‘సబ్‌ప్లాన్’కు జాతీయ స్థాయిలో చట్టబద్ధత


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జాతీయ సదస్సులో వక్తల డిమాండ్

సీడీఎస్, ఎస్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో సదస్సు



సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు జాతీయస్థాయిలో చట్టబద్ధత కల్పించాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, సామాజిక సమరసతా వేదికలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్), సామాజిక సమరసతా వేదిక (ఎస్‌ఎస్‌వీ) సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన జాతీయ సదస్సులో ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రముఖ్ బాగయ్య కీలకోపన్యాసం చేస్తూ దేశంలో దళితులకు, ఆదివాసీలకు అన్ని రంగాలలో నేటికీ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.



దళితులు, ఆదివాసీల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నారు. అందుకు ఆ వర్గాలు చదివే ప్రభుత్వ విద్యా సంస్థలను, వసతి గృహాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని బాగుచేయాలని ప్రభుత్వాలను  డిమాండ్ చేశారు. దేశంలో 25 శాతం జనాభా గల దళితుల అభివృద్దే దేశాభివృద్ధి అని కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేసి దేశానికి దారి చూపాయని పేర్కొన్నారు.  



దళితుల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు పరచాలని  కృష్ణన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో జరిగిన ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లు దళితుల హక్కుల పరిరక్షణకు, ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి సబ్‌ప్లాన్ చట్టం చేయాలని కృష్ణన్ కోరారు.



దళిత, ఆదివాసీల అభివృద్ధిలో మీడియా పాత్ర అనే అంశంపై సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కోసం మీడియా కీలక పాత్ర పోషించిందన్నారు. సబ్‌ప్లాన్‌పై అవగాహనకోసం అనేకసార్లు మీడియా ఆధ్వర్యంలో చర్చాకార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఇది ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడిందన్నారు. అయితే సబ్‌ప్లాన్ చట్టం అమలుకు సైతం అంతకంటే ఎక్కువగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి తరఫున మీడియా నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.



సమాజంలో మిగతా వర్గాలకంటే ఎంతో వెనకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి భారత రాజ్యాంగం కల్పించిన రక్షణలను, అవకాశాలను విస్తృతపరచి పకడ్బందీగా అమలు చేయాలని సీనియర్ జర్నలిస్టు, సీడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. సామాజిక హోదాతో పాటు దళిత, ఆదివాసీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు పేర్కొన్నారు. సదస్సులో చివరిగా జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రావణ్‌కుమార్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత అద్దంకి దయాకర్, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకుడు గోవర్ధన్, కేవీపీఎస్ నాయకుడు జాన్ వెస్లీ ప్రసంగించారు.



ఈ కార్యక్రమంలో సీడీఎస్ డెరైక్టర్ ఆంజనేయులు, ఎస్‌ఎస్‌వీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్‌చార్జి శ్యామ్ ప్రసాద్, ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎంజీకే మూర్తి, పీఎస్ రావు, వివిధ రాష్ట్రాల దళిత నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top