‘చెత్త’కు కొత్త చోటు

‘చెత్త’కు కొత్త చోటు - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహానగరంలోని వ్యర్థాలను నిల్వ చేసే డంపింగ్‌యార్డులను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రస్తుతం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఈ డంపింగ్‌యార్డు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ యార్డులో పరిమితికి మించి వ్యర్థాలు డంప్ చేయడంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్న తరుణంలో శివారు ప్రాంతాల్లో మినీ డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఇటీవల కలెక్టర్ల సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.. స్థలాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన రెవెన్యూ యంత్రాంగం స్థలాల అన్వేషణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో ఆరుచోట్ల స్థలాలను గుర్తించిన యంత్రాంగం.. ఈ మేరకు నివేదికను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సమర్పించింది.

 

682 ఎకరాల్లో..

జీహెచ్‌ఎంసీకి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే మేలని భావిస్తున్న సర్కారు.. ఆ మేరకు సమీపంలోని స్థలాలను గుర్తించాలని యంత్రాంగానికి స్పష్టం చేసింది. దీంతో మహేశ్వరం సమీపంలో 120 ఎకరాలు గుర్తించారు.

 

అదేవిధంగా కీసర మండలంలో 300 ఎకరాలు, కందుకూరు మండలం ముచ్చర్లలో 52 ఎకరాలు, ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌లో 38 ఎకరాలు, మొయినాబాద్ మండలం కనకమామిడి లో 120 ఎకరాలు, శివారు ప్రాంతంలో మరో 52 ఎకరాల చొప్పున 682 ఎకరాలు గుర్తించి నివేదికను జీహెచ్‌ఎంసీకి సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

చెత్త నిల్వలతో సమస్యలే..!

డంపింగ్‌యార్డుల ఏర్పాటుతో మహానగరానికి కొంత ఊరట కలిగినప్పటికీ.. స్థానికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. వాతావరణ కాలుష్యంతో అక్కడి ప్రజలు పలురకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు డంపింగ్‌యార్డు పరిధిలోని దాదాపు 15 కిలోమీటర్ల వరకు భూగర్భజలాలు కలుషితమయ్యాయి. పెద్ద ఎత్తున చెత్తనిల్వలు చేసిన నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారవర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త డంపింగ్‌యార్డుల ఏర్పాటుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top