మళ్లీ.. బిల్యానే


 అనేక మలుపుల అనంతరం పాత కాపుకే టీడీపీ పగ్గాలు

 ఉమ వర్గానికి మోత్కుపల్లి చెక్..అధినేత వద్ద పలుకుబడి నిలబెట్టుకున్న నర్సింహులు

 ఒక దశలో స్వయంగా ఉమా మాధవరెడ్డి పేరును తెరపైకి తెచ్చిన నాయకులు

 మేడమ్ మౌనంతో బిల్యాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు

 బిల్యాకు కలిసివచ్చిన సామాజిక వర్గ కూర్పు.. 10 రోజుల్లో జిల్లా కమిటీ నియామకం


 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడిని మరోమారు నిరూపించుకున్నారు టీడీపీ జిల్లా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో రెండు గ్రూపులుగా చీలిపోయి తమ వాదనలు వినిపించినా.. తాను చెప్పిన నాయకుడికే మళ్లీ పగ్గాలు ఇప్పించుకోగలిగారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తన హవా తగ్గిపోయిందని, ఉమామాధవరెడ్డికి అనుకూలంగా నాయకగణం మారిపోయిందనే సంకేతాలను పటాపంచలు చేస్తూ తాను చెప్పిన విధంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిని ప్రస్తుత అధ్యక్షుడు బిల్యానాయక్‌కే మరోమారు దక్కేలా చేసుకున్నారు. దీంతో వారం రోజుల సస్పెన్షన్‌కు తెరపడింది. ఉమామాధవరెడ్డి వర్గానికి చెక్ పడి మోత్కుపల్లి చెప్పిన నాయకునికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. వివాదరహితుడిగా పేరుండడంతో పాటు సామాజిక వర్గ కూర్పు కూడా అనుకూలంగా మారడంతో మరో రెండేళ్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బిల్యా కొనసాగనున్నారు.

 

 తీవ్ర పోటీ నడుమ..

 జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఈసారి ఆ పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ప్రస్తుత అధ్యక్షుడు బిల్యానాయక్‌తో పాటు నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాద్ , పలువురు నేతలు జిల్లా పదవిని ఆశించారు. తమ వర్గానికి కావాలంటే తమ వర్గానికి కావాలని ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గీయులు పోటీలు పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బిల్యాను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఉమా వర్గం, బిల్యాను కొనసాగించాల్సిందేనని మోత్కుపల్లి వర్గం పట్టుబట్టాయి. తనకు పదవి ఇవ్వాల్సిందేనని కంచర్ల భూపాల్‌రెడ్డి భీష్మించుకు కూర్చున్నారు.

 

  ఈ దశలో పార్టీ పరిశీలకులుగా రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు కూడా చేసేదేమీ లేక, జిల్లా పార్టీ అభిప్రాయాలు పార్టీ అధినేత చంద్రబాబుకు చెపుతామని చెప్పి ఈనెల 16న జరిగిన పార్టీ జిల్లాస్థాయి సమావేశాన్ని ముగించాల్సి వచ్చింది. మోత్కుపల్లి, ఉమా వర్గీయులు విడివిడిగా పార్టీ పరిశీలకులను కలిసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చిన నేపథ్యంలో నాయకుల ఫీడ్‌బ్యాక్‌ను తీసుకున్న పరిశీలకులు పార్టీ అధినేత కోర్టులోకి బంతిని నెట్టి వెళ్లిపోయారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో మహానాడు అనంతరం 10 రోజుల్లో పార్టీ జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తారని జిల్లా పార్టీ నేతలు భావిస్తున్నారు.

 

 మోత్కుపల్లి మొండిపట్టు..

 బంతి చంద్రబాబు కోర్టులోకి వెళ్లిన తర్వాత సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు రంగంలోకి దిగారు.  తాను చెప్పిన బిల్యాను కొనసాగించాల్సిందేనని ఆయన చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించారు. అయితే, ఉమా మాధవరెడ్డి వర్గం కూడా తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బిల్యాకు పోటీగా తెరపైకి వచ్చిన కంచర్ల భూపాల్‌రెడ్డి పేరును ఏకగ్రీవంగా చెప్పేందుకు ఉమా వర్గం ముందుకు రాకపోవడంతో అసలు ఆగ్రూపు నుంచి ఎవరి పేరు చెప్పాలన్న విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. కంచర్లకు పదవిని ఇచ్చే విషయంలో ఉమా మౌనంగానే ఉండిపోవడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

 

  ఇక ఆ శిబిరం నుంచి నెల్లూరి దుర్గాప్రసాద్, స్వామిగౌడ్‌లతోపాటు ఒక దశలో ఉమా మాధవరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మోత్కుపల్లికి చెక్ చెప్పాలంటే ఉమామాధవరెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించాలనే చర్చ తీవ్రంగా తెరపైకి వచ్చింది. ఒకదశలో మోత్కుపల్లి కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరించాల్సి వచ్చినా... మేడమ్‌మాత్రం వెనక్కు తగ్గడంతో సీన్ రివర్స్ అయింది. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంలో తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే ఇది సమయం కాదనే ఆలోచనతోనే ఆమె మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న బిల్యా నాయక్‌ను కూడా తానెప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే మార్పు జరిగితే పార్టీకి లాభం జరుగుతుందనే ఆలోచనతోనే తాను ఉన్నానని ఆమె తనను కలిసిన పార్టీ నేతలతో కూడా వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు కూడా మోత్కుపల్లి ఒత్తిడికి తలొగ్గి బిల్యాకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు తెలిపాయి.

 

 ఇప్పుడేం చేద్దాం..

 తాము ఎంత పోరాడినా పార్టీ అధినేత మోత్కుపల్లి మాటకే విలువిచ్చిన నేపథ్యంలో ఉమామాధవరెడ్డి వర్గ నేతలుగా గుర్తింపు పొందిన  నాయకులంతా కింకర్తవ్యం ఏంటనే దానిపై పునరాలోచనలో పడ్డారు. మేడమ్ మౌనంతోపాటు మోత్కుపల్లి వర్గీయుల దూకుడును ఎలా తట్టుకోవాలనే దానిపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే ఉమామాధవరెడ్డి వర్గీయులు పేరు పడ్డ నాయకులంతా సమావేశమై పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నట్టు సమాచారం. తామెంతా చెప్పినా మోత్కుపల్లి మాటకే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఉమా వర్గం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది త్వరలోనే తేలనుంది.

 

 మన స్తాపం చెందా: కంచర్ల

 జిల్లా పార్టీఅధ్యక్ష పదవిని ఆశించిన కంచర్ల భూపాల్‌రెడ్డి ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తనను పదవి దక్కకపోవడంపై మనస్తాపం చెందానని చెప్పారు. పార్టీ అభ్యున్నతి కోసం పనిచేద్దామన్న ఆలోచనతో తాను పదవిని అడిగానని, అయితే సామాజిక వర్గ కూర్పులో భాగంగా బిల్యాకు అవకాశం కల్పించారని ఆయన చెప్పారు. ఈ విషయమై త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడనున్నట్టు ఆయన వెల్లడించారు.

 

 టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తా: బిల్యా

 నల్లగొండ రూరల్: వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి అధికారంలోకి తీసుకోచ్చేందుకు కార్యకర్తలతో కలిసి సైనికుల్లా పనిచేస్తానని రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బిల్యానాయక్ అన్నారు. తన ఎన్నికకు సహకరించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, పార్టీ నాయకులందరికి ఆయన ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కొందరు నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మారలేదని, బలహీనవర్గాలన్ని టీడీపీకే మద్దతుగా ఉన్నాయన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top