కదులుతున్న కాళేశ్వరం

కదులుతున్న కాళేశ్వరం


► యుద్ధ ప్రాతిపదికన మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణం

► భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు..

► రాత్రిపూటా పనులు



► బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు     సమాంతరంగా.. చకచకా..

► వచ్చే ఖరీఫ్‌ నాటికి 100 టీఎంసీలను ఎల్లంపల్లికి తరలించడమే లక్ష్యం

► వచ్చే మేలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తాం: అధికారులు




కాళేశ్వరం బ్యారేజీ ప్రాంతం నుంచి సోమన్నగారి రాజశేఖరరెడ్డి



ఎక్కడ చూసినా లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక, కంకర కుప్పలు.. భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు.. రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లోనూ పనులు.. 360 డిగ్రీల కోణంలో నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..! గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతానికి దిగువన కాళేశ్వరం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనుల దృశ్యమిదీ!! బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల మధ్య పోటీ పెట్టారా అన్నట్టుగా నిర్మాణ పనులు మహాయజ్ఞంలా సాగుతున్నాయి. రోజుకు ఒక్కో బ్యారేజీ వద్ద 15 వేల టన్నుల సిమెంట్‌ వినియోగిస్తూ కాంక్రీట్‌ పనులు చేస్తున్నారు. వర్షాలు కురిసినా, గోదావరి నుంచి నీరొచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాలు పూర్తి చేసి, డీ వాటరింగ్‌ పద్ధతిన నీటిని తొలగించే పనులు చకచకా జరుగుతున్నాయి. ఆరునూరైనా వచ్చే ఖరీఫ్‌ నాటికి 100 టీఎంసీల గోదావరి నీటిని ఎల్లంపల్లికి తరలించాలన్న సంకల్పంతో ఇంజనీర్లు పనిచేస్తున్నారు.



మూడు ప్రధాన జలాశయాలు..

మేడిగడ్డ నుంచి 180 టీఎంసీల నీటిని మళ్లించి 18.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నీటి నిల్వల కోసం కొత్తగా 147.71 టీఎంసీల సామర్థ్యం గల 20 జలాశయాలను నిర్మించనుండగా, అందులో ప్రధానమైనవి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల. ఈ మూడింటినీ కలిపి సుమారు 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తంగా రూ.13,811 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇందులో పంప్‌హౌజ్‌ల నిర్మాణాలకు రూ.7,998 కోట్లు, బ్యారేజీల నిర్మాణాలకు రూ.5,813 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులన్నింటినీ ఒకేమారు ఆరంభించి చేపట్టారు.



కీలకం.. మేడిగడ్డ పంప్‌హౌజ్‌

16.17 టీఎంసీల సామర్థ్యంతో మేడిగడ్డ బ్యారేజీ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 1,650 టీఎంసీల నీటి లభ్యత ఉండనుండగా.. గోదావరి ఏకంగా 1.3 కి.మీ. వెడల్పుతో ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరిలో 10 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నదిపై 1.63 కి.మీ. పొడవులో బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. ఈ బ్యారేజీ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దు. ఆ రాష్ట్రంలో 170 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీంతో ఆ రాష్ట్ర సహకారంతో రెండు వైపులా బ్యారేజీ పనులు మొదలు పెట్టారు. మనవైపు (తెలంగాణ) ప్రాంతంలోని పనులు వేగంగా జరుగుతున్నాయి. పనిని మొత్తంగా 8 బ్లాక్‌లుగా విభజించి 6 బ్లాక్‌ల పనులు మొదలు పెట్టారు. ఏడో బ్లాక్‌లో పనులు చేసుకునేందుకు వీలుగా.. గోదావరి సహజ ప్రవాహానికి ఇబ్బంది కలగకుండా కాపర్‌ డ్యామ్‌లు పూర్తి చేశారు. వీటితోపాటే గోదావరి బెడ్‌లెవల్‌లో రాఫ్ట్‌ పనులు పూర్తయ్యాయి.


