‘కూతురమ్మ’కు మంత్రి కేటీఆర్‌ అండ

‘కూతురమ్మ’కు మంత్రి కేటీఆర్‌ అండ - Sakshi


- అర్చనకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం.. ఆర్థిక సాయం

- డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇస్తామన్న మంత్రి

- తల్లిదండ్రులకు నిమ్స్‌లో ఉచిత చికిత్సకు హామీ




నిర్మల్‌ రూరల్‌: ఓ ‘కూతురమ్మ’గా తనను కన్నవాళ్లనే కన్నపిల్లల్లా చూసుకుంటున్న అర్చనకు తాము అండగా ఉంటామంటూ ఆపన్న హస్తాలు చాస్తూనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సైతం స్పందించా రు. నిర్మల్‌ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన పేదింటి బిడ్డ అర్చన దీనగాథను ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో ఈనెల 18న ‘కూతురమ్మ’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అనంతరం ఈనెల 21న సాక్షి టీవీలో ‘కంటే కూతుర్నే కనాలి రా..’శీర్షికన ప్రత్యేక కథ నాన్ని ప్రసారం చేసింది. పక్షవా తం వచ్చిన తండ్రి దుర్గారెడ్డి, అం ధురాలైన తల్లి పద్మలకు అర్చన చేస్తున్న సేవలు, మందుల కోసం బియ్యం అమ్ముకుంటున్న పేదరికాన్ని.. ఓ ఆడపిల్లగా సమాజం నుంచి ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లను ‘సాక్షి’ కళ్లకు కట్టించింది. అర్చన దీనగాథ కు ఖండాంతరాల నుంచి విశేష స్పందన వస్తోంది.



స్పందించిన మంత్రి కేటీఆర్‌..

సాక్షి మీడియాలో వచ్చిన కథనాలతో స్పందించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నాలుగురోజుల క్రితం తన పర్సనల్‌ సెక్రెటరీ ద్వారా అర్చనకు ఫోన్‌ చేయిం చారు. ఈ క్రమంలో అర్చన సన్నిహితులతో కలసి బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని సచివాలయానికి వెళ్లారు. ఇదేరోజు ఉస్మానియా వర్సిటీ వందేళ్ల ఉత్సవానికి రాష్ట్రపతి రావడంతో మంత్రి కేటీఆర్‌ ఆ కార్యక్రమానికి వెళ్లారు. అర్చనను కలుసుకోవడం వీలుకాకున్నా.. తన పర్సనల్‌ సెక్రెటరీ ద్వారా విషయాలు తెలుసు కున్నారు. అర్చనకు నిర్మల్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, డబుల్‌బెడ్రూం ఇల్లుతోపాటు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆమె తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిలకు నిమ్స్‌లో ఉచితంగా వైద్యచికిత్సలు చేయిస్తామని చెప్పారు.  



‘సాక్షి’కి రుణపడి ఉంటా..: అర్చన

తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రచురించి, పదిమంది సాయపడేలా తోడ్పడిన ‘సాక్షి’ఫ్యామిలీకి రుణపడి ఉంటా. తమ దీనస్థితిపై మంత్రి కేటీఆర్‌గారు స్పందించడం, సాయం చేస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మా కష్టాలు తీరే రోజు వస్తుందన్న ఆశతో ఉన్నాను.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top