ఇల్లు ఎందుకు అమ్మావని..

ఇల్లు ఎందుకు అమ్మావని..


 నవమాసాలు మోసి కని, పెంచిందనే కనికరం కూడా అతడికి కలగలేదు..గోరుముద్దలు..లాలిపాటలు గుర్తుకేరాలేదు.. నాన్నా తల్లినిరా అన్నా వదల్లేదు.. కర్రతో తలపై బలంగా కొట్టి.. ఆపై నాపరాయిపై తోసేయడంతో ‘తల్లి’డిల్లి ‘పోయింది’..ఈ దారుణం మంగళవారం నకిరేకల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ..

 -నకిరేకల్  

 

 నకిరేకల్‌లోని శివాజీనగర్‌లో నివాసముంటున్న పుపాల కళమ్మ(45) కుమారుడు సతీష్, కుమార్తె రాజేశ్వరి సంతానం. తన తల్లిదండ్రులు ఇచ్చిన స్థలంలో రేకులతో ఇల్లు నిర్మించుకుని నివసిస్తోంది. భర్త పన్నెం డేళ్ల క్రితమే చనిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను పెద్దచేసింది. కుమారుడు సతీష్ నాలుగేళ్ల క్రితమే కులాంతర వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చేసేదేమీ లేక కళమ్మ అప్పు చేసి కుమార్తె వివాహం చేసింది. అప్పు తీర్చేందుకు కళమ్మ ఉన్న ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కుమారుడికి కూడా చెప్పింది. కళమ్మ తొమ్మిది నెలల క్రితం ఇల్లు విక్రయించింది. ఇల్లు ఖాళీ చేయలేదు. విక్రయించిన వారికి నాలుగు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసింది. మంగళవారం ఇంటిని ఖాళీ చేస్తుండగా సతీష్ ఇంటికి వచ్చాడు.


ఇల్లు ఎందుకు విక్రయించావని తల్లితో గొడవపడ్డాడు. ఇద్దరి ఘర్షణ తారాస్థాయికి చేరడంతో కోపోద్రిక్తుడైన సతీష్ కర్రతో కళమ్మ తలపై బలంగా కొట్టాడు. నేను నీ కన్నతల్లినిరా అన్నా వినకుండా నాపరాయిపై తోసేయడంతో కళమ్మ తలకు బలమైన గాయమైంది. రక్తపు మడుగులో ఆమెను చూసి సతీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లోనే ఉన్న కుమార్తె రాజేశ్వరి తల్లిని 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. సీఐ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిం చారు. మృతురాలి కూతురు రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top