టెండర్లు ప్రహసనమేనా?

టెండర్లు ప్రహసనమేనా?


- పూర్తికాని నాచుపల్లి జేఎన్టీయూ హాస్టళ్ల టెండర్లు

- పాతవారికి కట్టజెప్పేందుకు అధికారుల యత్నాలు

- అన్నీ అవకతవకలే : టెండర్‌దారులు

కొడిమ్యాల :
నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టళ్ల నిర్వహణకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ అంతా ప్రహసనంగానే కనిపిస్తుంది. పాతవారికే అప్పగించేందుకు కళాశాల అధికారులు కుట్రలు చేస్తున్నారని టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. అధికారుల వైఖరి సైతం వీరి ఆరోపణలకు బలం చూకూరుస్తున్నారుు. 2015-16 విద్యాసంవత్సరానికి బాలురు, బాలికల హాస్టళ్లు, క్యాంటీన్ల నిర్వహణకు గతనెల 27న టెండర్లు ఆహ్వానించారు. బాయ్స్‌హాస్టల్‌కు 10, గర్ల్స్‌హాస్టల్‌కు 10, క్యాంటీన్‌కు 3 టెండర్లు దాఖలయ్యా యి. నిబంధనల ప్రకారం తక్కువ కోట్‌చేసిన వారికి టెండర్ ఖరారు చేయాలి. టెండర్లలో పాల్గొనదలిచిన వారు 14 రకాల డాక్యుమెంట్లు సమర్పించాలి.



పరిశీలన సమయంలో అధికారులు ముందుగా టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేసి అన్ని సరిగ్గా ఉన్న వాటినే అనుమతించాలి. కానీ ఇక్కడి అధికారులు మాత్రం ఫైనాన్షియల్ బిడ్‌ను మాత్రమే పరిశీలించారు. టెండర్‌దారులందరూ 14 రకాల డాక్యుమెంట్లు సమర్పించారో, లేదో పట్టించుకోలేదు. ఫైనాన్షియల్ బిడ్‌ను పరిశీలించిన అధికారులు తక్కువ కోట్ చేసిన వారికే టెండర్ ఇస్తున్నట్లు ప్రకటించనూ లేదు. దీంతో వీరి వైఖరిపై పలు అనుమానాలు కలుగుతున్నారుు.

 

పాతవారికి ఇప్పించేందుకే ఆలస్యమా?

బాయ్స్‌హాస్టల్ నిర్వహణ  బాధ్యతలు మారుతున్నప్పటికీ, ఏడేళ్లుగా గర్ల్స్‌హాస్టల్ నిర్వహణ ను వివిధ సంస్థల పేరుతో ఒకే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈసారి కూడా అతనికే అప్పగించేందుకు కళాశాల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. గర్ల్స్‌హాస్టల్‌కు అత్యల్పంగా ఆంజనేయ ఫర్మ్ తరఫున ఒక్క విద్యార్థినికి రూ.44.89 చొప్పున, బాయ్స్‌హాస్టల్‌కు అత్యల్పంగా సరోజ ఫర్మ్ తరఫున ఒక్క విద్యార్థికి రూ.55 చొప్పున టెండర్లు వచ్చాయి. తమకు అనుకూలమైన వ్యక్తి వీటికన్నా ఎక్కువ మొత్తాన్ని కోట్ చేయడంతో అతనికే టెండర్‌దక్కేలా చేసేందుకు అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని మిగతా టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. గతేడాది కూడా బాయ్స్‌హాస్టల్ టెండర్ పొందిన వ్యక్తికి గర్ల్స్‌హాస్టల్ నిర్వహణ బాధ్యతలు, గర్ల్స్‌హాస్టల్ టెండర్లు పొందిన వ్యక్తికి బాయ్స్‌హాస్టల్ బాధ్యతలు అప్పగించారు.



విద్యార్థుల అభిప్రాయంపై అనుమానాలు

టెండర్‌దారులకున్న అర్హతలను విద్యార్థుల సమక్షంలో చర్చించామని, బాయ్స్, గర్ల్స్‌హాస్టల్ రెండు టెండర్లనూ మణికంఠ ఏజన్సీకే ఇవ్వాలని విద్యార్థులు తీర్మానించారని ప్రిన్సిపాల్ ఎన్వీ రమణ తెలిపారు. అరుుతే మణికంఠ ఏజెన్సీ వారే గతేడాది గర్ల్స్‌హాస్టల్‌ను నిర్వహించారు. మిగతావారి కంటే అత్యధికంగా గర్ల్స్‌హాస్టల్‌కు రూ.50, బాయ్స్‌హాస్టల్‌కు రూ.62 కోట్‌చేశారు.



వీరికి అనుకూలంగా వ్యవహరించేందుకే టెండర్ల వ్యవహారంలోకి విద్యార్థుల అభిప్రాయం అనే కొత్తసూత్రాన్ని అధికారులు తీసుకొచ్చారని మిగతా వారి నుంచి ఆరోపణలు వస్తున్నారుు. కళాశాల అధికారులు మాటల్లో చెబుతున్న పారదర్శకతను ఆచరణలో చూపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. టెండర్ ఖరారు గురించి ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే దాటవేస్తున్నాడని, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొందరు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మరికొందరు పేర్కొంటున్నారు.

 

ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా విద్యార్థులే మెస్ బిల్లు చెల్లిస్తున్నందున.. వారిని టెండర్ల ప్రక్రియలో ఇన్‌వాల్వ్ చేశామన్నారు. రెండురోజుల్లో యూనివర్సిటీ ఉన్నతాధికారుల వద్దకు టెండర్ ఫారాలు తీసుకెళ్లి ఫైనల్ చేస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top