'అదంతా అబద్ధం.. అందులో వాస్తవం లేదు'

'అదంతా అబద్ధం.. అందులో వాస్తవం లేదు' - Sakshi


హైదరాబాద్‌: కడ్తాల్‌ టోల్‌గేట్‌ సిబ్బందిపై తన కుమారుడు మనీష్‌ దాడి చేసినట్టు వచ్చిన వార్తలను టీఆర్‌ఎస్‌ నేత రామ్మోహన్‌ గౌడ్‌ ఖండించారు. తన కొడుకు ఎవరిపై దాడి చేయలేదని, ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. దాడి జరిగిన సమయంలో మనీష్‌ డ్రైవింగ్‌ సీటులో ఉన్నాడని, అతడి స్నేహితుల్లో ముగ్గురు దాడి చేశారని వెల్లడించారు. గాయపడిన టోల్‌గేట్‌ సూపర్‌ వైజర్‌ తమ దూరపు బంధువని తెలిపారు. కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలయానికి వెళ్లేటప్పుడు రాను, పోను టోల్‌ చెల్లించారని చెప్పారు. టోల్‌ చెల్లించలేదనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన కుమారుడు తప్పు చేసివుంటే శిక్షించాలన్నారు.



దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ ద్వారా తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేసినట్టు శంషాబాద్‌ డీసీపీ తనకు తెలిపారని వెల్లడించారు. ఆరుగురు నిందితులు కస్టడీలో ఉన్నారని చెప్పారు.



టోల్‌గేట్‌ డబ్బులు అడిగినందుకు సోమవారం రాత్రి తన అనుచరులతో కలిసి టోల్‌గేట్‌ సిబ్బందిపై మనీష్‌ గౌడ్‌ దాడికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ గండిమైసి టోల్‌గేట్‌ వద్ద  చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మనీశ్‌, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మనీష్‌ గౌడ్‌ తల్లి లక్ష్మీప్రసన్న వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top