చెరువంత నిర్లక్ష్యం


సాక్షి, ఖమ్మం:‘మిషన్ కాకతీయ’.. ప్రతిపాదనలు, పనుల మంజూరు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శరవేగంగా సాగుతోంది. కానీ జిల్లాలో మాత్రం తొలి దశలో కేవలం కొన్ని చెరువులకు మాత్రమే పరిపాలన పరమైన అనుమతి లభించింది. అధికారులు 374 చెరువులకు ప్రతిపాదనలు పంపితే ఇప్పటి వరకు కేవలం 13 మాత్రమే ప్రభుత్వ అనుమతికి నోచుకున్నాయి. వచ్చే ఖరీఫ్ నాటికి చెరువు ఆయకట్టుకు సాగు నీరు అందడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

 కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని చెరువుల పూడికతీత, కట్టలు, తూములు నిర్మించి ఆయకట్టు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను ప్రాజెక్టుగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ జిల్లాలోని అన్ని చెరువులను గుర్తించి తొలి దశలో కొన్ని పనులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద 4,517 చెరువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటా 20 శాతం చొప్పున ఐదేళ్లలో అన్ని చెరువుల మరమ్మతులు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ ప్రాతిపదికన తొలి దశలో 903 చెరువుల మరమ్మతులు చేయాలి. మొత్తం 583 చెరువుల సర్వేను అధికారులు పూర్తి చేశారు. వీటిలో నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ అనుమతి కోసం 374 చెరువులకు అంచనాలతో ప్రతిపాదనలు అందాయి.


 


కానీ కేవలం 13 చెరువులకు మాత్రమే పరిపాలన పరమైన అనుమతి రావడం గమనార్హం. ఈనెలాఖరు లోగా వీటికి టెండర్లు పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. దీని కోసం అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,270 అంచనాలు ప్రభుత్వానికి వచ్చాయి. ఇందులో ప్రతి జిల్లాలో 50 చెరువులకు పైగా ఆర్థికశాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది. మిగిలినవి ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 13 చెరువు పనులకే మోక్షం కలిగింది. ఇంకా 361 చెరువుల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. అనుమతి వచ్చిన వాటిలో ఖమ్మం డివిజన్‌లో 2, కొత్తగూడెం డివిజన్‌లో 11 చెరువులున్నాయి. ఖమ్మం డివిజన్‌లో సాగర్ ఆయకట్టు కింద ఉన్న చెరువుల సర్వే చేయడానికి అధికారులు నీరుందని చెబుతున్నారు.

 

 ఖరీఫ్‌కు సాగు నీరు అందేనా..?

 

 ఈ ఏడాది వర్షాభావంతో నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో చెరువుల్లో ఆశించిన స్థాయిలో నీరులేదు. జిల్లాలో ఉన్న చెరువుల్లో ఎక్కువగా కొత్తగూడెం డివిజన్ పరిధిలోనే 300 వరకు నాన్ ఆయకట్టు కింద ఉన్నాయి. ప్రతిపాదనలు పంపిన చెరువుల్లో ఎక్కువగా నాన్ ఆయకట్టు కింద ఉన్నాయి. పాలనాపరమైన అనుమతి వస్తే వచ్చే నెలలో పనులు ప్రారంభమయ్యేవి. ఆలస్యంగా అనుమతులు వస్తే.. వచ్చే ఖరీఫ్‌లో వర్షాలు ఉన్నా నీటినంతా విడుదల చేయకతప్పదు. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ ఖరీఫ్, రబీలో వర్షాలు లేక చెరువుల కింద పంటల సాగు పడిపోయింది. వచ్చే ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్న రైతులకు చెరువుల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ పనులు ప్రారంభిస్తే ఖరీఫ్ ప్రారంభం నాటికి పూర్తయ్యేవి.  ఇంకా ప్రారంభించకపోతే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం డివిజన్ మినహాయిస్తే కొత్తగూడెం డివిజన్‌లోనైనా అధికారులు తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు వ చ్చిన అనుమతులకు తోడు మరికొన్నింటికి ఇవ్వాలని అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top