గణపతి ‘తల’వెల రూ.2.45 కోట్లు

గణపతి ‘తల’వెల రూ.2.45 కోట్లు - Sakshi


దేశంలోనే మోస్ట్ వాంటెడ్

తాజాగా మహారాష్ట్ర రివార్డు రూ.కోటి

అన్ని రాష్ట్రాలకూ అతడే టార్గెట్

పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు తలకు వెల రూ.2 కోట్లు దాటింది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన రివార్డులను కలిపితే అతి పెద్ద రివార్డుతో గణపతి దేశంలోనే ‘మోస్ట్ వాంటెడ్’గా నిలిచాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్‌లోని సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామానికి చెందిన గణపతి 1976లో ఎమర్జెన్సీలో అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం జగిత్యాల జైత్రయాత్రలో కొండపల్లి సీతారామయ్య, మల్లోజుల కోటేశ్వర్‌రావు తదితరులతో కలసి పీపుల్స్‌వార్ పార్టీని స్థాపించారు. 1979 నుంచి అజ్ఞాతవాసంలో ఉన్న గణపతి.. కొండపల్లిని పార్టీ నుంచి తొలగించిన అనంతరం 1989 నుంచి వరుసగా ఇప్పటి వరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.



దేశంలోనే వివిధ విప్లవ సంస్థలను తమలో కలుపుకుని మావోయిస్టు పార్టీగా అవతరించిన తరువాత కూడా ఆయనే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉంటూ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీతో సమాంతర పాలన కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ బలహీనమైనా... ఎందరో కీలక నాయకులు ఎన్‌కౌంటర్లలో హతమైనా... పార్టీని నడుపుడుతున్న గణపతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు తీవ్రంగా వేటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర గణపతిపై ఏకంగా రూ. కోటి రివార్డును ప్రకటించింది.



అంతకు ముందే మన ప్రభుత్వం రూ.50 లక్షలు, ఒడిషారూ.10 లక్షలు, జార్ఘండ్, బీహార్ రాష్ట్రాల్లో రూ.25 లక్షల చొప్పున, పశ్చిమ బెంగాల్‌లో రూ.10 లక్షలతోపాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా రూ.25 లక్షలను అప్పట్లోనే రివార్డుగా ప్రకటించాయి. రివార్డులన్నీ కలిపితే గణపతి తల ఖరీదు రూ.2.45 కోట్లు పలుకుతోంది. మనదేశంలో ఉగ్ర, తీవ్రవాద గ్రూపుల్లో ఏ వ్యక్తికీ లేని రీతిలో రివార్డులు ప్రకటించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గణపతిపై గురి పెట్టాయి. గతంలో గందపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.40 లక్షలు, తమిళనాడు సర్కార్ రూ.20 లక్షల రివార్డును ప్రకటించాయి. అవి అప్పట్లో అతి పెద్ద రివార్డుగా పేర్కొన్నారు.

 

రోజుకు 20 గంటల శ్రమ


మావోయిస్టు పార్టీ నలుమూలల విస్తరించడంలో గణపతి పడుతున్న శ్రమ అంతా.. ఇంతా కాదని... ఆయనకు అంగరక్షకులుగా పనిచేసి లొంగిపోయిన ‘మాజీ’లు పేర్కొంటున్నారు. 60 ఏళ్ల పైబడ్డ గణపతి 34 ఏళ్లుగా పూర్తికాలం అజ్ఞాతవాసంగా గడుపుతున్నారు. ఆయన కోసం వందలాది బలగాలు నిత్యం గాలిస్తోన్నాయి. ఆయన అందరికంటే తరువాతే నిద్రించి.. వారి కంటే ముందే నిద్రలేచి దినచర్య షురూ చేస్తారని మాజీలు చెబుతున్నారు. సాహిత్యం చదవడం, పార్టీ డాక్యుమెంట్లు రాయడం, విదేశీ విప్లవ సంస్థల పోరాట ఎత్తుగడలు భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు వాటన్నిటినీ కింది స్థాయి దళాలకు చేర్చడానికి రోజూ 20 గంటలు పనిచేస్తుంటారంటున్నారు.



20 గంటల్లో రెండు గంటలు వ్యాయామం, మిగతా 18 గంటలు చర్చలు, డాక్యుమెంట్లు రాయడం, ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలను వినియోగించుకుని దళాలకు సూచనలివ్వడం వంటి పనులు చేస్తుంటారు. ఆయనకు రక్షణగా ఉన్న వారిని నిద్రపుచ్చిన తరువాత ఆయన నిద్రించి... వారు(దళ సభ్యులంతా) నిద్ర లేవకముందే మళ్లీ నిద్రలేచి కొవ్వొత్తుల వెలుగుల మధ్య తన పార్టీ డాక్యుమెంట్లను రాయడంలో నిమగ్నమవుతారని చెబుతున్నారు. ఇలా... గణపతి చేస్తున్న శ్రమ, పోరాట పటిమను ఒక విప్లవ పాఠ్యాంశంగా కింది ద ళాలకు చెబుతుంటారని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top