క్షణికావేశం..!

క్షణికావేశం..! - Sakshi


బాధను మిగుల్చుతున్న బలవన్మరణాలు

9నెలల్లో రైలుపట్టాలపై 125 మంది ఆత్మహత్య

మనోనిబ్బరమే మార్గమంటున్న మానసిక వైద్యనిపుణులు


 

 పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఒకరు.. భర్త వేధిస్తున్నాడని ఇంకొకరు.. ప్రేమించినవాడు దక్కలేదని మరొకరు.. క్షణికావేశంలో ప్రాణాలను బలితీసుకుంటున్నారు. చిన్నచిన్న కారణాలతో జీవితంపై విరక్తిచెంది చావే మార్గమని భావిస్తున్నట్టున్నారు..! ఒకరు కాదు.. ఇద్దరు కాదు కేవలం 9 నెలలకాలంలో జిల్లాలో 125 మంది రైలుపట్టాలపై పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కన్నవారికి, ఆత్మీయులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 17వరకు ఈ మరణాలు చోటుచేసుకున్నాయి.      -



మహబూబ్‌నగర్ క్రైం

గతంతో పోల్చితే ఈ ఏడాది జిల్లాలో రైలుకింద పడి ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. గతేడాది 97 మంది చనిపోతే.. కేవలం 9 నెలల కాలంలోనే 125మంది రైలు కిందపడి తమ విలువైన ప్రాణాలు తీసుకున్నారు. గత జూన్, జూలైలోనే ఎనిమిది మరణాలు ఒక్క గద్వాల పరిధిలోనే చోటుచేసుకున్నాయి. ఇదిలాఉండగా, ఆత్మహత్య కేసుల్లో రైల్వేపోలీసులు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆచూకీ తెలియని మృతదేహాలు, వాటిన దహన సంస్కారాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోశవాన్ని ఖననం చేసేందుకు రూ.మూడువేలు ఖర్చవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికీ 72 మృతదేహాలను గుర్తించలేకపోయారు. కొన్ని మృతదేహాలను ఖననం చేసిన తరువాత మృతుల కుటుంబసభ్యులు వచ్చి అడుగుతారని.. ఆ సమయంలో వారు పడే బాధలు వర్ణణాతీతం అంటున్నారు.



9 నెలల్లో ఆత్మహత్యలు కొన్ని..



భార్య పుట్టింటికి వెళ్లిందని.. తిరిగి కాపురం రాలేదని క్షణికావేశంలో బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గామానికి చెందిన మహేష్(23) రైలు కిందపడి ఆత్మహత్యకు ఒడిగట్టాడు.



అజ్జకోలు గ్రామానికి చెందిన బొల్లి కుర్మమ్మ(28)ను భర్త వదిలేయడంతో తన ముగ్గురు పిల్లల పోషణ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన మూడేళ్ల కొడుకుతో రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడింది. నారాయణపేటకు చెందిన పండ్ల వ్యాపారి ఆర్థిక ఇబ్బందులతో జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి తనువుచాలించాడు.    ఏప్రిల్ 18న నాగర్‌కర్నూల్ చెందిన కోట్ర వినయ్(25) క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి రూ.10వేలు పోగొట్టుకుని తండ్రి మందలిస్తాడనే ఆందోళనతో జడ్చర్ల రైల్వే బ్రిడ్జి కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 4న భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో జడ్చర్లకు చెందిన సునీత(26)రైలుకింద పడి తనువు చాలించింది.



షాద్‌నగర్‌కు చెందిన సక్కెర వెంకటేష్(24)ను తల్లిదండ్రులు అతిగారాభంగా పెంచారు. ఉన్నత చదువుల కోసం లక్షలు ఖర్చుచేశారు. బీటెక్ చదివిస్తే ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటాడని భావించారు. తీరా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదని ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చాడు.



ఆత్మీయులను అనాథలుగా చేసి..



కొన్నేళ్లు అన్యోన్యంగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం ఆవహించింది. జిల్లాకేంద్రంలోని గణేష్‌నగర్‌కు చెందిన సుభాష్ (40) స్థానికంగానే ఓ చిన్న కిరాణాదుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారం సక్రమంగా సాగకపోవడంతో ఆర్థికఇబ్బందులు తలెత్తాయి. దీనికితోడు పెళ్లీడుకొచ్చిన కూతురు కళ్లముందే ఉండడంతో ఒకింత ఆందోళనకు గురయ్యేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో రైలుకింద పడి విలువైన ప్రాణాలను బలితీసుకున

 

 

ప్రతి సమస్యకు పరిష్కారం



మనిషి జీవితమంటేనే సుఖ,దుఃఖలతో కూడింది. వాటిని ఎదుర్కొనేందుకు మనిషికి చాలా మార్గాలు ఉన్నాయి. అన్నింటికి చావే.. అనుకుంటే భూమ్మీద ఒక్కరూ మిగలరు. సమస్యలు ఎదురైనప్పుడు కేవలం ఆందోళన చెందకుండా తమ కష్టాలను స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకుంటే ఆ భారం తగ్గుతుంది. ఆత్మహత్య అనే అలోచనే మానసిక వ్యాధి లాంటింది. ప్రతి మనిషిలో నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. కానీ రెండువారాల కన్నా ఎక్కువగా అటువంటి ఆలోచనలు చేస్తుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

 

- డాక్టర్ శ్రీనివాసరాజు,

 మానసిక వైద్యనిపుణులు

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top