అవన్నీ ఊహాగానాలే..

అవన్నీ ఊహాగానాలే.. - Sakshi


* సాక్షి టీవీతో ఎంపీ కవిత ముఖాముఖి

* కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఎంపీ కవిత

* పార్టీలో, ఇంట్లో ఎన్నడూ ఈ చర్చ రాలేదు

* చంద్రబాబు సహకరించకున్నా.. కోతల్లేకుండా కరెంటు ఇస్తున్నాం


 

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించాలన్న చర్చ పార్టీలోగాని, ఇంట్లోగాని ఎన్నడూ రాలేదని సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ అంశంపై వచ్చినవన్నీ ఊహాగానాలేనని ఆమె కొట్టిపారేశారు. ఆదివారం రాత్రి ‘సాక్షి’ టీవీ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టలేదని.. ప్రభుత్వ పనితీరు నచ్చడం వల్లే ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నట్లు వచ్చిన వార్తల్లోనూ నిజం లేదని, ఆ దిశగా బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని కవిత చెప్పారు.

 

 అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సఖ్యంగా ఉండడం తెలంగాణకు అవసరమన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య మంచి సంబంధాలున్నాయని.. భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబమే పదవులను అనుభవిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ.. ప్రజలే న్యాయ నిర్ణేతలని, వారే తమను ఎన్నుకున్నారని కవిత పేర్కొన్నారు. ఐదేళ్లలో తమ పాలన నచ్చకుంటే ఆ ప్రజలే తమను ఇంటికి పంపిస్తారన్నారు. చంద్రబాబు కరెంటు విషయంలో సహకరించకపోయినా.. వేసవిలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన ఉంటుందని కవిత పేర్కొన్నారు.

 

 గుజరాత్‌తోనే పోటీ..

 తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఏ మాత్రం పోటీ కాదని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉన్న గుజరాత్‌తో మాత్రమే పోటీ పడుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విదేశాలకు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానిస్తుంటే.. తెలంగాణకు మాత్రం ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా పెట్టుబడులతో తరలి వస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తామెప్పుడూ దూరం కాలేదని, దూరం కాదలచుకోలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తక్కువ పనిచేసి ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top