వార్షికాదాయం రూ.50వేలకు మించి ఉండడం గమనార్హం.



నిబంధనలను చూపుతూ..

కొత్త రాష్ట్రం ఏర్పాటు అనంతరం కొలువుదీరిన సర్కారు.. వివిధ సంక్షేమ పథకాల్లో అక్రమాలను అరికట్టేందుకు నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో విద్యార్థులు, సామాజిక పింఛన్లకు సంబంధించి మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. మిగతా కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం సైతం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆదాయ సర్టిఫికెట్ల జారీ నెమ్మదిగా సాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన రెండు కేటగిరీలకు కూడా ఆదాయ పరిమితి రూ.లక్షవరకు ఉండడంతో.. రెవెన్యూ అధికారులు సైతం రూ.లక్షకు దరిదాపులో ఆదాయం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.



దీంతో సగటున ఆదాయ ధ్రువీకరణ రూ.50వేలకు మించడంతో రాజీవ్ యువశక్తికింద లబ్ధి పొందడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఈనెలాఖరు నుంచి చేపట్టే దరఖాస్తుల పరిశీలనలో భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. నిబంధనలు సడలించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం పూర్తయ్యే అవకాశం లేదని అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top