మల్లన్నసాగర్‌ టెండర్లన్నీ ‘ఎక్సెస్‌’


రూ.6,803 కోట్ల పనులను 3 శాతం ఎక్సెస్‌కు దక్కించుకున్న ఆఫ్కాన్స్, ఎల్‌అండ్‌టీ, రాఘవ, హెచ్‌ఈఎస్‌

► ఖజానాపై రూ.236 కోట్ల అదనపు భారం

► కొండపోచమ్మసాగర్‌కు లెస్‌ దాఖలు చేసిన ఏజెన్సీలు




సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ టెండర్లన్నీ అధిక ధరల (ఎక్సెస్‌)కే దాఖలయ్యాయి. రిజర్వాయర్‌ పనులను నాలుగు రీచ్‌లుగా విభజించి నాలుగు ప్యాకేజీలకింద టెండర్లు పిలవగా నాలుగింటినీ కాంట్రాక్టు ఏజెన్సీలు ఎక్సెస్‌ ధరలతోనే దక్కించుకున్నాయి. దీంతో ప్రభుత్వంపై రూ.236 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. ఇక కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్, దానికింద కన్వెయర్‌ వ్యవస్థల పనులకు సంబంధించిన నాలుగు ప్యాకేజీలకు మాత్రం లెస్‌తో టెండర్లు దాఖలయ్యాయి.



ఎక్సెస్‌తో భారం..

కాళేశ్వరంలోని మల్లన్న, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్, వాటి కింది కాల్వల వ్యవస్థ నిర్మాణాలకు గత నెల 19న నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం రూ.10,843కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను శనివారం రాత్రి పదకొండు గంటలకు తెరిచారు. ఇందులో 50 టీఎంసీల మల్లన్నసాగర్‌ పనులను మొత్తం రూ.6,803 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనుల్లో మొదటి రీచ్‌కు తొలి కిలోమీటర్‌ నుంచి 8.5 కిలోమీటర్‌ వరకు మట్టికట్ట పనులకు రూ.1,822 కోట్లతో టెండర్‌ పిలిచారు.


దీన్ని 3.9శాతం ఎక్సెస్‌తో ఆఫ్కాన్స్‌ ఏజెన్సీ దక్కించుకుంది. ఇక 8.5 కిలోమీటర్‌ నుంచి 12.8 కిలోమీటర్‌ వరకు రూ.1,499 కోట్లతో టెండర్‌ పిలవగా, దీన్ని3.15 శాతం ఎక్సెస్‌తో ఎల్‌అండ్‌టీ, 12.8 కిలోమీటర్‌ నుంచి 16.7 కిలోమీటర్‌ వరకు రూ.2,046.64 కోట్లతో పిలవగా రాఘవ సంస్థ 3.5శాతం ఎక్సెస్‌తో, 16.7 కిలోమీటర్‌ నుంచి 22.9వ కిలోమీటర్‌ వరకు రూ.1,436.77 కోట్లతో పిలవగా దీన్ని3.2శాతం ఎక్సెస్‌తో హెచ్‌ఈఎస్‌ ఏజెన్సీలు దక్కించుకున్నాయి.



మిగతావి లెస్‌..

ఇక కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించి రూ.1,600 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో 5.50 కిలోమీటర్‌ వరకు తొలి రీచ్‌గా నిర్ణయించి దానికి రూ.900.23 కోట్లతో టెండర్‌ పిలవగా దీన్ని 1.75 శాతం లెస్‌ ధరకు కేఎన్‌ఆర్‌ ఏజెన్సీ, రెండో రీచ్‌కు రూ.700 కోట్లతో టెండర్‌ పిలవగా, దాన్ని హెచ్‌ఈఎస్‌ ఏజెన్సీ దక్కించుకుంది.


ఇక రిజర్వాయర్‌ కింద అప్రోచ్‌ చానల్, కాల్వలు, గ్రావిటీ కాల్వ, టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌజ్‌ నిర్మాణాలకు సంబంధించి ప్యాకేజీ–14 పనులకు రూ.1,875 కోట్లతో టెండర్‌ పిలవగా, దాన్ని ఒక శాతం లెస్‌తో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ దక్కించుకోగా, ప్యాకేజీ–13కు చెందిన రూ.556.11 కోట్ల పనులను 1.25 శాతం లెస్‌తో సత్యఇన్‌ఫ్రా సంస్థ దక్కించుకుంది. ఈ టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్ల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top