ఆడంబరంగా ‘నేతి’ ప్రమాణం


సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు రెండోసారి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్‌లు కూడా సహకరించడంతో మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లా నేతకు రెండోసారి ఈ పదవి చేపట్టే అవకాశం లభించింది. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన నేతి విద్యాసాగర్‌ను సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర మంత్రులు సంప్రదాయ పద్ధతిలో చైర్మన్ స్థానం వరకు తోడ్కొని వచ్చారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులు సాదరంగా ఆయనను డిప్యూటీ చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.

 

 రెండోసారి..

 నేతి విద్యాసాగర్‌కు వరుసగా రెండోసారి మండలి డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం లభించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఆ పదవి చేపట్టిన ఆయన అనంతరం తెలంగాణ శాసనమండలిలోనూ తొలి డిప్యూటీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నేతి ఇటీవల టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో డిప్యూటీ చైర్మన్ హోదాలోనే ఆయన పనిచేశారు. ఆ సమయంలో మండలిలో ఆయన వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ శాసనమండలి కొలువుదీరిన తొలిరోజు నుంచి ఆయన టీఆర్‌ఎస్ సభ్యుడిగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగి యడం, కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తెలిసిందే.

 

 

 మీ పాత్ర ప్రశంసనీయం: సీఎం కేసీఆర్

 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో నేతి విద్యాసాగర్ పోషించిన పాత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. చైర్మన్ స్థానంలో నేతిని కూర్చోబెట్టిన అనంతరం మండలిలో ఇతర సభ్యులనుద్దేశించి సీఎం మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఎదరుచూసిన రీతిలోనే నేతి విద్యాసాగర్ వ్యవహరించి ఆ సమయంలో తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని ప్రశంసించారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా రాజకీయ సమీకరణల నేపథ్యంలో తనకు రావాల్సిన అవకాశాలు రాకపోయినా నమ్ముకున్న పార్టీలోనే ఉండి సేవ చేయడం నిజంగా గొప్పతనమన్నారు. రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు విద్యాసాగర్ ఎన్నోకష్టాలు పడాల్సి వచ్చిందని, అయినా తన స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగారని అన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, కర్నె ప్రభాకర్‌లు కూడా నేతి విద్యాసాగర్‌ను అభినందించారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top