ఇండోర్‌ ‘స్వచ్ఛత’ వెనుక తెలంగాణ బిడ్డ!

ఇండోర్‌ ‘స్వచ్ఛత’ వెనుక తెలంగాణ బిడ్డ! - Sakshi


కలెక్టర్‌ నరహరి కృషితో నగరానికి దేశవ్యాప్త గుర్తింపు

- సరికొత్త ఆలోచనలు.. వినూత్న విధానాలు..

- బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు బాలలతో ‘వానరసేన’

- బాలీవుడ్‌ సింగర్‌తో పాటలు పాడించి ప్రజల్లో అవగాహన

- ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ




సాక్షి, కరీంనగర్‌: ఇండోర్‌.. దేశంలోనే క్లీన్‌సిటీ! స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఫస్ట్‌ ర్యాంకు.  పరిశుభ్రమైన రోడ్లు. మధ్యప్రదేశ్‌ రాజధాని నగరమైన ఇండోర్‌ ఇంతలా మెరవడం వెనుక, దేశం దృష్టిని ఆకర్షించడం వెనుక ఉన్నది ఎవరో తెలుసా..? మన తెలంగాణ బిడ్డ! పేదింట్లో జన్మించి.. కష్టాల కడలి ఈది.. కలెక్టర్‌గా ఎదిగిన పరికిపండ్ల నరహరి. ప్రస్తుతం ఇండోర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఈయన తన వినూత్న ఆలోచనలతో ఇండోర్‌ను దేశంలోనే ‘స్వచ్ఛ’నగరంగా నిలిపారు. ఆయన సాధించిన విజయాలు, అందుకు పడ్డ శ్రమ ఆయన మాటల్లోనే..



చిన్నపిల్లలతో వానర సేన..

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకు ఆఫీసులో కూర్చుంటే వచ్చేది కాదు. గ్రామాల్లో చెరువు గట్టు, కాల్వలు, పొలాల్లో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించేందుకు శ్రమించాం. చిన్న పిల్లలతో వానరసేన ఏర్పాటు చేశాం. బయటకు చెంబు పట్టుకొని వెళ్లే వారిని పిల్లలే అడ్డుకోవడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాల నిచ్చాయి. గ్రామాల్లో 100 శాతం ఓడీఎఫ్‌(బహిరంగ మల విసర్జన రహితప్రాంతం) పూర్తయ్యాక, జిల్లాలోని 8 మున్సిపాలిటీలపై దృష్టి పెట్టి అక్కడా సక్సెస్‌ అయ్యాం. దేశంలోనే ఓడీఎఫ్‌ ప్రకటించుకున్న రెండో జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్నాం.



చెత్తకు డోర్‌ టు డోర్‌..

స్వచ్ఛ భారత్‌లో భాగంగా 500 నగరాల్లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ృ2017లో మొద టి ర్యాంకు రావడానికి 100 శాతం ఓడీఎఫ్‌తో పాటు చెత్త సేకరణ, తరలింపు ఉపకరిం చింది. వీధుల్లో డస్ట్‌బిన్‌లు ఉంటే అందులో కంటే చుట్టుపక్కల ఉండే చెత్తే ఎక్కువ. దీంతో పూర్తిగా డస్ట్‌బిన్లను తొలగించాం. డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టాం. ఇది సత్ఫలితాలినిచ్చింది. స్వచ్ఛతపై ఓ పాట రాయించి బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌తో పాడించాం.



జనం కట్టుకున్న టాయిలెట్లే ఎక్కువ

ఓడీఎఫ్‌ కోసం ప్రభుత్వం 10 నుంచి 12 శాతం మాత్రమే టాయిలెట్లు కట్టిస్తే, ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకున్నవే 90 శాతం ఉన్నాయి. ఒక ఉద్యమంలా టాయిలెట్ల నిర్మాణం జరిగింది. నిరుపేదల ఇళ్లలో జన్మించే ఆడపిల్లల సంరక్షణ కోసం శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నేను ప్రవేశపెట్టిన లాడ్లీ లక్ష్మి యోజన సక్సెస్‌ అయింది. ఈ పథకాన్ని వివిధ పేర్లతో 12 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పేరిట ప్రవేశపెట్టారు. నేను ప్రవేశపెట్టిన ప్రతి స్కీం జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం సంతృప్తినిచ్చింది.



నరహరి నేపథ్యమిదీ..

నరహరి తల్లిదండ్రులు పరికిపండ్ల సత్యనారాయణ, సరోజన. వీరి స్వగ్రామం వరంగల్‌ జిల్లా చింతగట్టు. 1966లో అక్కడి నుంచి ప్రస్తుత పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌కు వలస వచ్చారు. వీరికి ఆరుగురు సంతానం. ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. మూడో కుమారుడు నరహరి. సత్యనారాయణ దర్జీ పనితో కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను కష్టపడి చదివించారు. బసంత్‌నగర్‌లోని ఇండియా మిషన్‌ సెకండరీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన నరహరి.. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. 2001లో సివిల్స్‌లో 78వ ర్యాంక్‌ సాధించి మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య భగవద్గీత మధ్యప్రదేశ్‌లోనే సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top