నేలరాలిన పసిమొగ్గలు

నేలరాలిన పసిమొగ్గలు - Sakshi


ఒకరిని విధి చిన్నచూపు చూసింది.. మరొకరిని నిర్లక్ష్యం చిదిమేసింది. బోయిన్‌పల్లి పరిధిలో- వర్షం, గాలిదుమారానికి చెట్టుకూలి మీదపడటంతో బాలిక అనూష(11) దుర్మరణం పాలైంది. గౌస్‌నగర్‌లో- ఇంజన్ ఆపకుండా నిలిపి ఉంచిన బస్సు ముందుకు కదిలి.. రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిని కబళించింది.

 

వేర్వేరు దుర్ఘటనల్లో ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. బండ్లగూడలో రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిపై ఆర్టీసీ బస్సు దూసుకుపోయింది. బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో చెట్టు కూలి 7వ తరగతి విద్యార్థిని మృతి చెందింది.

 

చెట్టుకూలి బాలిక.....



రసూల్‌పురా: అకస్మాత్తుగా వచ్చిన గాలిదుమారంతో కూడిన వర్షం కారణంగా చెట్టుకూలి పదకొండేళ్ల బాలిక మత్యువాత పడింది. బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని మధుపాల ఎస్టేట్స్‌లో గురువారం సాయంత్రం ఈ దుర్ఘటనజరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కర్నూలు జిల్లా ఆస్పరి మండలం, కైరుప్పుల గ్రామానికి చెందిన రాములమ్మ, ఈమె ఇద్దరు సోదరీమణులు కొన్నేళ్లుగా కంటోన్మెంట్ ప్రాంతంలోని మధుపాల ఎస్టేట్‌లోని సర్వేంట్ క్వార్టర్స్‌లో ఉంటూ ఇళ్లల్లో పని చేస్తూ జీవిస్తున్నారు.  రాములమ్మ భ ర్త ఆంజనేయులు మృతి చెందాడు.



ఈమెకు ముగ్గురు పిల్లలు. చిన్న కూతురు అనూష (11) మడ్‌ఫోర్డ్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.  అనూష గురువారం సాయంత్రం తన చిన్నమ్మ ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి.. తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా గాలి దుమారంతో భారీ వర్షం మొదలైంది. గాలివానకు ఓ చెట్టు కూలి అనూషపై పడింది. తలకు తీవ్రగాయాలు కావడంతో బాలిక మృతి చెందింది.  అనూషపై చెట్టు కూలిన విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. కాగా, గంట తర్వాత అనూష పెద్దమ్మ ఆ దారిలో వెళ్తూ కూలిన చెట్టు వైపు చూడగా బాలిక కాళ్లు కనిపించాయి.



ఎవరి బిడ్డపైనో చెట్టు కూలిందంటూ ఆమె చెట్టు కొమ్మలను తొలగించి చూసింది. నిర్జీవంగా పడివున్న అనూషను గుర్తించి బోరుమంది. వెంటనే తన చెల్లెలు రాములమ్మకు సమాచారం ఇచ్చింది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనూష మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

చిన్నారిని చిదిమేసిన ఆర్టీసీ బస్సు



చాంద్రాయణగుట్ట: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలిగొంది.  వాలుగా ఉన్న రోడ్డుపై బస్సును ఆపిన డ్రైవర్ ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచి టీ తాగేందుకు వెళ్లాడు. బస్సు ముందుకు కదిలి రోడ్డుపై ఉన్న చిన్నారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఎస్సై నరేందర్ కథనం ప్రకారం... బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన రసూల్ కుమార్తె సమ్రీన్ (3) గురువారం ఉదయం 8.30కి ఇంటి వద్ద రోడ్డుపై ఆడుకుంటోంది.  



ఇదే సమయంలో ఫలక్‌నుమా డిపోకు చెందిన రూట్ 178జి మినీ బస్సు (ఏపీ 29జడ్1113) వచ్చి ఆగింది. తిరిగి వెళ్లేందుకు బస్సును ఆన్ చేయగా స్టార్ట్ కాలేదు. దీంతో డిపోకు ఫోన్ చేయగా మెకానిక్ బ్యాటరీ తీసుకొచ్చి అమర్చాడు. వెంటనే బస్సును స్టార్ట్ చేసిన డ్రైవర్ కొద్ది సేపు బ్యాటరీ చార్జింగ్ కావాలని ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచి మెకానిక్‌కు టీ తాగించేందుకు పక్కకు వెళ్లాడు.



రోడ్డు వాలుగా ఉండటం.. ఇంజిన్ ఆన్‌లో ఉండటంతో బస్సు ఊగి కొద్దిసేపటికి ముందుకు కదిలి రోడ్డుపై ఆడుకుంటున్న సమ్రీన్ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు మృతి చెందడంతో సమ్రీన్ తల్లిదండ్రులు గుండెవిసేలా రోదించారు. వారు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.  పోలీసులు బస్సును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top