కొత్త ఎమ్మెల్యేలు వస్తున్నారు!

కొత్త ఎమ్మెల్యేలు వస్తున్నారు! - Sakshi

  •     శాసనసభ నియోజకవర్గాల  పునర్విభజనకు మొదలైన కసరత్తు

  •      కోర్‌సిటీలో ఒకటి, శివారు ప్రాంతాల్లో ఏడు నుంచితొమ్మిది కొత్త స్థానాలు

  •      పునర్విభజనకు ముందు భారీగా ఓటరు జాబితాల వడపోత

  • సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో కొత్తగా ఏడు నుంచి తొమ్మిది శాసనసభ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల కమిషన్ పునర్విభజన క మిషన్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తెలంగాణ  రాష్ట్రంలో కొత్తగా 34 శాసనసభ స్థానాలు ఏర్పడుతుండగా, అందులో సుమారు ఏడు నుంచితొమ్మిది నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే పుట్టుకొచ్చే అవకాశం ఉంది.



    మహానగరంలో జనాభాతో సమానంగా ఓటర్లు నమోదు కావటంతో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ‘డీ కోడ్’ సాఫ్ట్‌వేర్‌తో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దీంతో ఓకే ఓటరు రెండు ప్రాంతాల్లో ఉండే అవకాశం లేకుండా పోతుంది. హైదరాబాద్ జిల్లాలో జనాభాను ఓటర్లతో పోలిస్తే పెద్దగా తేడాలు కనిపించడం లేదు. శివారు నియోజకవర్గాలకు వచ్చేసరికి జనాభాకు, ఓటర్ల జాబితాలకు పొంతన కుదరటం లేదు.



    దీంతో కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి తదితర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ ప్రస్తుతం నగరంలో నమోదైన ఓటర్ల సంఖ్య వడపోత తర్వాత తగ్గినా, భారీ సంఖ్యలో వలస వస్తున్న వారితో ఏడుకు తగ్గకుండా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని అధికార యంత్రాంగం భావిస్తోంది.

     

    పునర్విభజన ఇలా ...

     

    రాష్ట్రంలోని రెండున్నర లక్షల ఓట్లు దాటిన అన్ని నియోజకవర్గాల్లో చేర్పులు మార్పులు తప్పవు.   హైదరాబాద్ జిల్లాలో ఒక్క జూబ్లీహిల్స్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య రాష్ట్ర సగటుతో సరితూగుండటంతో జూబ్లీహిల్స్ -ఖైరతాబాద్ -సనత్‌నగర్‌ల నుంచి ఒక కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఐదున్నర లక్షల ఓట్లు దాటిన కుత్బుల్లాపూర్‌ను విడగొట్టి గ్రామీణ ప్రాంతాలతో పాటు సూరారం కాలనీ, జీడిమెట్లలను కలుపుకొని నిజాంపేట లేదా కొంపల్లి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.



    నాలుగున్నర లక్షల ఓటర్లు దాటిన శేరిలింగంపల్లి, నాలుగు లక్షల వరకు చేరిన కూకట్‌పల్లిల నుంచి హైదర్‌నగర్, వివేకానందనగర్, హఫీజ్‌పేట, కేపీెహచ్‌బీలను కలిపి మరో కొత్త నియోజకవర్గాన్ని ప్రతిపాదించే అవకాశముంది. ఐదున్నర లక్షల ఓట్లకు చేరిన ఎల్‌బీనగర్‌తో పాటు ఇబ్రహీంపట్నం  పరిధిల్లోని హయత్‌నగర్ మండలాన్ని విడగొట్టి, హయత్‌నగర్ లేదా వనస్థలిపురం లేదా మరో పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది.



    నాలుగు లక్షలు దాటిన మహేశ్వరం, మూడు లక్షల తొంభైవేలకు చేరిన రాజేంద్రనగర్‌లను విడగొట్టి సరూర్‌నగర్ లేదా శంషాబాద్ పేరుతో కొత్త నియోజకవర్గాన్ని, నాలుగున్నర లక్షలు దాటిన మేడ్చల్, నాలుగు లక్షలకు చేరిన ఉప్పల్, మల్కాజిగిరిలను విడగొట్టి బోడుప్పల్‌తో పాటు అల్వాల్ నియోజకవర్గాలను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాకుండా వచ్చే ఏడాది, రెండేళ్లలో నగరానికి ఇదే స్థాయిలో వలసలు ఇలాగే కొనసాగితే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలను విడగొట్టే అవకాశం లేకపోలేదు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top