‘జానా’ తీరుపై సంపత్‌ నిరసన

రామ్మోహన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణల ముందు నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ - Sakshi


నల్ల కండువాతో అసెంబ్లీకి హాజరు

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి

తాను మాట్లాడతానన్నా జానారెడ్డి పట్టించుకోలేదని కినుక

వంశీకే మైక్‌ ఇప్పించడానికి ప్రయత్నించారని ఆరోపణ

ప్రభుత్వం కూడా అవకాశం రాకుండా కుట్ర పన్నిందని ధ్వజం

కాంగ్రెస్‌ శాసనసభాపక్షం అండగా నిలవకపోవడంపై ఆవేదన




సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభ్యుడు సంపత్‌కుమార్‌ శనివారం నల్లకండువాతో శాసనసభకుహాజరవడం చర్చనీయాంశమైంది.  ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకనిధి బిల్లుపై చర్చ సం దర్భంగా శుక్రవారం శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో సభకు హాజరైనట్లు సంపత్‌ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాట్లాడతానన్నా సీఎల్పీ నేత జానారెడ్డి తనకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిందని, దానిలోని లోతుపాతులపై అధ్యయనం చేశానని, తనకు అవగాహన ఉందని, అయినా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యా య మని అన్నారు.


కాంగ్రెస్‌కే చెందిన వంశీచంద్‌ రెడ్డికి మైక్‌ ఇప్పించడానికి జానారెడ్డి పదేపదే ప్రయత్నం చేశారని సంపత్‌కుమార్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరిని ఎత్తి చూపానని, దాంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం రాకూడదని ప్రభుత్వం కుట్ర చేసిందని, ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్‌ తలొగ్గారని ఆరోపించారు. అభివృద్ధి నిధిపై సబ్‌కమిటీలో సభ్యునిగా ఉన్న తనకు అవకాశం రాకపోతే కాంగ్రెస్‌ శాసనసభాపక్షం కూడా తనకు మద్దతుగా నిలవకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సంపత్‌ అన్నారు.


అన్ని పక్షాలు దళితుల విషయంలో సభను తప్పుదారి పట్టించాయన్నారు. కాంగ్రెస్‌పార్టీ హయాం లోనే దళితులకు మేలు జరిగిం దన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మేలును శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చిన తమ పార్టీ సభ్యులు కూడా సరిగా చెప్పలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రచేస్తే, దళిత బిడ్డగా తనకు కాంగ్రెస్‌ సభ్యులు అండగా ఉండకపోవడంతో రాత్రంతా తీవ్ర ఆవేదన చెందినట్టుగా సంపత్‌కుమార్‌ వెల్లడించారు.



సీనియర్ల బుజ్జగింపులు

నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చిన సంపత్‌ కుమార్‌ను కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ ఎమ్మె ల్యేలు పలువురు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఆయనకు నచ్చ జెప్పారు. సంపత్‌కుమార్‌తో మాట్లాడటానికి జానారెడ్డి కూడా సీఎల్పీ కార్యాలయం వైపు వచ్చారు. సంపత్‌ కోసం సీఎల్పీ కార్యాలయం ఎదుట జానారెడ్డి కొంతసేపు వేచిచూశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చెప్పినా సంపత్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు జానారెడ్డితో మాట్లాడేదీ ఏమీ లేదని, ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడతానని బెట్టు చేశారు. దీంతో జానారెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సంపత్‌ శాసనసభలో జరిగిన అంశాలపై తనకు ఆవేదన ఉందని. అన్ని విషయాలను అంత ర్గతంగానే చెప్పుకునేందుకు సీఎల్పీ సమా వేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.  



టీఆర్‌ఎస్‌లో చేరుతారా?

టీఆర్‌ఎస్‌లోని ఓ ప్రముఖ నేతతో సంపత్‌ టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీలో చేరడానికి వ్యూహంలో భాగంగానే నల్లకండువాతో సభకు వచ్చి ఉంటారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి. సంపత్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరడానికి సదరు ప్రముఖ నేతతో ఇప్పటికే చాలా సార్లు సంప్రదింపులు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. కాంగ్రెస్‌ దళి తులకు వ్యతిరేకం అన్న అపవాదు కలిగించే ప్రయత్నంలోనే సంపత్‌ కుమార్‌ ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడబోనని సంపత్‌కుమార్‌ చెప్పారు. తన కుటుంబం యావత్తు మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నదని, భవిష్యత్‌లో కూడా తాను కాంగ్రెస్‌తోనే ఉంటానని ఆయన విస్పష్టంగా చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top