‘సాగర్’ ఉద్యోగులకు అందని వేతనాలు

‘సాగర్’ ఉద్యోగులకు అందని వేతనాలు - Sakshi


 నాగార్జునసాగర్ :ఉద్యోగులంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రత్యేక ఇంక్రిమెంట్ ఆనందోత్సవాల్లో మునిగి తేలుతుండగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మాత్రం ఆ సంబరాల జాడ కనిపించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మూడు నెలలుగా వేతనాలు అందకపోవడం, ఇప్పటికీ తాము ఎక్కడ విధులు నిర్వహించాలన్న స్పష్టత ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నారు.

 

 బదిలీల రద్దు కోసం పోరాటం..

 నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో గేట్స్ మెయింటెనెన్స్, వాటర్ వర్క్స్, బిల్డింగ్స్ అండ్ రోడ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో 86 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలోని లింగంగుంట్ల సర్కిల్‌కు బదిలీ చేశారు. తామంతా తెలంగాణ ప్రాంతవారమని, కావాలనే సీమాంధ్రకు చెందిన ఉన్నతాధికారులు తమను ఆంధ్రాకు బదిలీ చేశారని, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేది లేదని పేర్కొంటూ 20 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సమస్యలను తెలంగాణ సర్కార్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తప్పును సరిదిద్దాలని ఆదేశించారు. ఈ ప్రాంత ఉద్యోగులందరికీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు రద్దయ్యాయి.

 

 రూ.50లక్షల మేర బకాయిలు..

 ప్రాజెక్టు పరిధిలో 86మంది పనిచేస్తుండగా వీరిలో 20 మంది ఉద్యోగులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి విధుల్లో చేరారు. కాగా ఉద్యోగుల బదిలీ, ఆందోళన నేపథ్యంలో జూన్ నుంచి వేతనాలు నిలిచిపోయాయి. సుమారు రూ.50లక్షల మేర వేతనాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం బదిలీలు రద్దు కావడంతో ఇక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణ ఉద్యోగులుగా పరిగణించి వెంటనే వేతనాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన ఫైల్ శనివారం రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగానికి చేరినట్లు సమాచారం.

 

 ఆంధ్రా అధికారుల ఒత్తిడితోనే...

 ఆంధ్రా అధికారులు స్వార్థంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టు కార్యాలయాన్ని రైట్‌బ్యాం కు తరలించారు. సిబ్బంది మాత్రం ఇక్కడే విధులు నిర్వహించారు. కార్యాలయం ఒక్కటి అక్కడ ఉండడంతో సబ్‌డివిజన్ మొత్తాన్ని ఆంధ్రాకు బదలాయించారు.

 - కనకయ్య, ఏఐటీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

 

 అవగాహన రాహిత్యంతో ఇబ్బందులు

 ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ అవగాహన రాహిత్యంతో సాగర్ సబ్‌డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని లింగంగుంట్లకు తరలించారు. అధికారులు చేసిన తప్పిదానికి 86 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. త్వరలో వేతనాలు అందేలా కృషిచేస్తున్నాం.

 - రామ్మోహన్, డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

 

 మోసం అవతగమైంది...

 సబ్ డివిజన్‌ను ఆంధ్రాకు తరలించి కుడి కాల్వ వెంట ఉన్న గేట్లను మరమ్మతులు చేయించడానికి ఆంధ్రా ఇంజినీర్లు ప్రణాళిక వేశారు. మేము అక్కడకు పోకముందే  మరమ్మతుల కు ఆర్డర్లు తయారు చేశారు. వారి మోసం అవగతమైంది. అందుకే మేము అక్కడికి వెళ్లలేదు.

 - రాజు, వర్క్‌చార్జ్‌డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top