‘పొన్నాల’పై పోరు

‘పొన్నాల’పై పోరు - Sakshi


- ప్రత్యర్థుల విమర్శల దాడి

- ఎన్నికలకు దూరంగా పెట్టే వ్యూహం

- అయోమయంలో పొన్నాల లక్ష్మయ్య వర్గం

- కాంగ్రెస్‌లో కొత్త రాజకీయం

సాక్షి ప్రతినిధి, వరంగల్ :
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో కొత్త రాజకీయం మొదలవుతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గం లక్ష్యంగా ప్రత్యర్థులు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో పొన్నాలకు పార్టీ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా  ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన లక్ష్మయ్యను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు విమర్శల దాడి పెంచుతుండడం దీనినే సూచిస్తోంది.



కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 25న జరిగిన పార్టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే పలువురు కార్యకర్తలు పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారిని కాదని.. సొంత వాళ్లకు టిక్కెట్ వచ్చేలా చేసిన కారణంగానే జిల్లాలో పార్టీ ఘోర పరాజయం పాలైందని గుర్తు చేశారు. కార్యకర్తల సభలోనూ పొన్నాల అనుచరులే ఎక్కువ మంది ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.



గ్రేటర్ ఎన్నికల్లో, లోక్‌సభ ఉప ఎన్నికలో పొన్నాలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని గట్టిగా నినాదాలు చేశారు. దీనికి కొనసాగింపుగా.. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ములుగులో పొన్నాలపై నేరుగా విమర్శలు చేశారు. పొన్నాల కారణంగానే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. పొన్నాల ప్రత్యర్థివర్గంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బస్వరాజు సారయ్య, పోదెం వీరయ్యలతో కలిసి బలరాంనాయక్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నాలను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రత్యర్థి వర్గం ఇలా వరుసగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది. పొన్నాల వర్గీయులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ సభలో నాయకులకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడడం సాధారణంగా జరిగేదేనని పేర్కొంటున్నారు.

 

పొన్నాలకు తగ్గుతున్న ప్రాధాన్యం

మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో క్రియాశీలంగా ఉంటున్న పొన్నాల లక్ష్మయ్యకు సాధారణ ఎన్నికల తర్వాత ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. పదేళ్లపాటు వరుసగా మంత్రి పదవిలో ఉన్న ఆయనజిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటుతో మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సారథిగా వ్యవహరించారు. టిక్కెట్ల పంపిణీ విషయంలో జిల్లాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి టిక్కెట్ రాకుండా చేశారనే ప్రచారం పొన్నాలకు అప్రతిష్టత తెచ్చింది.



పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సాధారణ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోవడం.. దొంతి మాధవరెడ్డి గెలవడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలను పీసీసీ పదవి నుంచి తొలగించింది. దీంతో పొన్నాల ప్రత్యర్థి వర్గం క్రియాశీలంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికలను వేదికగా మార్చుకుని జిల్లా కాంగ్రెస్‌లో పొన్నాల ప్రభావాన్ని పూర్తిగా లేకుండా చేసేందుకు సిద్ధమవుతోంది. పొన్నాల వర్గీయులు ఈ పరిమాణాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల నాటికి రెండు వర్గాల రాజకీయం ఎటువైపు దారితీస్తోందనేది ఆసక్తికరంగా మారింది.



ఇంటర్‌లో పలు సబ్జెక్టుల్లో మారిన సిలబస్

విద్యారణ్యపురి
: ఇంటర్మీడియట్‌లో ఈ విద్యాసంవత్సరంలో కొన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి సిలబస్ మారినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ ఎం.మలహల్‌రావు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ద్వితీయ భాష తెలుగు, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వాణిజ్యశాస్త్రం,ద్వితీయ సంవత్సరంలో చరిత్ర సిలబస్ మారిందని, కొత్త పాఠ్యపుస్తకాలు త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top