‘ఎంఎంటీఎస్’ వేగం పెంచాలి

‘ఎంఎంటీఎస్’ వేగం పెంచాలి

  • దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన బండారు దత్తాత్రేయ

  • సాక్షి,సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రెండో దశ పనులను వేగవంతం చేయాలని బీజేపీ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు  బండారు దత్తాత్రేయ కోరారు. దక్షిణ మధ్య రెల్వేలోని  పలు పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన సోమవారం జీఎం పి.కె.శ్రీవాస్తవతో  సమావేశమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు  రెండో దశ ప్రాజెక్టును విస్తరించాలని  సూచించారు. ప్రాజెక్టు  పనుల్లో  ఎలాంటి జాప్యానికి తావు లేకుండా  రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు  తీసుకోవాలని, రాష్ర్టం వాటాగా అందజేసే 2/3 వంతు నిధుల్లో భాగంగా వచ్చే బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కేటాయించాలని  కోరారు.



    రోజు రోజుకు  పెరుగుతున్న రైళ్లు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో  ఉంచుకొని  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విస్తరించాలని, వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా  అభివృద్ధి చేయాలని  పేర్కొన్నారు. ఇందుకోసం  సికింద్రాబాద్ పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని  ప్రభుత్వం  రైల్వే స్టేషన్‌కు ఇవ్వాలని కోరారు. బోయిగూడ రైల్వే క్వార్టర్స్ స్థలాన్ని కూడా  వరల్డ్‌క్లాస్  అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చునని సూచించారు.



    మౌలాలీ రైల్వేస్టేషన్‌న అభివృద్ధి చేయడం వల్ల సికింద్రాబాద్ పై  ఒత్తిడి తగ్గుతుందన్నారు. లాలాగూడ  రైల్వే ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హోదాకు పెంచాలని, గతంలో ప్రతిపాదించినట్లుగా  నర్సింగ్ కాలేజీ  ఏర్పాటు చేయాలని కోరారు.పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓబీ,ఆర్‌యూబీ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జీఎం స్పందిస్తూ పనుల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు.

     

    స్థలం కేటాయించాలి : జీఎం



    కాజీపేట్  రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనుల పురోగతి పైన కూడా  ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా జీఎం,ప్రభుత్వం తమకు ఇప్పటి వరకు స్థలం అప్పగించలేదని, స్థలం ఇచ్చిన వెంటనే పనులు  ప్రారంభిస్తామన్నారు. పెద్దపల్లి-సికింద్రాబాద్  లైన్‌ను త్వరలో పూర్తి చేయనున్నట్లు  పేర్కొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top