మిషన్‌కు బ్రేక్


సాక్షి, మహబూబ్‌నగర్ :  జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం 7,396 వరకు చిన్నా, పెద్ద చెరువులున్నాయి. మిషన్‌కాకతీయలో భాగంగా 20 శాతం పనులు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగా 1369 చెరువులను మొదటి దశలో ఎంపిక చేశారు. వీటిలో ఇప్పటి అధికారులు 1100 చెరువులకు సంబంధిం చిన అంచనాలు పూర్తిచేశారు. అందులో ప్రభుత్వం నుంచి 908 చెరువులకు పరి పాలన అనుమతి లభించింది. అందుకు దాదాపు రూ.230 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల కావడంతో టెండర్లు కూడా పిలిచారు. ఇప్పటి వరకు 633 పూర్తయ్యాయి. వీటిలో దాదాపు 461 చెరువులకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 219 చెరువుల పనులు మాత్రమే ప్రారంభయ్యాయి.

 

 రాజకీయ గ్రహణం...

 మిషన్ కాకతీయకు తొలినుంచి రాజకీయ గ్రహణం పట్టుకుంది. చెరువుల పూడిక పనులు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి ఆన్‌లైన్ ద్వారా టెండర్లు నిర్వహించింది. ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు స్థానిక నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొవాల్సి వస్తోంది. పనులు ఎవరు దక్కించుకున్నా సరే 10శాతం కమీషన్ తీసుకొని పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పనుల్లో సగంసగం చేసుకుందామంటూ ఆఫర్ ప్రకటిస్తున్నారు. కాదు.. కూడదంటే పనులు ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు జిల్లాలో చెరువు పనులు దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్‌కు స్థానిక నాయకుల నుంచి చిత్రమైన అనుభవం ఎదురైంది.

 

 ‘చెరువు పనుల నుంచి తప్పుకోవడం లేదు కదా.. నీ సంగతి చూస్తాం. చెరువు మట్టిని మా ఊళ్లో ఎవరూ తీసుకుపోరు. పూడిక తీసిన ఒండ్రును ఎక్కడ పోస్తవో మేము చూస్తాం’ అని చెప్పడంతో ఆ కాంట్రాక్టర్ విస్తుపోయాడు. మరికొన్ని చోట్ల మా జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను పనిలో పెట్టుకోవాలని షరతులు విధిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలు అధికారపార్టీకి చెందిన స్థానిక నాయకులు చేస్తుండడంతో అధికారులు సైతం కిమ్మనడం లేదు. పైగా వారి ఆగడాలకు అండదండలు అందిస్తున్నారు.

 

 విపక్షాలకు చిత్రమైన పరీక్ష...

 మిషన్ కాకతీయలో భాగంగా విపక్ష పార్టీకి చెందిన నాయకులు దక్కించుకున్న పనులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. టెండర్ అగ్రిమెంట్లు పూర్తి చేసుకొని పనులు ప్రారంభించాలని చూసిన వారికి వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా, మార్కింగ్, ఎఫ్‌టీఎల్ గుర్తించనీయకుండా అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుతగులుతున్న సంఘటనలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. పనిలో తమకు వాటా ఇస్తే సరి, లేదంటే బిల్లులు మంజూరు కాకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో పనులు దక్కించుకున్న వారు ఈఈ, ఎస్‌ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top