సివిల్స్‌లో మెరిశారు..

సివిల్స్‌లో మెరిశారు..


సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ -2014 ఫలితాల్లో జిల్లా యువకులు మెరిశారు. జాతీయస్థారుులో ఉన్నత ర్యాంకులు సాధించి జిల్లావాసులను మురిపించారు. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన 24 ఏళ్ల క్రాంతి తొలి ప్రయత్నంలోనే 50వ ర్యాంకుతో.. హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన 26 ఏళ్ల పింగిళి సతీష్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా రెండో ప్రయత్నంలో 97వ ర్యాంకుతో అత్యుత్తమ ప్రతిభ చాటారు.

 

- 50వ ర్యాంకు సాధించిన క్రాంతి

- 97వర్యాంకు పొందిన పింగిళి సతీష్‌రెడ్డి

- యువ అధికారుల స్ఫూర్తితో లక్ష్య సాధన

- హోం స్టేట్‌గా తెలంగాణను ఎంచుకుంటామని వెల్లడి    

ముంబైలో బహుళజాతి కంపెనీలో సీఏగా పని చేస్తున్నప్పుడు చాలెంజింగ్‌గా ఉండే సివిల్స్ రాయాలని అనిపించింది. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయి. ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. హోంస్టేట్‌గా తెలంగాణను ఎంచుకుంటాను. కొత్త రాష్ర్టంలో సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుక  కృషి చేస్తా.

 

సాక్షి, హన్మకొండ :
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో క్రాంతి 50వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని నలుమూలల చాటాడు. క్రాంతి  తల్లిదండ్రులు పాటి సురేందర్, జ్యోతి కాగా.. బాబారుు కొండల్‌రావు వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో డీఈగా పనిచేస్తున్నారు. క్రాంతికుమర్ తండ్రి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థలో లెక్చరర్, ప్రిన్సిపాల్‌గా పలు హోదాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లోని బుర్‌హన్‌పూర్  నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.



క్రాంతికుమర్ ఐదో తరగతి వరకు మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఐదు నుంచి పది వరకు పెదవేగి, ఏలూరు పశ్చిమగోదావరి  జిల్లాల్లో చదివారు. అనంతరం షోలాపూర్, మహారాష్ట్రలో నవోదయ విద్యాలయాల్లో చదివారు. ఆపై ఇరవై ఒక్క ఏళ్లకే పూణేలో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేసి ముంబైలో ఓ బహుళజాతి కంపెనీలో ఏడాదికి తొమ్మిది లక్షల రూపాయల వేతనంతో సీఏగా పని చేశారు. ఈ వృత్తిలో ఉండగానే దీర్ఘకాలిక సెలవు పెట్టి ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించారు.



మెయిన్స్‌లో ఆప్షనల్‌గా కామర్స్ సబ్జెక్టును ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్ బురహన్‌పురంలో ఉన్న క్రాంతి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు.  అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయని,  దీంతో ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యానని చెప్పారు. హోంస్టేట్‌గా తెలంగాణను ఎంచుకుంటానన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తానన్నారు.



అదేవిధంగా సివిల్స్‌లో 97 వ ర్యాంక్ సాధించిన సతీశ్‌రెడ్డి తల్లిదండ్రులు సీతారాంరెడ్డి, విజయలక్ష్మి. వీరు హన్మకొండలోని బాలసముద్రంలో నివాసం ఉంటున్నారు. తొలి ప్రయత్నంలో మెయిన్స్‌లో విఫలమైన సతీశ్‌రెడ్డి, ద్వితీయ ప్రయత్నంలో విజయం సాధించాడు. మెయిన్స్‌లో ఆయన సోషియాలజీని ఆప్షన్‌గా ఎన్నుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top