రేసు మొదలైంది


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉప ఎన్నిక విజయోత్సవం టీఆర్‌ఎస్‌లో తొణికసలాడుతోంది. దూకుడు మీద ఉన్న ఆ పార్టీ నేతలు ఎమ్మెల్సీ బరిలో దిగడానికి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఒక స్థానానికి అభ్యర్థి దాదాపు ఖరారు కాగా, రెండో అభ్యర్థిని ఖ రారు చేయడం అధికారపార్టీకి తలనొప్పిగా మారింది. ఆశావహుల జాబితా చాంతాడును తలపిస్తుండడంతో అభ్యర్థి ఖరారుపై అచితూచి వ్యవహరించాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. నరేందర్‌రెడ్డికి గ్రీన్‌సిగ్నల్ దక్కడంతో రెండో స్థానాన్ని బీసీలకు కేటాయిస్తారనే ప్రచారం ఊపుందుకుంది. ఈక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శంభీపూర్ రాజు టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కేటీఆర్ ఇదివరకే హామీ ఇచ్చినందున.. టికెట్ ఖాయమనే భావన ఆయనలో వ్యక్తమవుతోంది.

 

 మరోవైపు రాజు అభ్యర్థిత్వానికి మంత్రి మహేందర్ కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లికి చెందిన రాగం నాగేందర్ యాదవ్ కూడా టికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వేడుకున్న రాగం.. తాజాగా మరోసారి సీఎంను కలిశారు. సామాజిక సమతుల్యతలో భాగంగా తనకు అవకాశం కల్పించకపోతే మహిళా కోటాలో భార్య సుజాతకు ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇదిలావుండగా, సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానంపై కన్నేశారు. ఈ క్రమంలో ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టిన ఆయన సీఎంను కలిసి మరోసారి అంతరంగాన్ని వె ల్లడించాలని భావించారు. బుధవారం బిజీ షెడ్యూల్ కారణంగా సీఎం కలవకపోవడంతో ఆయ న వెనుదిరిగారు.

 

  మరోవైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన సామల వెంకటరెడ్డి కూడా మండలి సీటుపై గంపెడాశ పెట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉండడం తనకు కలిసివస్తుందని ఆశిస్తున్న ఆయన బుధవారం యువనేత కేటీఆర్‌తో భేటీ అయి మనసులోని మాటను మరోసారి ముందుంచారు. వీరేకాకుండా చల్లా మాధవరెడ్డి తదితరులు టికెట్ కోసం తెరవెనుక ప్రయత్నాలను సాగిస్తున్నారు.

 

 డైలమాలో కాంగ్రెస్

 స్థానిక సంస్థల్లో సాంకేతికంగా అత్యధిక సీట్లు కలిగిఉన్న కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. వరంగల్ పరాజయంతో తేరుకోని ఆ పార్టీకి మండలి ఎన్నికలు సవాల్‌గా పరిణమించాయి. గెలుపుమాట దేవుడెరుగు బరిలో అభ్యర్థులెవరనే అంశంపై తేల్చుకోలేక పోతోంది. కొన్నాళ్ల క్రితం అంగ, ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను పోటీలోకి  దించాలని భావించిన కాంగ్రెస్ తాజా పరిణామాలు ఆశనిపాతంగా మారాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డిలు పోటీకి ససేమిరా అంటుండడంతో కొత్త అభ్యర్థులను వెతుకుతోంది. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌కు 280 మంది సభ్యులున్నారు. టీడీపీకి 165, బీజేపీ 59 మంది సభ్యులున్నారు. వీరి మద్దతు కూడగడితే జిల్లాలో బోణీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఎన్నికల అన ంతరం వీరిలో పలువురు గులాబీ గూటికి చేరడంతో సంఖ్యా బలంపై అంచనా తప్పింది. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఫలితంగా చెరొక అభ్యర్థిని బరిలో దించే అంశాన్ని పరిశీలిస్తోంది. పోటీకి సీనియర్లు అనాసక్తి చూపుతున్న తరుణంలో కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి అభ్యర్థిత్వానికి మొగ్గుచూపుతోంది.

 

 రెండో అభ్యర్థిగా ధారాసింగ్‌ను పోటీచేయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తోంది. మరోవైపు టీడీపీ తరుఫున శ్రీనివాస్‌రెడ్డి, సామ భూపాల్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, టీఆర్‌ఎస్ రెండో అభ్యర్థిపై స్పష్టత వచ్చిన అనంతరం వ్యూహాలకు పదునుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అభ్యర్థి బల బలాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్లు గురువారం ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top