ప్రకృతి వైద్యం రోగం నయం

ప్రకృతి వైద్యం రోగం నయం


ఆల్వాల్‌కు చెందిన జగదీశ్వర్‌కు పక్షవాతం వచ్చింది. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే వారం రోజులకే లక్ష రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. సరే... జబ్బు నయం అయ్యిందా అంటే అదీ లేదు. నేచురోపతితో ఫలితం ఉంటుందని దగ్గర బంధువు చెప్పడంతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 లోని రెడ్‌క్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్‌లో చేరాడు. పది రోజుల్లోనే ఎవరి సహాయం లేకుండా నడుస్తున్నాడు. దీనికి ఆయనకు అయిన ఖర్చు ఐదు వేలు.

     

జీడిమెట్లకు చెందిన సుమిత్ర కొద్దిసేపు నడిచినా, మాట్లాడినా ఆయాసం కమ్మేసి నిస్సాహాయస్థితిలోకి వెళ్తుంది. పలు ఆస్పత్రులు తిరిగి రూ. 70 వేల వరకు ఖర్చు చేసింది. ప్చ్...ప్రయోజనం లేదు. తెలిసిన వారి ద్వారా అదే రెడ్‌క్రాస్‌లో చేరింది. నాలుగు రోజుల తరువాత సోమవారం సాధారణ మనిషిలా డిశ్చార్జ్ అయ్యింది. అందుకు ఆమెకు అయిన ఖర్చు మూడు వేలు. ఇవి జగదీశ్వర్, సుమిత్రల జీవితాల్లో ఎదురైన అనుభవాలు. వీరిద్దరికే కాదు... నిత్యం ఎందరికో రెడ్ క్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్ సెంటర్ ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యానికి చిరునామాగా నిలుస్తోంది.

 

బంజారాహిల్స్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ప్రకృతి చికిత్సకు సమాంతరంగా యోగా శిక్షణ ఇస్తూ నగరవాసుల ఒత్తిడిని దూరం చేసే కేంద్రంగా విరాజిల్లుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 (ఎల్‌వీ ప్రసాద్ మార్గ్)లో 1994 సెప్టెంబర్ 15న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా ప్రారంభమైన యోగా అండ్ నేచర్‌క్యూర్ సంస్థ పేద ప్రజలకు సంజీవనియే అయ్యింది. 30 పడకల వసతితో అటు ఇన్ పేషెంట్స్‌కు, మరోవైపు ఔట్ పేషెంట్స్‌కు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి ప్రకృతి చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు.

 

చికిత్సలివే...

డైట్ థెరపీ (ఆహార చికిత్స): ఫలానా జబ్బుతో వచ్చిన వారికి ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి. ఏది తింటే వారికి త్వరగా క్యూర్ అవుతుందనే అంశాలను పరిగణనలోకి ఈ థెరపీని అందిస్తారు. ముఖ్యంగా పండ్లు, గ్రీన్ వెజిటెబుల్స్ అందిస్తుంటారు.

 

మసాజ్ థెరపీ (మర్ధన చికిత్స): ట్యూబర్‌క్యులసిస్, ట్యూమర్ ఆఫ్ ది స్పైన్, ఆస్టియోమిలిటీ తదితర వ్యాధులతో బాధపడేవారికి ఈ చికిత్స ద్వారా ఇన్‌ఫెక్షన్, ఇన్‌ఫ్లేమేషన్‌ను తగ్గిస్తారు.

 

హైడ్రో థెరపీ (జల చికిత్స): ప్రధానంగా బ్యాక్ పెయిన్‌తో బాధపడే వారికి హాట్ స్పైనల్ బాత్, స్టీమ్ బాత్ (ఆవిరి స్నానం) ద్వారా తగ్గిస్తారు.

 

మాగ్నిటో థెరపీ (అయస్కాంత థెరపీ): పవర్‌ఫుల్ అయస్కాంతం ద్వారా వెన్నెముక, కాళ్లు, చేతులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తారు.

