‘మోండా’ను ఆధునీకరిస్తాం

‘మోండా’ను ఆధునీకరిస్తాం - Sakshi

  • వారసత్వ నిర్మాణాలకు ముప్పు లేకుండా అభివృద్ధి చేస్తాం: కేసీఆర్

  • అరగంటకుపైగా మార్కెట్‌లోని గల్లీ గల్లీలో తిరిగిన ముఖ్యమంత్రికూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటూ విక్రయదారులతో ఆరా మార్కెట్‌ను కూలగొడితే తమ బతుకులేం కావాలని పలువురి ఆవేదన కూలగొట్టబోమని, ఇంకా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ

     

    సాక్షి, హైదరాబాద్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన మోండా మార్కెట్‌ను సకల సదుపాయాలతో ఆధునీకరిస్తామని... అక్కడి వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులోని ఇరుకు గల్లీల గుండా నడుస్తూ మార్కెట్ మొత్తాన్ని పరిశీలించారు. కూరగాయలు అమ్మే చోటు నుంచి కిరాణా దుకాణాలు, చేపలు, మాంసం విక్రయించే ప్రాంతాలు, కుండలు, పూజాసామగ్రి తదితర వ్యాపారాలు జరిగే అన్ని గల్లీల్లోనూ సీఎం తిరిగారు. అక్కడక్కడా కాసేపు ఆగి వ్యాపారులతో మాట్లాడారు.



    వారి వ్యాపారం గురించి, ధరల గురించి వారికెదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో కూరగాయల ధరలు, రవాణా, దిగుమతి తదితర విషయాలను వ్యాపారులతో మాట్లాడి తెలుసుకున్నారు. 1872 నుంచి మాంసం విక్రయాలు జరుగుతున్న మీట్ మార్కెట్ (భవనం) ఎంతో పురాతనమైనదని... దానిని కూల్చివేయకుండానే మార్కెట్‌ను ఆధునీకరించి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని పలువురు సీఎం దృష్టికి తెచ్చారు. మార్కెట్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు.



    దీనిపై స్పందించిన సీఎం... వారసత్వ కట్టడాలకు ఎలాంటి ముప్పులేకుండా మార్కెట్‌ను సర్వహంగులతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తాగునీటి సదుపాయం కల్పిస్తామని, మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. మార్కెట్ అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందించి అందజేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.



    ఒక వృద్ధురాలు తనకు ఇల్లు లేదని, మార్కెట్‌లో దుకాణం కావాలని సీఎంతో తన గోడు వెళ్లబోసుకోవడంతో.. ‘నీకేం బెంగ వద్దు. ఇల్లు, దుకాణం, పెన్షన్ అన్నీ సమకూరుస్తా’’ అని సీఎం హామీ ఇచ్చారు. కాగా.. వేలాది మంది ఆధారపడి జీవిస్తున్న మోండా మార్కెట్‌ను కూలగొడతారని ప్రచారం జరుగుతోందని.. కూలగొడితే తమ బ్రతుకులేం కావాలంటూ కూరగాయలు విక్రయించే పలువురు సీఎంను ప్రశ్నించగా... ‘‘మార్కెట్‌ను కూలగొట్టం. ఇంకా బాగా చేస్తాం.. ఇలా మురికి మురికి ఉంటే ఎవరు కొంటారు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

     

    నరకంలా నగరం



     మోండా సందర్శన అనంతరం ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష జరిపారు. ‘‘నగరానికి అందాన్ని ఇచ్చే హుస్సేన్‌సాగర్ మురికి కూపంగా ఉంది. అటవీ భూములున్నా ఎక్కడా చెట్లు కన్పించడం లేదు. మురుగునీటి కాల్వల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు అధ్వానం. నిత్యం ట్రాఫిక్ జాంలే! కూరగాయల మార్కెట్లలో కనీస వసతులు లేవు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ వేసవిలో హుసేన్‌సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

     

    తొలిసారిగా ఒక సీఎం..



    దాదాపు వందేళ్ల కిందట నిజాం కాలంలో ఏర్పాటైన మోండా మార్కెట్‌ను సీఎం సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి మోండా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్... మార్కెట్ మొత్తం కలియదిరిగారు. అక్కడ అల్లం, వెల్లుల్లి విక్రయించే మధుసూదన్‌రావుతో ఒక నిమిషం పాటు మాట్లాడారు. ‘అల్లమెల్లిగడ్డ ఎక్కడి నుంచి తెస్తావ్, ఎంతకు తెచ్చి, ఎంతకు అమ్ముతావు’ అని అడిగారు. క్యాప్సికం అమ్మే ఓ దుకాణం వద్ద ఆగి.. ‘ధర ఎలా ఉంది..?’ అంటూ కేసీఆర్ ఆరా తీశారు. కిలో రూ.30 వరకు అమ్ముతున్నట్లు ఆ వ్యాపారి చెప్పడంతో.. ‘అట్లనా..’ అంటూ సీఎం ముందుకు కదిలారు. గిరాకీ ఎలా ఉందంటూ పలువురు దుకాణదారులతో మాట్లాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top