ఆ ఒక్కరు ఎవరో?


స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి కూసిన ఎన్నికల కోడ్

 గులాబీ దళం నుంచి పెరిగిన పోటీ

 టికెట్ ఆశిస్తున్న నలుగురు

 అభ్యర్థి ఎంపికలో కీలక నేత నిర్ణయమే ఫైనల్

 కసరత్తు మొదలు పెట్టిన ఆశావహులు


 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కోడ్ కూసింది. జిల్లాలోని ఏకైక స్థానానికి అధికార పార్టీ నుంచి పలువురు ఆశావహులు టికె ట్ కోసం కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యం గా నలుగురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత ఆశీస్సులున్న వారికే టికెట్ ఖాయం కావడం అనేది బహిరంగ రహస్యం. సదరు అభ్యర్థినే సీఎం ఓకే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

                                                                                                        - సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

 

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అధికార పక్షమైన టీఆర్‌ఎస్ నుంచి ఎవరనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.మాజీ ఎమ్మెల్సీలు వి.భూపాల్‌రెడ్డి, ఆర్.సత్యనారాయణ, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఎర్రొళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భూపాల్‌రెడ్డి అనంతర జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ గూటికి చేరారు. టీఆర్‌ఎస్‌లోకి చేరే సమయంలో భూపాల్‌రెడ్డి పదవి కాలం కేవలం ఏడాది మాత్రమే.

 

 రెండోసారి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరినట్టు భూపాల్‌రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకాల మరణంతో  జిల్లాలో వేగంగా జరిగిన పరిణామాలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చాయి. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఒక అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు టీఆర్‌ఎస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. ఎమ్మెల్సీ టికెట్ కూడా మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇస్తే కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమయే అవకాశాలు ఉన్నాయని పార్టీ ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి.

 

 ఆర్.సత్యనారాయణ... పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన ఆర్.సత్యనారాయణ ఏడాది తిరగకముందే అప్పట్లో కేసీఆర్ పిలుపు మేరకు పదవీ త్యాగం చేసి ఉద్యమంలో నడిచారు. పార్టీ అధికారంలోకి వచ్చినందున ఆయన కీలకపదవిని ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

 

 ఎర్రోళ్ల శ్రీనివాస్... ఇక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కీలకంగా పనిచేశారు. సాధారణ ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన వరంగల్ ఉపఎన్నికల్లో శ్రీనివాస్‌కు దాదాపు టికెట్ ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వడం, పార్టీ బలంతో ఆయన గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. కనీసం ఎమ్మెల్సీ టికెట్ అయినా తనకు ఇవ్వాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ పార్టీని కోరినట్టు తెలిసింది.

 

 మురళీయాదవ్... జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రగొళ్ల మురళీ యాదవ్ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. బీసీ కోటా కింద తన పేరును పరిశీలించాలని కోరినట్టు సమాచారం.    

 బలం ఇదిగో.... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. జిల్లాలో మొత్తం 882 మంది ఓటర్లు ఉన్నారు.

 

 వీరిలో 46 మంది జెడ్పీటీసీలు, 685 ఎంపీటీసీలు, 145 మంది కౌన్సిలర్లు ఉన్నారు.  సీఎం కేసీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,  బాబూమోహన్ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ లేదా నగరపంచాయతీల్లో ఓటు హక్కు విని యోగించుకోవచ్చు.

 

 పార్టీల తాజా బలాబలాలు (అంచనా)


 రాజకీయ పార్టీలు         వాస్తవబలం    తాజాబలం

 టీఆర్‌ఎస్                       235              625

 కాంగ్రెస్                        489             211

 టీడీపీ                           105             23

 బీజేపీ                            07              07

 ఎంఐఎం                       13               13

 ఉభయ కమ్యూనిస్టులు    01             01

 స్వతంత్రులు                    32             02

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top