తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీఆర్


 టీడీపీనేత మోత్కుపల్లి నర్సింహులు

 

 సాక్షి, హైదరాబాద్: పటేల్, పట్వారీ పెత్తందారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీ రామారావు అని తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హేయమైన చర్య అని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడంపై ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కొత్త ప్రాజెక్టులకు పేర్లు పెట్టే విషయమై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవచ్చు గానీ, ఇది వరకే ఉన్న పేరును కొనసాగించేందుకు అవసరం లేదని అన్నారు.

 

 ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే: తీగల



 మహేశ్వరం: శంషాబాద్ విమానాశ్రయంలో టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యక్తిగతంగా తాను సమర్థిస్తున్నానని ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. కాగా..  తెలంగాణ జన జీవనానికి వైతాళికుడైన మాజీ సీఎం ఎన్టీ రామారావు సీమాంధ్రకు పరిమితమనడం తెలంగాణ సీఎం కేసీఆర్ విచక్షణకు, సంస్కారానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. సాయిబాబు అన్నారు. తెలుగు వ్యక్తి పేరు పునరుద్ధరిస్తే రాజకీయం చేయడమా తెలంగాణ సంస్కృతి అని శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో నిలదీశారు. శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top