 

 ఏయే జబ్బులకు చికిత్స

 

 అధిక రక్తపోటు, పెరాలసిస్, గుండె జబ్బులు, ఒత్తిడిని తగ్గిం చడం, వెన్నెముక నొప్పులు, హెపటైటిస్, అన్ని రకాల చర్మ వ్యా ధులు, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, సెర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలిటిస్, ఆస్టియో ఆర్ధరిటిక్స్, యాక్సైటిక్-న్యూరోసిస్, మైగ్రేన్ తదితర వాటికి సంబంధించి ఇక్కడ ప్రకృతి చికిత్సను అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా శిక్షణకు దాదాపు 500 మంది హాజరవుతున్నారు.

 

 శిక్షణ వేళలు

 

 ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు బ్యాచ్‌లు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో బ్యాచ్ చొప్పున యోగా శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు రెండు బ్యాచ్‌ల్లో శిక్షణ ఇస్తున్నారు.

 

 వార్డుల సమాచారం

 

వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇన్‌పేషెంట్‌గా చేరే వారి కోసం జనరల్ వార్డు, షేరింగ్ రూమ్ (ముగ్గురు లేక నలుగురు), స్పెషల్ రూమ్(ఒకరు లేక ఇద్దరు)లను కేటాయిస్తారు. జనరల్ వార్డుకు ట్రీట్‌మెంట్‌తో కలిపి రూ.400, షేరింగ్ రూమ్‌కు రూ. 500, స్పెషల్ రూమ్‌కు రూ. 700 ప్రకారం ఫీజు వసూలు చేస్తారు. పది రోజుల కోర్సుకు రూ. 2500, 15 రోజుల కోర్సుకు రూ. 3500 వసూలు చేస్తారు.

 

 శరీరం చాలా తేలికైంది

 మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతూ ఇక్కడికి వచ్చాను. నాలుగు రోజుల క్రితం చేరాను.  ఇక్కడ చికిత్సతో శరీరం చాలా తేలికయ్యింది. ఇక్కడ స్నేహపూరిత వాతావరణం ఉంది. 15 రోజుల కోర్సులో చేరాను. ట్రీట్‌మెంట్ బాగుంది. రీజినబుల్ రేట్లు ఉన్నందున అందరికీ అందుబాటులో ఉంది.

 - కె.మంజుల, గృహిణి

 

 బాగా కోలుకున్నా

 కడుపునొప్పితో బాధపడుతూ ఇక్కడ చేరాను. మల విసర్జన కూడా కష్టంగా ఉండేది. 15 రోజుల క్రితం చేరి డైట్, మసాజ్, యోగా చికిత్సలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా కోలుకున్నాను. మలమూత్ర విసర్జనలు తేలికయ్యాయి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటంతో త్వరగా కోలుకుంటున్నారు.

 - జి.శరత్‌బాబు ప్రభుత్వ ఉద్యోగి

 

 ప్రకృతి చికిత్స ఎంతో మేలు

 ప్రకృతి చికిత్స ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరితగతిన వ్యాధి నయం చేయవచ్చు. వ్యాధిని బట్టి వారికి ఆహారం అందిస్తూ నయం అయ్యేవరకు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు అయ్యే ఖర్చు ఇక్కడ వందలు, వేలల్లోనే అయిపోతుంది. అయితే డాక్టర్లు చెప్పిన విధంగా ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది.

 - టి.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్, రెడ్‌క్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్

 

 వ్యాధి మూలాల్లోకి...

 ఇక్కడ వ్యాధికి సంబంధించిన మూలాల్లోకి వెళ్లడం జరుగుతుంది. రోగ మూలాలను తీసివేస్తేనే వ్యాధి నయమవుతుంది. అందుకే ఇక్కడ ప్రకృతి చికిత్స అందిస్తున్నాం. తక్కువ రేట్లలో నాణ్యమైన చికిత్సలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు నేర్పిస్తాం.

 - డాక్టర్ దినేష్ రాజ్, డెరైక్టర్

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top