మూడో అంతస్తులో మూలవిరాట్టు!

మూడో అంతస్తులో మూలవిరాట్టు!


నాలుగంతస్తుల భవనంగా ఇష్టానికి నిర్మాణం హైదరాబాద్‌లో ఓ ప్రబుద్ధుని నిర్వాకం స్థానికుల ఫిర్యాదుతో నోరెళ్లబెట్టిన అధికారులు రాష్ట్రంలో పలు ప్రాచీన ఆలయాలది ఇదే దుస్థితి ఆధునీకరణ ముసుగులో నిలువునా విధ్వంసం మూల విరాట్లను కూడా పెకిలిస్తున్న వైనం



సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న నాలుగు శతాబ్దాల క్రితం నాటి ఆలయమిది. సంప్రదాయ పూజాదికాలతో అలరారిన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఇప్పుడు ఓ అపార్ట్‌మెంటు తరహాలోకి మారిపోయింది. ఇతర అవసరాల కోసం పురాతన ఆలయాన్ని తొలగించి, మూల విరాట్లను సైతం పెకిలించి నాలుగంతస్తుల్లో భారీ భవనాన్ని నిర్మించారు. మూడో అంతస్తులో దేవతామూర్తిని పునఃప్రతిష్టించబోతున్నారు. దేవాలయం మూడో అంతస్తులో ఉండటమేంటని స్థానికులు ఆశ్చర్యపోయి దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేయటంతో అధికారులు నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి తన లాభం కోసం గుడినే అపార్ట్‌మెంట్‌ మాదిరి మార్చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో లాలాపేటలోని కాకతీయుల కాలం నాటి ఆలయం తాజాగా నేలమట్టమైన తీరుపై మరో ఫిర్యాదు అందింది. విస్తరణ పేరుతో ఆలయ నిర్వాహకులు.. దేవాదాయ శాఖ, పురావస్తుశాఖ అనుమతి లేకుండా పూర్తిగా కూల్చి, నాటి భారీ రాళ్లు, స్తంభాలను తొలగించి సిమెంటు మందిర నిర్మాణం చేపట్టారు. దీనిపైనా అధికారులు విస్తుపోయారు. ఇలాంటి విధ్వంసాలు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో శోధించే పని మొదలుపెట్టారు.



సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో దేవాలయాలున్నాయి. పాత వాటి కంటే కొత్త వాటి సంఖ్యే ఎక్కువ. వందల ఏళ్లనాటి పురాతన ఆలయాలూ ఎన్నో ఉన్నా.. వాటిల్లో కొన్ని మాత్రమే దేవాదాయశాఖ అధికారుల అజమాయిషీలో ఉన్నాయి. ఏటా రూ.50 వేల లోపు ఆదాయం ఉన్నవాటిని దేవాదాయ శాఖ పట్టించుకోవటం లేదు. కేవలం 6,500 దేవాలయాలు మాత్రమే దాని పరిధిలో ఉన్నాయి. దేవాదాయ శాఖ చట్టం–1987 నిబంధన 1(3) ప్రకారం.. ఏ దేవాలయమైనా చట్టానికి లోబడే నిర్వహణ సాగాలి. దేవాదాయ శాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ అయినా కాకున్నా అన్ని ఆలయాలకు దేవాదాయ శాఖ చట్టం వర్తిస్తుంది. కానీ దీనిపై అవగాహన లేని ఆ ఆలయ కమిటీ సభ్యులు.. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా యథేచ్ఛగా పురాతన ఆలయాలను ఆధునీకరిస్తున్నారు. పురాతన ఆలయాలను విస్తరించాలన్నా, ఆధునీకరించాలన్నా ముందుగా దేవాదాయ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాని ప్రాధాన్యం ఆధారంగా పురావస్తు శాఖనూ సంప్రదించాలి. ఆయా శాఖల అధికారుల సూచనల మేరకు మాత్రమే జీర్ణోద్ధరణ, విస్తరణ, ఆధునీకరణ పనులు చేపట్టాలి. మూలవిరాట్టును అలాగే ఉంచి పనులు జరపాలి. మూలవిరాట్టుకు ఇబ్బంది వాటిల్లే పరిస్థితి ఉంటే ఆగమశాస్త్ర పద్ధతిని అనుసరించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. ఆలయానికి చెందిన పాత స్తంభాలు, రాళ్లను వినియోగిస్తూనే కొత్త నిర్మాణం చేపట్టాలి. కానీ చాలా చోట్ల తాత్కాలిక పూజాదికాలు నిర్వహించి మూలవిరాట్టును పెకిలిస్తున్నారు. ఆలయ పురాతన రాళ్లు, స్తంభాలను విరగ్గొట్టి ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఫలితంగా భావితరాలకు అందాల్సిన అలనాటి ఆలయాల శోభ కనుమరుగవుతోంది.



పునరుద్ధరణ కాదు.. విధ్వంసం..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో కొందరు.. ఓ వ్యక్తి పేరుతో ఆలయ పునరుద్ధరణకు దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అక్కడ యథేచ్ఛగా విధ్వంసం సాగింది. ఇప్పుడు ఏకంగా ఆ వ్యక్తిని ఫౌండర్‌ ట్రస్టీగా గుర్తించాలంటూ దేవాదాయ శాఖకు దరఖాస్తు అందింది. దానిపై విచారణ జరపగా అక్కడి విధ్వంసం వెలుగు చూసింది. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా వ్యవహారం జరుగుతున్నట్టు అధికారులు గుర్తించి చర్యలకు సిద్ధమయ్యారు. భూమిపై మూలవిరాట్టు కొలువుదీరి సంప్రదాయరీతిలో ఉన్న ఆలయాన్ని ఆధునీకరణ పేరుతో అపార్ట్‌మెంట్‌గా మార్చి మూడో అంతస్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేసే యత్నాలపై స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దిగువ నిర్మాణాలను వాణిజ్యపరంగా వినియోగించుకొనేందుకే ఇలా చేసినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.



దేవాలయాల పరిరక్షణపై అవగాహన సదస్సు

పురాతన ఆలయాల పరిరక్షణపై ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్, సేవ్‌ టెంపుల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తాధ్వర్యంలో ద్వారకా తిరుమలలో ఈనెల 24, 25 తేదీల్లో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పురాతన దేవాలయాల పరిరక్షణపై అవగాహన కల్పించటం కూడా దీని ఉద్దేశాల్లో ఒకటి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top