కార్పొరేట్ల చేతిలో మోడీ కీలుబొమ్మ

కార్పొరేట్ల చేతిలో మోడీ కీలుబొమ్మ - Sakshi


సిద్దిపేట టౌన్: ప్రధాని నరేంద్రమోడీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలు బొమ్మగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. సిద్దిపేటలో ఆదివారం జరిగిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలను అణచివేతకు గురి చేసే పాలకుల విధానాలను తిప్పి కొట్టాలన్నారు. పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

 

గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలతో గద్దెనెక్కిన పాలకులు హామీలను విస్మరించడం దుర్మార్గమన్నారు. బడా పార్రిశామిక వేత్తలకు, కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో భావితరాలను సంక్షోభాల నుంచి రక్షించడానికి పోరాటాలను రూపొందించాలన్నారు.


రాష్ట్ర ఉన్నత మండలి సభ్యులు డాక్టర్ పాపయ్య, తెలంగాణ ప్రెస్ అకాడమీ సభ్యుడు కె. అంజయ్యను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు సిరాజుద్దీన్, మంద పవన్, వెంకట్‌రాంరెడ్డి, చింతల మల్లేశం, గంగాధర్‌రావు తదితరులు ప్రసంగించారు. సమావేశంలో పార్టీ ప్రతినిధులు రాజయ్య, బాలేష్, షఫీ, శోభన్, లక్ష్మణ్, కనకవ్వ, మంజుల, జలాలొద్దీన్, అడవయ్య, శ్రీనివాస్, దర్గయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

కార్మిక హక్కులను హరించేందుకు సవరణలు : డీవీ కృష్ణ

కార్మిక హక్కులను హరించడానికి మోడీ సర్కార్ చట్ట సవరణలను తీసుకవస్తోందని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) జాతీయ అధ్యక్షుడు డీవీ కృష్ణ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన సిద్దిపేట, జనగాం డివిజన్ కార్యవర్గ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ సంఘటిత శక్తితో కార్మిక హక్కులను ఉరితీసే పాలకుల చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు కష్టాలను భరించాల్సిందేనని ప్రధాన మంత్రి చెప్పడం శోచనీయమన్నారు. సంక్షేమ పథకాలకు కోతలు విధించడం ఎలా అభివృద్ధి అవుతుందని ప్రశ్నించారు.

 

ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కాంట్రాక్టు లేబర్ చట్టాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం సరికాదన్నారు. ఎవరినైనా చేర్చుకోవచ్చు, తొలగించవచ్చు (హైర్ అండ్ ఫైర్) హక్కును యజమానులకు కల్పించడం శోచనీయమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం సరికాదన్నారు.  కార్మిక వ్యతిరేక చట్టాలను ఇలాగే కొనసాగిస్తే ఉద్యమం చేపట్టాలన్నారు. సమావేశంలో సమాఖ్య జిల్లా బాధ్యులు కట్ట భూమన్న, జిల్లా నేతలు యాదగిరి, లక్ష్మయ్య, శ్రీశైలం, కొమురయ్య, లక్ష్మయ్య, జనగాం డివిజన్ నేతలు బీరన్న, ఉప్పలన్న, బాలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top