మూడు నెలల్లోగా ముస్లిం రిజర్వేషన్లు

మూడు నెలల్లోగా ముస్లిం రిజర్వేషన్లు - Sakshi


 ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ వెల్లడి

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ముస్లింల స్థితిగతులపై మూడు నెలల కాలపరిమితితో రిటైర్డు జడ్జి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని, దాని నివేదిక అందిన వెంటనే రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం ఆయన హైటెక్స్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు మహేందర్‌రెడ్డి, పద్మారావుతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు ముంతాజ్ ఖాన్, కౌసర్ మొహియుద్దీన్, అహమ్మద్ బలాల, ఎమ్మెల్సీలు అల్తాఫ్ రిజ్వీ, సలీం, జాఫ్రీ, ప్రముఖ విద్యావేత్త మహబూబ్ ఆలం ఖాన్‌తో పాటు ఇరాన్, టర్కీ దేశాల రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ముస్లిం ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో 70 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఓ రాష్ట్రంలో ఒక విధానం, మరో రాష్ట్రంలో ఇంకో విధానం ఉండదు. తమిళనాడు తరహాలోనే రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపెడతాం’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వచ్చిన తొలి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మసీదులు, దర్గాల మరమ్మతుల కోసం రూ. 7 కోట్లు విడుదల చేశామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పండుగ కానుకగా ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జూలై నెల జీతాలు చెల్లిస్తామన్నారు. ముస్లింల సంక్షేమం కోసం రానున్న బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ముస్లిం మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. మార్కెట్‌యార్డు కమిటీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, వర్సిటీల వైఎస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీలోనూ ముస్లింలకు చోటు కల్పిస్తామన్నారు. రాష్ట్ర హజ్ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభంకానున్న హజ్ యాత్రలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top