16 ఎక్స్‌కవేటర్‌లు, 55 టిప్పర్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. మొత్తంగా రూ.65 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ నాటికి బ్యారేజీ పనులను పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 22 కిలోమీటర్ల దిగువన పంప్‌హౌస్‌ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 11 పంపులను ఏర్పాటు చేయనుండగా మరో 6 పంప్‌లను భవిష్యత్‌ అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా వీటిని డిజైన్‌ చేస్తున్నారు. ఇక్కడ 64 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ పని జరగాల్సి ఉండగా 45 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. మరో 45 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని పూర్తయింది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకున్నా.. పంప్‌హౌస్‌ పనులు పూర్తయితే 92 మీటర్ల లెవల్‌ నుంచి ప్రవహించే గోదావరి నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ్నుంచి వచ్చే ఖరీఫ్‌ నాటికి కనీసం 100 టీఎంసీలు అయినా పంపింగ్‌ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డిప్యూటీ ఇంజనీర్‌ సూర్యప్రకాశ్‌ తెలిపారు.



పనుల్లో ముందు.. అన్నారం

మేడిగడ్డ పంప్‌హౌస్‌ నుంచి 13.2 కి.మీ. దూరంలో 11 టీఎంసీల కెపాసిటీతో అన్నారం బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. 1.2 కి.మీ. పొడవుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. భూసేకరణ పూర్తవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 6 బ్లాక్‌లుగా పనులు చేపట్టగా 4 బ్లాక్‌ల్లో పని మొదలైంది. ఇక్కడ రోజుకు 1,600 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేస్తున్నారు. రాఫ్ట్‌ పనులకు అత్యంత అధునాతన వాహనాలు వినియోగిస్తున్నారు. సుమారు వెయ్యి మంది మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా రూ.152 కోట్ల పనులు పూర్తయ్యాయి. జూన్‌ నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్యారేజీ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో 12 పంపులతో పంప్‌హౌస్‌ నిర్మాణం చేపట్టారు. మొత్తం 6 బ్లాక్‌లుగా పని విభజన చేయగా.. అన్నింటా పనులు మొదలయ్యాయి. ఇక్కడ ఇప్పటికే రూ.200 కోట్ల పనులు పూర్తి చేసినట్లు డీఈ మధు తెలిపారు. 425 ఎకరాలకుగానూ మరో 67 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని, పంప్‌హౌస్‌ను జూన్‌ నాటికే సిద్ధం చేస్తామని వివరించారు.



సుందిళ్ల ఓకే..

మిగతా బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పోలిస్తే సుందిళ్ల బ్యారేజీ పనులు కాస్త ఆలస్యమైనా వేగంగానే జరుగుతున్నాయి. భూసేకరణకు ఆటంకాలు లేకపోవడంతో బ్యారేజీ పనుల్లో వేగం కనిపిస్తున్నా.. పంప్‌హౌజ్‌ పనులు కాస్త నెమ్మదించాయి. అన్నారం పంప్‌హౌస్‌కు 3 కిలోమీటర్ల ఎగువన 3.11 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన బ్యారేజీ పనులను 6 బ్లాక్‌లుగా విభజించగా.. మూడు బ్లాకుల్లో పని మొదలైంది. రోజుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్లకు తగ్గకుండా పనులు జరుగుతున్నాయి. వచ్చే జూలై నాటికి మొత్తం 68 రేడియల్‌ గేట్లు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. బ్యారేజీ వరకు రూ.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. దీనికి 15 కి.మీ. దూరంలో పంప్‌హౌస్‌ నిర్మాణం చేయనుండగా.. 12 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ 51 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ పనులు పూర్తవగా.. కాంక్రీట్‌ పనులు ఈ వారంలో ఆరంభించేలా చర్యలు తీసుకున్నారు. వచ్చే ఖరీఫ్‌కు 100 నుంచి 120 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి తరలిస్తామని, మే నెలలో ప్రాజెక్టు ట్రయల్‌ రన్, జూన్‌లో వెట్‌ రన్‌ నిర్వహిస్తామని సీఈ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top