ఇక గరికపాటి!

ఇక గరికపాటి! - Sakshi


- నేడో రేపో నోటీసులు జారీ

- విచారణ.. అరెస్టుకు అవకాశం

- నరేందర్‌రెడ్డిని విచారించిన ఏసీబీ



సాక్షి ప్రతినిధి, వరంగల్ :
ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడానికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చిన ‘ఓటుకు నోటు’ కేసు జిల్లా నేతలకు చుట్టుకుంటోంది. రోజుకు ఒకరు చొప్పున ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. టీడీపీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం విచారించింది. సుమారు ఐదు గంటలపాటు ఏసీబీ అధికారులు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో లోతుగా ప్రశ్నలు అడిగి నట్లు తెలిసింది. వేం నరేందర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటారని భావించినా సాయంత్రం ఆయనను ఇంటికి పంపిం చారు. విచారణకు అవసరమైనప్పుడు రావాలని సూచించారు. నరేందర్‌రెడ్డి విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు.


 


ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డి విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయన ఏసీబీ అధికారులకు ఏం విషయాలు తెలియజేసి ఉంటారనే విషయంపై టీడీపీలోని పలువురు జిల్లా ముఖ్య నేతలు టెన్షన్ పడుతున్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారం తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలను ఏసీబీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

మోహన్‌రావుకు నోటీసులు ఇచ్చే అవకాశం


‘ఓటుకు నోటు’ కేసులో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయనకు నోటీసు ఇవ్వాలని ఏసీబీ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. గరికపాటికి గురువారం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలో డబ్బు సర్దుబాటు చేసిన అంశంలో ఈయనకు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నారు. టీడీపీ జిల్లా ముఖ్యనేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన జిల్లాకు చెందిన నాయకుడే కావడంతో ఈ వ్యవహారంలో గరికపాటి పాత్ర ఎక్కువగానే ఉందని చెబుతున్నారు.



రాజ్యసభ సభ్యుడు కావడంతో అన్ని అంశాలను పరిశీలించి గరికపాటికి నోటీసులు జారీ కానున్నాయని.. విచారణ కోసం అవసరమైతే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వేం నరేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావులతోపాటు జిల్లాలోని మరికొందరు టీడీపీ నాయకులకు ఓటుకు నోటు అంశంలో సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. వీరు ఎవరెవరనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top